Begin typing your search above and press return to search.

హెచ్‌1బీ వీసాల‌పై ట్రంప్ మార్క్ టెన్ష‌న్‌

By:  Tupaki Desk   |   22 Nov 2016 7:30 PM GMT
హెచ్‌1బీ వీసాల‌పై ట్రంప్ మార్క్ టెన్ష‌న్‌
X
డొనాల్డ్ ట్రంప్‌...అమెరికా అధ్య‌క్షుడిగా ఎన్నిక‌యి ఆ దేశ ప్ర‌జ‌ల‌కు ఊహించ‌ని షాక్ ఇచ్చిన‌ట్లే ఇపుడు వ‌ల‌స‌దారుల‌కు చుక్క‌లు చూపించేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లుగా వార్త‌లు వెలువ‌డుతున్నాయి. అధ్య‌క్ష‌ ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత హెచ్-1బీ వీసాపై ట్రంప్‌ ఏ నిర్ణయం తీసుకుంటారోన‌ని అమెరికాలో ఉంటున్న భారతీయ విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు క‌ల‌వ‌ర‌ప‌డుతున్నారు. అమెరికాలో ఐటీ కొలువులు, ఉన్నత చదువుల కోసం ఉపయోగపడే హెచ్-1బీ వీసాకు తీవ్ర పోటీ ఉంటుంది. హెచ్‌1బీ వీసా పొందేందుకు గాను ప్ర‌తి ఏటా దాదాపుగా రెండున్న‌ర నుంచి మూడు ల‌క్ష‌ల‌కు పైగా వ‌చ్చే ద‌ర‌ఖాస్తుల్లో నుంచి 65,000 మందిని ఎంపిక చేసేందుకు ఏప్రిల్ 1వ తేదీన లాట‌రీ తీస్తారు. ఇలా లాట‌రీ ద్వారా ఎంపికయిన వారు అనంత‌రం ఇంట‌ర్వ్యూకు వెళ్తారు. సాధార‌ణంగా వీసా ఇంట‌ర్వ్యూలో ఓకే అయిన వారు అమెరికా వెళ్లేందుకు తాపీగా త‌మ షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటారు. అయితే ఇపుడు ట్రంప్ పుణ్య‌మా అని త‌మ ప్ర‌యాణం విష‌యంలో గంద‌ర‌గోళ ప‌డుతున్నారు.

అధ్యక్ష ఎన్నికల ప్రచారం సందర్భంగా హెచ్-1బీ వీసాలను పునఃసమీక్షిస్తానని, భారతీయులు ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు చేస్తున్న నేపథ్యంలో అమెరికా పౌరులు నిరుద్యోగులుగా మారుతున్నారని, వీరందరినీ వెనక్కి పంపిస్తానని ట్రంప్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆయన అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో వారంతా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అందుకే ట్రంప్ ప్ర‌మాణ స్వీకారం చేసే జ‌న‌వ‌రి 20 లోపే అమెరికా వెళ్లేందుకు త‌మ ప్ర‌యత్నాల‌ను వేగ‌వంతం చేస్తున్నారు.

మరోవైపు ఈ వీసాపై ట్రంప్ వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే ఈ ప్రభావం భారత్ - అమెరికా సంబంధాలపై పడనుందని అంచనాలు వెలువ‌డుతున్నాయి. అంతర్జాతీయ మానవహక్కుల లాయర్ అమల్ క్లూనీ ఇదే విష‌యంలో ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అధ్యక్ష ఎన్నికల సందర్భంగా చేసిన వ్యాఖ్యలను ప్రపంచ దేశాలు మరిచిపోలేకపోతున్నాయని, అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక గత వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఇవ్వకూడదని క్లూనీ సూచించారు. ఇప్పటి వరకు ప్రపంచ దేశాల్లో అమెరికాకు మంచి పేరు ఉన్నదని, ఆ పేరును కాపాడటానికి ట్రంప్ కృషిచేయాలని సూచించారు. లేనిపోని సంస్కరణలు, ప్రజాఉపయోగం లేని విధానాలతో అమెరికాకు చెడ్డపేరు తేవద్దని ఘాటుగా సూచించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/