Begin typing your search above and press return to search.

నేటి నుండి ముంబైలో థియేటర్లు - షాపింగ్ మాల్స్ - జిమ్‌ లు క్లోజ్

By:  Tupaki Desk   |   14 March 2020 5:20 AM GMT
నేటి నుండి ముంబైలో థియేటర్లు - షాపింగ్ మాల్స్ - జిమ్‌ లు క్లోజ్
X
కరోనా వైరస్ కారణంగా దేశంలో రెండో మరణం సంభవించింది. కర్ణాటకలో గురువారం ఓ వృద్ధుడు మృతి చెందగా - తాజాగా శుక్రవారం ఢిల్లీలో 68 ఏళ్ల స్థానిక మహిళ రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో ఈ మహమ్మారి వల్ల కన్నుమూశారు. ఈ విషయాన్ని వైద్యులు వెల్లడించారు. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దుబాయ్ నుండి హైదరాబాద్ వచ్చిన ఇద్దరు వ్యక్తుల్లో ఇద్దరికి కరోనా లక్షణాలు బయటపడ్డాయి. గాంధీ ఆసుపత్రికి తరలించారు.

కరోనా దెబ్బకు ఎన్నో కంపెనీలు మూతబడ్డాయి. టెక్ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాయి. మెట్రో రైళ్లు - బస్సులు బోసిపోతున్నాయి. విమానయానం - పర్యాటకరంగం దెబ్బతిన్నాయి. ముంబై అంటేనే నిత్యం జనాలతో - వాహనాలతో రద్దీగా ఉంటుంది. అలాంటి ముంబై ఇప్పుడు బోసిపోతోంది.

మహారాష్ట్రలో వాణిజ్య రాజధాని ముంబై సహా పలు నగరాలు షట్ డౌన్ మోడ్‌ లోకి వెళ్లిపోయాయి. ముంబై - నేవీ ముంబై - పుణే - పింప్రి-చించ్వాడ్ - నాగపూర్‌ లలో సినిమా హాళ్లు క్లోజ్ అయ్యాయి. జిమ్‌ లు - స్విమ్మింగ్ పూల్స్ మూసివేయాలని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో శనివారం నుండి నగరాలు మరింత బోసిపోనున్నాయి. ఇప్పటికే ఢిల్లీ - కర్ణాటక - బీహార్ - ఒడిశా - హర్యానాలలో ఈ పరిస్థితి ఉంది.

మహారాష్ట్రలోని ప్రధాన నగరాల్లో అన్ని షాపింగ్ మాల్స్ - సినిమా థియేటర్లు - జిమ్‌ లు - స్విమ్మింగ్ పూల్స్‌ ను మూసివేస్తున్నట్లు ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే ప్రకటించారు. 13వ తేదీ రాత్రి నుండి మార్చి 30వ తేదీ వరకు అన్నింటిని క్లోజ్ చేస్తున్నట్లు తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ఎపిడిమిక్ యాక్ట్ 1897ను అమలు చేస్తున్నట్లు తెలిపారు. మీడియా ప్రతినిధులు ఆసుపత్రులకు దూరంగా ఉండాలని సూచించారు. మహారాష్ట్రలో 17 కరోనా కేసులు నమోదయ్యాయి. అందరినీ ఐజోలేషన్ వార్డులో ఉంచారు. ఇందులో 15 మంది దుబాయ్ - ఫ్రాన్స్ - అమెరికా నుండి వచ్చినవారే.