Begin typing your search above and press return to search.

పీకే తో చిరకాల స్నేహం... బీజేపీది అత్యాశేనా?

By:  Tupaki Desk   |   16 Jan 2020 8:08 AM GMT
పీకే తో చిరకాల స్నేహం... బీజేపీది అత్యాశేనా?
X
ఏపీ రాజకీయాలను కీలక మలుపు తిప్పుతుందన్న జనసేన - బీజేపీ భేటీపై పెద్ద ఎత్తున విశ్లేషణలు సాగుతున్నాయి. జనసేనతో పాటు బీజేపీకి కూడా కీలకంగానే పరిగణిస్తున్న ఈ భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారన్న విషయం సోమవారం సాయంత్రంలోగా తేలిపోనుంది. అయితే ఈ బేటీ ప్రారంభం సమయంలో భేటీ కోసం విజయవాడకు వచ్చిన బీజేపీ సీనియర్ నేత - ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు చేసిన వ్యాఖ్యలు నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఏపీలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు - రెండు పార్టీల మధ్య పొత్తు తదితరాలపై మాత్రమే భేటీలో చర్చలు జరగవని - జనసేనతో సుదీర్ఘ కాలం స్నేహం దిశగా చర్చలు జరుగుతాయని జీవీఎల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కనీసం 2024 ఎన్నికల దాకా అయినా కూడా రెండు పార్టీల మధ్య పొత్తు సాగేలా చర్చలు జరగనున్నాయని - 2024 ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి బరిలోకి దిగే విషయం పైనా చర్చలు జరగనున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.

సరే మిత్రపక్షంగా మారబోతున్న పార్టీపైనా ఏ పెద్ద పార్టీకి అయినా ఈ తరహా భావనలు ఉండటం సహజమే. అంతేకాకుండా క్షేత్రస్థాయిలో జీరో లెవెల్ మాత్రమే ఉన్న జాతీయ పార్టీగా...క్షేత్రస్థాయిలో ఓ రేంజిలో కార్యకర్తలు ఉన్న జనసేనతో పొత్తుపై సుదీర్ఘ కాలమనే మాట కూడా సర్వసాధారణమే. జాతీయ స్థాయిలో అధికార పార్టీగా ఉన్న తనకు లోకల్ లెవెల్లో మంచి కార్యకర్తల బలం ఉన్న జనసేన కలిస్తే... ఏపీలోనూ సత్తా చాటే అవకాశాలు ఉంటాయనడంలోనూ ఎలాంటి సందేహం లేదనే చెప్పాలి. అంతా బాగానే ఉంది గానీ... రోజు రోజుకూ నిర్ణయాలు మార్చుకుంటూ సాగుతుండటంతో పాటుగా పార్ట్ టైం పొలిటీషియన్ అనే ముద్ర వేసుకున్న పవన్ తో బీజేపీకి సుదీర్ఘ స్నేహం సాధ్యమేనా? అన్న ప్రశ్నలు ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

జనసేనకు సంబంధించి పవన్ కల్యాణ్ ఇప్పటిదాకా తీసుకున్న అన్ని నిర్ణయాలను పరిశీలిస్తే.. పవన్ లో స్థిర చిత్తం అనే మాట కనిపించదనే చెప్పాలి. 2014 ఎన్నికల్లో బీజేపీ - టీడీపీ కూటమికి మద్దతు పలికిన పవన్... మూడేళ్లు తిరక్కుండానే ఆ రెండు పార్టీలను బహిరంగ సభలోనే దునుమాడి..., ఆ రెండు పార్టీలకు షాకిచ్చిన సంగతి తెలిసిందే. ఇక 2019 ఎన్నికల్లో వామపక్షాలు - బీఎస్పీతో పొత్తుతో సాగిన పవన్... టీడీపీతో లోపాయికారి ఒప్పందాన్ని బయటపెట్టుకున్నారు. అంతేకాకుండా గతంలో టీడీపీతో అంటకాగి - అదే పార్టీపై సంచలన ఆరోపణలు గుప్పించిన పవన్... బీజేపీతో ఏకంగా నాలుగేళ్ల పాటు కలిసి సాగుతారన్న గ్యారెంటీ కూడా లేదు. ఈ లెక్కన... పవన్ తో చిరకాలం స్నేహం కమలనాథులకు అత్యాశేనన్న వాదన అయితే బలంగానే వినిపిస్తోంది.