Begin typing your search above and press return to search.

హెచ్ 1 బీ వీసాల‌ను 'ఓ' తో దెబ్బేస్తున్నార‌ట‌

By:  Tupaki Desk   |   21 July 2017 4:42 AM GMT
హెచ్ 1 బీ వీసాల‌ను ఓ తో దెబ్బేస్తున్నార‌ట‌
X
అమెరికా అధ్య‌క్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత వీసాల జారీ విష‌యంలో ఎంత‌టి క‌ఠిన ప‌రిస్థితులు ఎదుర్కొంటున్న‌ది అంద‌రికి తెలిసిందే. అమెరికా మూలాల‌కు భిన్నంగా వ‌ల‌స‌ల‌పై ఆంక్ష‌లు మ‌రింత క‌ఠిన‌త‌రం చేయ‌టం.. లోక‌ల్స్‌కు ఉద్యోగాలు ఇచ్చే విష‌యంలో ప్రాధాన్య‌త ఇవ్వాల‌న్న నినాదాన్ని తెర మీద‌కు తీసుకొచ్చిన ట్రంప్‌.. ఇందులో భాగంగా విదేశాల నుంచి వ‌చ్చే వారిపై ఆంక్ష‌లు విధిస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఉద్యోగాల‌ కోసం అమెరికాకు వ‌చ్చే విదేశీయుల‌పై పెద్ద ఎత్తున ప‌రిమితులు విధిస్తున్నారు. దీంతో.. ఉపాధి కోసం అమెరికాకు వెళ్లాల‌న్న ఎంతోమంది క‌ల‌ల్ని క‌ల్ల‌లు అవుతున్నాయి. వ‌ల‌స విధానంపై క‌ఠిన‌మైన ఆంక్ష‌లు విధించిన ట్రంప్ ప్ర‌భుత్వం తీరుపై ప్ర‌పంచ వ్యాప్తంగా ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతోంది.

విదేశీయులు ఉద్యోగాల కోసం వ‌చ్చేందుకు వీలుగా జారీ చేసే హెచ్ 1బీ వీసాల‌కు బ‌దులుగా ఓ వీసాల్ని భారీగా జారీ చేస్తున్నారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారో అమెరిక‌న్ సెనేట‌ర్‌. నైపుణ్య సామ‌ర్థ్యం ఉన్న వారికి ఉద్దేశించిన హెచ్ 1 బీ వీసాల జారీపై క‌ఠిన ఆంక్ష‌ల్ని విదించిన నేప‌థ్యంలో.. ఆ కేట‌గిరికి బ‌దులుగా.. అత్యుత్త‌మ ప్ర‌తిభ‌ను ప్ర‌ద‌ర్శించే వారికి మాత్ర‌మే జారీ చేసే ఓ వీసాల‌ను జారీ చేస్తున్నారంటూ ఆరోపించారు.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. హెచ్ 1బీ వీసాలను ప‌రిమిత కాల‌ప‌రిమితితో జారీ చేస్తారు. కానీ.. ఓ వీసాల‌ను మాత్రం అలాంటి కాల ప‌రిమితి ఏమీ లేకుండా జారీ చేస్తారు. తాజాగా సెనేట‌ర్ చేసిన ఆరోప‌ణ‌ల ప్ర‌కారం చూస్తే.. ఇటీవ‌ల కాలంలో ఓ వీసాల జారీని మూడు రెట్లు పెంచిన‌ట్లుగా వెల్ల‌డించారు. సెనేట‌ర్ చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి. ఒక‌వేళ‌.. హెచ్ 1 బీ వీసాల కంటే మెరుగైన ఓ వీసాల‌ను ప‌ద్ధ‌తి ప్ర‌కారం జారీ చేయించుకుంటున్నార‌న్న ఆరోప‌ణ‌పై ట్రంప్ స‌ర్కారు దృష్టి సారిస్తే విదేశీయుల‌కు భారీగా దెబ్బ ప‌డుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇదిలా ఉంటే.. ఈ వీసాల్ని సైన్స్‌.. క‌ళ‌లు.. విద్య‌.. వాణిజ్యం.. క్రీడారంగాల్లో అత్య‌ద్భుత‌మైన నైపుణ్యం ప్ర‌ద‌ర్శించిన వారికి మాత్ర‌మే జారీ చేస్తార‌ని చెబుతున్నారు. ఓ వీసాల‌పై స‌ద‌రు సెనేట‌ర్ చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. మ‌రి.. దీనిపై అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.