Begin typing your search above and press return to search.

హవ్వ‌!... బాబును జులాయిని చేశారే!

By:  Tupaki Desk   |   30 Jan 2019 5:21 PM GMT
హవ్వ‌!... బాబును జులాయిని చేశారే!
X
ఏపీకి ప్ర‌త్యేక హోదా సాధనే ల‌క్ష్యంగా పోరు సాగిస్తున్న‌ది తానొక్క‌డినేనంటూ బీరాలు ప‌లుకుతున్న చంద్ర‌బాబు... ఇప్పుడు అన్ని వైపుల నుంచి విమ‌ర్శ‌ల దాడి త‌ప్ప‌డం లేదు. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో బీజేపీ - జ‌న‌సేన‌తో క‌లిసి బ‌రిలోకి దిగిన చంద్ర‌బాబు... ఎలాగోలా అధికారాన్ని చేజిక్కించుకుని నాలుగేళ్ల పాటు నింపాదిగా పాల‌న సాగించారు. బీజేపీతో నాలుగేళ్ల పాటు క‌లిసి ప‌య‌నం సాగించిన చంద్ర‌బాబు... ఆ స‌మ‌యంలో ఏపీకి ప్ర‌త్యే్క హోదా అవ‌స‌రం లేద‌ని - మోదీ చెబుతున్న‌ట్లుగా ప్ర‌త్యేక ప్యాకేజీ బెట‌ర‌ని - అయినా హోదాతో వ‌చ్చేదేముంది? ప‌్యాకేజీతో హోదా కంటే మ‌రింత మెరుగైన లబ్ధి చేకూర‌నుందని, ఈ నేప‌థ్యంలో ప్ర‌త్యేక హోదా అని ఎవ‌రైనా నోరెత్తితే జైల్లో పెట్టిస్తానంటూ హూంక‌రించారు. ఇక మోదీ ప్ర‌తిపాదించిన‌ట్లుగా చెబుతున్న ప్యాకేజీ బ‌హు బాగుంద‌ని ఏకంగా అసెంబ్లీలో కూడా తీర్మానాన్ని ఆమోదించి మ‌రీ దాని ప్ర‌తిని కేంద్రానికి పంపారు. బాబు మాట‌ల‌న్నీ చాలా జాగ్ర‌త్త‌గానే న‌మోదు చేసుకుంటూ ముందుకు సాగిన బీజేపీ... చివ‌రికి ఏపీకి ప్ర‌త్యేక హోదా కాదు క‌దా... ప్ర‌త్యేక ప్యాకేజీ కూడా ఇవ్వ‌కుండా చాలా నేర్పుగా వ్య‌వ‌హారాన్ని న‌డిపించింది. ఇటు టీడీపీ, అటు బీజేపీ క‌లిసి మొత్తంగా ఏపీని న‌ట్టేట ముంచేశాయి.

అయితే ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో బీజేపీతో తెగ‌దెంపులు చేసుకున్న చంద్ర‌బాబు.. ప్ర‌త్యేక హోదా నినాదాన్ని మ‌ళ్లీ త‌న భుజ‌స్కందాల‌పైకి ఎక్కించుకున్నారు. అప్ప‌టిదాకా త‌న నోటి నుంచి వెలువ‌డిన కామెంట్ల‌కు పూర్తి విరుద్ధ‌మైన వ్యాఖ్య‌లు చేస్తూ విప‌క్షాల చేత యూట‌ర్న్ అంకుల్ అంటూ ముద్ర కూడా వేయించుకున్నారు. అయినా ఏపీకి ప్ర‌త్యేక హోదా రాక‌పోవ‌డానికి కార‌ణం బీజేపీనే అంటూ చంద్రబాబు - కాదు టీడీపీనే అంటూ బీజేపీ ఇప్పుడు ప‌ర‌స్ప‌రం నిందారోప‌ణ‌లు చేసుకుంటున్నాయి. ఈ నేప‌థ్యంలో ఇరు పార్టీల మ‌ధ్య మాట‌ల తూటాలు పేలుతున్నాయి. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న ప్ర‌స్తుత త‌రుణంలో ఈ తూటాల వేడి కూడా పెరిగిపోయింది. ఇప్పుడు ఈ వేడి తారాస్థాయికి చేరిపోయింది. ఏపీకి ప్ర‌త్యేక హోదా అవ‌స‌రం లేద‌ని మొన్న‌టిదాకా చెప్పిన చంద్ర‌బాబు ఇప్పుడు అదే ప్ర‌త్యేక హోదా కోసం ఉమ్మ‌డిగా పోరు సాగిద్దామ‌ని - అందుకు కార్యాచ‌ర‌ణ రూపొందించుకుందామ‌ని అఖిల‌పక్ష స‌మావేశాన్ని నిర్వ‌హించారు.

ఈ భేటీకి ఒక్క టీడీపీ మిన‌హా మిగిలిన ఏ ఒక్క పార్టీ రాలేదు. ఈ క్ర‌మంలో నేటి మ‌ధ్యాహ్నం మీడియా ముందుకు వ‌చ్చిన బీజేపీ సీనియ‌ర్ నేత‌ - ఆ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడు జీవీఎల్ న‌ర‌సింహారావు.. టీడీపీ వైఖ‌రిపై నిప్పులు చెరిగారు. టీడీపీ వైఖ‌రితో పాటు చంద్ర‌బాబు వ్య‌వ‌హారాన్ని ఆయ‌న తూర్పార‌బ‌ట్టార‌నే చెప్పాలి. అనంత‌పురం జిల్లాలో కొత్త‌గా ఏర్పాటైన కియా కార్ల కంపెనీ త‌న గొప్ప‌త‌న‌మేనంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్య‌ల‌నూ ఆయ‌న తిప్పికొట్టారు. అంతేకాకుండా క‌రువు నిధుల కింద ఇప్పుడు ఏపీకి విడుద‌లైన రూ.900 కోట్ల మేర నిధుల‌ను బాబు స‌ర్కారు నిక్క‌చ్చిగానే ఖ‌ర్చు చేయాల‌ని, ఇందులో ఏమాత్రం తేడా వ‌చ్చినా... ఊరుకునేది లేద‌ని హెచ్చ‌రికలు జారీ చేశారు. అంత‌టితో ఆగ‌ని జీవీఎల్‌... ఈ నిధుల వినియోగంపై త‌మ నిఘా ఉంటుంద‌ని కూడా డేంజ‌ర్ బెల్స్ వినిపించారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబును జులాయిగా అభివ‌ర్ణించేసిన జ‌వీఎల్‌... బాబుపై త‌న‌దైన మాట‌ల దాడిని తారా స్థాయికి తీసుకెళ్లార‌నే చెప్పాలి.

అయినా చంద్ర‌బాబుపై జీవీఎల్ వ్యాఖ్య‌లు ఎలా సాగాయ‌న్న విష‌యానికి వ‌స్తే.. *కియా మోటార్స్‌కూ, ఏపీ సీఎం చంద్రబాబుకూ సంబంధం లేదు. ప్రధాని నరేంద్ర మోదీ వల్లే కియా మోటార్స్ ఏపీకి వచ్చింది. నాలుగున్నరేళ్లు జులాయిగా తిరిగిన చంద్రబాబు ఇప్పుడు కష్టపడుతున్నానని చెప్పడం హాస్యాస్పదం. చంద్రబాబు దుబారా చేస్తున్న సొమ్ము ప్రజలది. సోకులు చేసుకోవడానికి కాదు. కేంద్రం ప్రకటించిన రూ.900 కోట్ల నిధులను కరవు ప్రాంతాలకే వాడాలి. ఈ ఖర్చులపై నిఘా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ పథకాలకు సిగ్గు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం పేర్లు మారుస్తోంది. హోదా కోసం ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశంలో చంద్రబాబు ఏకాకిలా మిగిలారు. రెండు పార్టీలను కూడా కలుపుకోలేని చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి ఏం పోరాడుతారు* అని జీవీఎల్ త‌న‌దైన స్టైల్లో చంద్ర‌బాబును క‌డిగిపారేశారు.