Begin typing your search above and press return to search.

ఇది తెలిస్తే జిమ్ కు వెళ్ల‌లేరేమో?

By:  Tupaki Desk   |   9 April 2016 10:30 PM GMT
ఇది తెలిస్తే జిమ్ కు వెళ్ల‌లేరేమో?
X
ఫిట్‌గా ఉండేందుకు జిమ్‌ కు వెళుతుంటారా? .. మ‌రింత ఫిట్‌ నెస్ కోసం జిమ్ కు వెళ్లాల‌ని ప్లాన్ చేస్తున్నారా? అలాగైతే ఈ స‌మాచారం మీకు సాయప‌డ‌ట‌మే కాదు.. మీరు జిమ్‌కు వెళ్లాలో.. వెళ్లొద్దో కూడా నిర్ణ‌యించుకునే అవ‌కాశాన్ని క‌ల్పిస్తుంది. గ‌తంతో పోలిస్తే ఫిట్ నెస్ మీద అవ‌గాహ‌న చాలానే పెరిగింది. మ‌రింత ఆరోగ్యం కోసం జిమ్ కు వెళ్లే వారంతా అనారోగ్యాన్ని వెంట తెచ్చుకున్నార‌న్న విష‌యం తెలిస్తే షాక్ త‌గ‌ల‌క మాన‌దు. జిమ్‌ లో గంట‌లు కొద్దీ గ‌డిపే వారు కోట్లాది బ్యాక్టీరియాతో ఎంత స‌న్నిహితంగా ఉండ‌ట‌మే కాదు.. వాటిని త‌మ‌తోపాటు ఇంటికి తీసుకెళ‌తార‌న్న విష‌యం తెలిస్తే గుండె గుభేల్‌ మ‌న‌క మాన‌దు. జిమ్‌ లోని 27 ర‌కాల ప‌రిక‌రాల‌పై ప‌రిశోధ‌న‌లు జ‌రిపిన ఒక సంస్థ త‌న తాజా అధ్య‌య‌నాన్ని వెల్ల‌డించింది. ఈ మొత్తం అధ్య‌య‌నాన్ని ఒక్క‌ముక్క‌లో చెప్పాలంటే.. జిమ్‌ లో కొన్ని కోట్ల బ్యాక్టీరియా ఉంటాయ‌ని.. బ్యాక్టీరియాకు జిమ్ స్వ‌ర్గ‌ధామంగా పేర్కొంది.

కోట్ల కొద్దీ బ్యాక్టీరియా జిమ్‌ లో రాజ్య‌మేలే ప్రాంతాలు చూస్తే..

= క్యాల‌రీలు క‌రిగించేందుకు జిమ్‌ కు వెళ్లే వారంతా ఉప‌యోగించే ట్రెడ్ మిల్ పై బ్యాక్టీరియా ఎంత ఎక్కువంటే ప‌బ్లిక్ టాయిలెట్ మీద కంటే 74 రెట్లు అధికమ‌ట‌

= ఫ్రీ వెయిట్స్ మీద అయితే ఇంట్లోని టాయిలెట్ సీటు కంటే 362 రెట్లు ఎక్కువ బ్యాక్టీరియా ఉంటాయి

= ఎక్స్ ర్ సైజ్ బైక్ మీద అయితే స్కూల్ కేఫ్ ట్రే కంటే 39 రెట్లు ఎక్కువ బ్యాక్టీరియా రాజ్య‌మేలుతుంటాయి

= జిమ్‌ లో క‌నిపించే గ్రామ్ పాజిటివ్ కొస్సీ బ్యాక్టీరియా.. యాంటీ బ‌యాటిక్స్ కు కూడా లొంగ‌దు
ఎందుకిలా..

జిమ్‌ లో అన్నేసి కోట్ల బ్యాక్టీరియా తిష్ట వేసుకొని ఎందుకు ఉంటాయ‌న్న‌ది ప్ర‌శ్న‌. ఎక్కువ మంది వినియోగించ‌టం.. స‌రిగా వాటిని శుద్ధి చేయ‌టంలో జ‌రిగే లోపం కార‌ణంగా కోట్లాది బ్యాక్టీరియాకు జిమ్‌ లు ఆవాసంగా మారుతుంటాయి. జిమ్‌ కు వ‌చ్చే ప్ర‌తి ఒక్క‌రి చెమ‌ట కార‌ణంగా ఇలాంటి ప‌రిస్థితి ఉంటుంది.

ప్ర‌మాద తీవ్ర‌త ఎంత?

జిమ్‌ లో ఉండే కోట్లాది బ్యాక్టీరియా కార‌ణంగా ఉండే ప్ర‌మాద తీవ్ర‌త ఏ మోతాదులో ఉంటుందో తెలిస్తే విస్మ‌యం చెందాల్సిందే. భ‌యంతో గుండెల మీద చేతులు వేసుకోవాల్సిందే. ఉదాహ‌ర‌ణ‌కు.. ఫ్రీ వెయిట్స్‌.. ఎక్సర్ సైజ్ బైక్ మీద ఉండే బ‌సిల్ల‌స్ బ్యాక్టీరియాతో చెవి.. క‌ళ్లు.. శ్వాస‌కోస ఇన్ఫెక్ష‌న్ల ప్ర‌మాదం పొంచి ఉంది అంతేకాదు.. జిమ్‌ లోని ప్ర‌తి ప‌రిక‌రం మీదా ప‌ది ల‌క్ష‌ల‌కు త‌క్కువ కాకుండా రోగ కార‌క బ్యాక్టీరియా ఉంటే అవ‌కాశం ఉంది. ట్రెడ్ మిల్ స్క్రీన్ ను ట‌చ్ చేసిన‌ప్పుడు.. ఫ్రీ వెయిట్ ను ప‌ట్టుకున్న ప్ర‌తిసారీ బ్యాక్టీరియాలు ఎక్స్ ర్ సైజులు చేసే వారి మీద దాడి చేస్తుంటాయి. వీటి కార‌ణంగా నిమోనియా.. సెప్టిసేమియా.. చ‌ర్మ‌వ్యాధుల‌కు కార‌ణంగా నిలుస్తాయి.

దీనికి ప‌రిష్కారం ఏమిటి?

మ‌రి.. కోట్లాదిగా ఉండే బ్యాక్టీరియా నుంచి క్షేమంగా బ‌య‌ట‌ప‌డ‌టం ఎలా? అన్న‌ది ఒక ప్ర‌శ్న‌. జిమ్ మానేయ‌టానికి మించి మ‌రోదారి లేదా? అని కంగారుప‌డాల్సిన అవ‌స‌రం లేదు. కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటే బ్యాక్టీరియా దాడి నుంచి త‌ప్పించుకునే వీలుంది. జిమ్‌ లోకి ప్ర‌వేశించ‌గానే.. యాంటీ బ్యాక్టీరియా జెల్ లేదంటే ర‌సాయ‌నంతో శుభ్రం చేసుకోవాలి. యాంటీ బ్యాక్టీరియా జెల్‌ తో జిమ్‌ లో ఉప‌యోగించే ప్ర‌తి వ‌స్తువును శుభ్రం చేసిన త‌ర్వాతే వినియోగించాలి. జిమ్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చే స‌మ‌యంలో శుభ్రంగా నీళ్ల‌తో క‌డుక్కోవ‌టం.. ఇంటికి వ‌చ్చాక‌.. జిమ్ దుస్తుల్ని శుభ్రంగా ఉతికించాలి. అమ్మో.. ఇన్ని జాగ్ర‌త్త‌లు అవ‌స‌ర‌మా? అంటే మాత్రం.. జిమ్‌ కు వెళ్లే విష‌యం మీద కాస్త ఆలోచించుకోవాల్సిందే.