Begin typing your search above and press return to search.

బెడిసికొట్టిన దీక్షలు..బిక్కమొహమేసిన బీజేపీ నేతలు

By:  Tupaki Desk   |   12 April 2018 1:43 PM GMT
బెడిసికొట్టిన దీక్షలు..బిక్కమొహమేసిన బీజేపీ నేతలు
X
ఏపీ పాలిటిక్సులో నిరసనల ట్రెండు నడుస్తోంది. విపక్షం - అధికార పక్షం అన్న తేడా లేకుండా అంతా నిరసనల బాట పట్టారు. ప్రత్యేక హోదా పార్టీలన్నీ బీజేపీ తీరును ఎండగడుతూ మనస్ఫూర్తిగానో - మొహమాటంతోనో దీక్షలు చేస్తుండగా ఈరోజు బీజేపీ కూడా దీక్షలు మొదలుపెట్టింది. అయితే, బీజేపీ నేతలు ప్రత్యేక హోదా కోసం కాకుండా పార్లమెంటు సమావేశాల్లో విపక్షాల వ్యవహారశైలి బాగులేదంటూ ఒక రోజు ఉపవాస దీక్షలకు దిగారు. బీజేపీకి వ్యతిరేకంగా వాడివేడిగా ఉన్న ఏపీలో దీక్షలను సక్సెస్ చేసి మోదీ వద్ద మార్కులు కొట్టేద్దామనుకున్న ఏపీ బీజేపీ నేతలకు మాత్రం అనుకున్న ఫలితం రాలేదు.

బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహరావు దిల్లీ నుంచి వచ్చిమరీ విజయవాడలో దీక్ష చేయడానికి ప్రయత్నం చేయగా ఏపీ ప్రభుత్వం ఆయనకు అనుమతి నిరాకరించింది. విజయవాడ లెనిన్ సెంటర్‌ లో దీక్షకు తొలుత బీజేపీ నేతలు అనుమతి తీసుకున్నా చివరి నిమిషంలో లెనిన్ సెంటర్‌ లో దీక్షకు అనుమతిని పోలీసులు రద్దు చేశారు. దీంతో జీవీఎల్ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. సీపీఐ ధర్నాకు అనుమతి ఇచ్చి తమకు ఎందుకు నిరాకరించారంటూ ఆయన ఆగ్రహించారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే దీక్ష కొనసాగిస్తామన్నారు. టీడీపీ - కాంగ్రెస్ లు కుమ్మక్కై పార్లమెంటు జరగకుండా అడ్డుకున్నాయని.. ఇప్పుడు తమ దీక్షలను కూడా అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు. ప్రజల మద్దతు కోల్పోయినట్లు అర్ధం కావడం వల్లే చంద్రబాబు కాంగ్రెస్ పంచన చేరుతున్నారని.. సొంత రాష్ట్రప్రజల మద్దతు పొందలేని చంద్రబాబు ఇతర రాష్ట్రాల్లో బీజేపీని ఓడిస్తామనడం నవ్వు తెప్పిస్తోందన్నారు.

మరోవైపు పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోనూ బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజు దీక్ష చేయగా అక్కడకు వచ్చిన వామపక్ష నేతలు మోదీకి వ్యతిరేకంగా నినదించారు. దీంతో వామపక్షాలు - బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. మొత్తానికి బీజేపీ దీక్షలు చాలాచోట్ల సజావుగా సాగలేదు.. దానికితోడు ప్రజల నుంచి ఎలాంటి మద్దతు కనిపించలేదు. రాష్ట్రమంతా ప్రత్యేక హోదా కోసం ఘోసిస్తుంటే బీజేపీ నేతలు ఇలా పార్లమెంటులో గొడవల గురించి రాష్ట్రంలోకి వచ్చి దీక్షలు చేయడం ఏంటన్న ప్రశ్నలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి.