Begin typing your search above and press return to search.

విశాఖను టార్గెట్ చేసిన జీవీఎల్.. ?

By:  Tupaki Desk   |   5 Jan 2022 11:30 PM GMT
విశాఖను టార్గెట్ చేసిన జీవీఎల్.. ?
X
బీజేపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఈ మధ్య తరచూ విశాఖ టూర్ పెట్టుకుంటున్నారు. పార్టీ నేతలతో కలసి సమీక్షలు నిర్వహించడం, కేంద్ర ప్రభుత్వం ఆద్వర్యంలోని ప్రాజెక్టులను పరిశీలించడం, మీడియాలో హల్ చల్ చేయడం ద్వారా జీవీఎల్ పొలిటికల్ గా హైలెట్ అవుతున్నారు. నిజానికి విశాఖ బీజేపీకి సంబధించి చూస్తే ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్, మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు వంటి వారే ప్రముఖంగా కనిపిస్తారు.

దాంతో ఎంపీగా ఉన్న జీవీఎల్ కూడా విశాఖ మీద దృష్టి పెట్టారని టాక్ నడుస్తోంది. ప్రకాశం జిల్లాకు చెందిన జీవీఎల్ ఉత్తరప్రదేశ్ కోటాలో ఎంపీ అయ్యారు. యూపీలో ఈసారి బీజేపీకి ఎక్కువ సీట్లు రావు అన్న ప్రచారం అయితే సాగుతోంది. దాంతో మరోసారి జీవీఎల్ ఎంపీగా రాజ్యసభకు నామినేట్ అవడం కష్టమే.

దాంతో ఆయన ఏపీ నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి సేఫెస్ట్ సీటు కోసం చూసుకుంటున్నారు అంటున్నారు. ఆయన బాపట్ల నుంచి పోటీ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ఈ మధ్య ప్రచారం జరిగింది. అయితే అక్కడ పొత్తులో భాగంగా సీటు పోతే మరో ఆల్టర్నేషన్ గా విశాఖను ఎంచుకుంటున్నారని అంటున్నారు. అలాగే బాపట్లలో రాజకీయ వాతావరణం కూడా బీజేపీకి అనుకూలంగా లేదని అంటున్నారు.

ఇక విశాఖలో 2014 ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. ఆ పార్టీ ఎంపీ హరిబాబు అప్పట్లో లోక్ సభ మెంబర్ అయ్యారు. ఆయనిపుడు గవర్నర్ గా నియమితులయ్యారు. దాంతో ఎంపీ కోసం పోటీ పడే వారు బీజేపీలో ఎవరూ లోకల్ గా లేరు అంటున్నారు. మరో వైపు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధేశ్వరి కూడా ఈసారి విశాఖ వైపు చూడకపోవచ్చు అంటున్నారు. ఈ పరిణామాల నేపధ్యంలో జీవీఎల్ విశాఖ నుంచి పోటీ చేస్తారా అన్న చర్చ కూడా సాగుతోంది.

వచ్చే ఎన్నికల్లో జనసేనతో కలసి పోటీ చేయాలనుకుంటున్న బీజేపీ చివరి నిముషంలో టీడీపీతో కూడా చెలిమి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దాంతో ఈ మూడు పార్టీల ఉమ్మడి అభ్యర్ధిగా జీవీఎల్ ఉంటే కనుక తప్పనిసరిగా గెలిచే వీలుంటుంది. విశాఖ సిటీ పరిధిలో బ్రాహ్మిణ్ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. జీవీఎల్ కూడా అదే సామాజికవర్గానికి చెందిన వారు కావడంతో ఆయన గెలుపునకు సామాజిక పరిస్థితులు కూడా కలసివస్తాయని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.