Begin typing your search above and press return to search.

అవినీతికి చంద్ర‌బాబు చ‌ట్ట‌బ‌ద్ధ‌త‌:జీవీఎల్

By:  Tupaki Desk   |   6 Sep 2018 12:15 PM GMT
అవినీతికి చంద్ర‌బాబు చ‌ట్ట‌బ‌ద్ధ‌త‌:జీవీఎల్
X
గ‌త నాలుగేళ్ల కాలంలో ఏపీ సీఎం చంద్ర‌బాబు పాల‌నలో గ‌తంలో ఎన్న‌డూ జ‌ర‌గ‌నంత‌గా అవినీతి జరిగింద‌ని ప్ర‌జ‌లు అభిప్రాయ‌ప‌డుతోన్న సంగ‌తి తెలిసిందే. విశాఖ‌లోని భూకుంభ‌కోణం మొద‌లు....నివాస స్థలాల క‌బ్జాల వ‌ర‌కు టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు య‌థేచ్ఛ‌గా అవినీతికి పాల్ప‌డుతున్నార‌ని ఆరోప‌ణ‌లు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. చంద్ర‌బాబు హ‌యాంలో అవినీతి పేట్రేగిపోయిందంటూ బీజేపీ ఆరోపిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే చంద్ర‌బాబు అవినీతిపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు మండిప‌డ్డారు. ఏపీలో అవినీతికి చట్టబద్ధత కల్పించిన ఘన‌త‌ చంద్రబాబుకే ద‌క్కింద‌ని జీవీఎల్ ఎద్దేవా చేశారు. ఏపీ ఫిషరీస్‌ ద్వారా చంద్ర‌బాబు రూ.2,713 కోట్ల అవినీతికి పాల్పడ్డారని జివిఎల్ తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు.

అమరావతి బాండ్లపేరుతో చంద్ర‌బాబు మ‌రో కొత్త నాట‌కానికి తెర తీశార‌ని జీవీఎల్ మండిప‌డ్డారు. అమ‌రావ‌తి ఇన్వెస్టర్ల పేర్లు ఎందుకు బహిర్గతం చేయడం లేదో చంద్ర‌బాబు సమాధానం చెప్పాలని ఆయ‌న డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అవినీతికి పాల్పడిన వారి చిట్టాను త్వరలోనే ప్ర‌జ‌ల ముందు బ‌హిర్గతం చేస్తాన‌ని హెచ్చ‌రించారు. టీడీపీ నేతలు ఓటమి భయంతో ఉన్నారని జీవీఎల్ వ్యాఖ్యానించారు. మ‌రోవైపు, రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖా మంత్రి లేర‌ని, ఆరోగ్య సేవ‌లు అధ్వానంగా ఉన్నాయ‌ని బీజేపీ ఎమ్మెల్యేలు విష్ణు కుమార్ రాజు, మాణిక్యాలరావులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశ‌రు. గిరిజ‌న ప్రాంతాలు, ఏజెన్సీలలో ఉన్న‌ ప్రాథమిక వైద్య కేంద్రాలలోని దుస్థితుల‌పై మాట్లాడారు. అయితే, వారిద్ద‌రూ బాగా మాట్లాడారని, కానీ కేంద్రం నుంచి డబ్బులు తేవడంలో మాత్రం విఫలమవుతున్నారని చంద్ర‌బాబు...త‌న త‌ప్పుల‌ను క‌ప్పి పుచ్చుకునే ప్ర‌య‌త్నం చేశారు. ఆసుప‌త్రి భవనాలు సరిగ్గా లేవన్న బిజెపి నేతల విమర్శలతో తాను కూడా ఏకీభవిస్తున్నానని చంద్ర‌బాబు అన్నారు. కానీ, మిగ‌తా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఏపీలోనే మెరుగైన వైద్య సదుపాయాలు కల్పిస్తున్నామని త‌మ ప్ర‌భుత్వ త‌ప్పిదాల‌ను కప్పిపుచ్చుకునే ప్రయ‌త్నం చేశారు.