Begin typing your search above and press return to search.

బీజేపీ ఎంపీలు.. ఒక‌రి మీద మ‌రొక‌రు ఎద్దేవా!

By:  Tupaki Desk   |   6 March 2020 5:30 PM GMT
బీజేపీ ఎంపీలు.. ఒక‌రి మీద మ‌రొక‌రు ఎద్దేవా!
X
భార‌తీయ జ‌న‌తా పార్టీ క్ర‌మ‌శిక్ష‌ణ‌కు మారు పేరు అనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉంటారు ఆ పార్టీ సానుభూతి ప‌రులు. ఆ పార్టీలో చాలా మందికి ఆర్ఎస్ఎస్ నుంచినే క్ర‌మ‌శిక్ష‌ణ అల‌వాటు అవుతుంద‌ని, వారు అదే క్ర‌మ‌శిక్ష‌ణ‌ను బీజేపీలో కూడా కొన‌సాగిస్తార‌ని చెబుతూ ఉంటారు. అయితే కొత్త‌గా చేరి వ‌చ్చిన నేత‌ల వ‌ల్ల‌నో ఏమో కానీ.. భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎంపీలు ఒక‌రిని ఒక‌రు ఎద్దేవా చేసుకుంటున్న వైనం చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది.

అలా ఎద్దేవా చేసుకుంటున్న‌ది తెలుగు ఎంపీలు కావ‌డం గ‌మ‌నార్హం. భార‌తీయ జ‌న‌తా పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడు జీవీఎల్ న‌ర‌సింహారావు, ఆ పార్టీలోకి కొంత‌కాలం కింద‌ట చేరిన సుజ‌నా చౌద‌రిల మ‌ధ్య‌న కోల్డ్ వార్ కొన‌సాగుతూ ఉంది. ఏపీ రాజ‌ధాని అంశంలో వీరు మొద‌టి నుంచి భిన్న‌మైన అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ఇప్పుడు ఒక‌రి ప్ర‌క‌ట‌న‌ల‌ను మ‌రొక‌రు ప‌రోక్షంగా ఖండించుకుంటూ ఉన్నారు.

ఏపీకి రాజ‌ధానిగా అమరావ‌తే ఉండాలంటూ సుజ‌నా చౌద‌రి వాదిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈయ‌న‌కు ఆ ప్రాంతంలో భారీగా భూములున్నాయ‌నే వార్త‌లూ వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో చౌద‌రి ఎటు తిరిగీ అమ‌రావ‌తే ఏపీకి రాజ‌ధానిగా ఉండాల‌ని అంటున్నారు. అంతే కాద‌ట‌.. త‌న పార్టీ కూడా అందుకు అనుగుణంగా ప‌ని చేస్తుంద‌ని అంటున్నారు. అమ‌రావ‌తిని కాపాడుకుని తీర‌తామంటూ ఆయ‌న ప్ర‌క‌ట‌న‌లు చేశారు.

అయితే ఇప్ప‌టికే ఆ పార్టీ సీనియ‌ర్ నేత‌, అధికార ప్ర‌తినిధి క‌మ్ రాజ్య‌స‌భ స‌భ్యుడు జీవీఎల్ న‌ర‌సింహారావు మాట్లాడుతూ.. రాజ‌ధాని రాష్ట్రం ప‌రిధిలోని అంశం అని తేల్చారు. ఈ అంశంలో కేంద్రం జోక్యం చేసుకోందంటూ ప‌లు సార్లు ఆయ‌న ప్ర‌క‌ట‌న‌లు చేశారు. ఈ ప్ర‌క‌ట‌న‌లు సుజ‌నా చౌద‌రికి గాలి తీసేవిగా మారాయి.

త‌ను అధికార ప్ర‌తినిధి హోదాలో మాట్లాడుతున్న‌ట్టుగా ప‌లు సార్లు జీవీఎల్ స్పందించారు. అయితే సుజ‌నా చౌద‌రి మాత్రం.. ఏ ఎల్ల‌య్యో.. పుల్ల‌య్యో చెబితే కాదు.. అంటూ జీవీఎల్ పై ప‌రోక్ష వ్యాఖ్యానం చేశారు. దీనిపై జీవీఎల్ కూడా స్పందించారు. త‌ను మొద‌టి నుంచి చేసిన ప్ర‌క‌ట‌న‌కు క‌ట్టుబ‌డి ఉన్న‌ట్టుగా, అధికార ప్ర‌తినిధి హోదాలో స్పందించిన‌ట్టుగా.. రాజ‌ధాని విష‌యంలో త‌ను చెప్పింది పార్టీ వెర్ష‌న్ అని ఆయ‌న తేల్చారు. ఇలా సుజ‌నా చౌద‌రికి కౌంట‌ర్ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. మొత్తానికి బీజేపీ రాజ్య‌స‌భ స‌భ్యుల మ‌ధ్య‌న ఇలా ప్ర‌క‌ట‌నల కోల్డ్ వార్ కొన‌సాగుతూ ఉన్న‌ట్టుంది!