Begin typing your search above and press return to search.

హెచ్‌1బీకి పోటెత్తిన ద‌ర‌ఖాస్తులు...

By:  Tupaki Desk   |   7 April 2018 7:30 AM GMT
హెచ్‌1బీకి పోటెత్తిన ద‌ర‌ఖాస్తులు...
X
అగ్ర‌రాజ్యం - అవ‌కాశాల స్వ‌ర్గం అనే పేరున్న అమెరికాపై అనాస‌క్తి మొద‌లైంద‌నే వార్త‌ల్లో నిజం లేద‌ని తేలింది. హెచ్-1బీ వీసాల జారీ ప్రక్రియను నిర్వహించే యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీస్ (యూఎస్‌ సీఐఎస్) సంస్థ తాజాగా విడుద‌ల చేసిన వివ‌రాలే ఇందుకు నిద‌ర్శ‌నం. యూఎస్‌ సీఐఎస్ గ‌ణాంకాల ప్ర‌కారం హెచ్‌1బీ వీసాలు జారీ సంఖ్య కంటే ఎక్కువ ద‌ర‌ఖాస్తు వ‌చ్చిచేరాయి. గ‌త సోమవారం ప్రారంభించిన ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ‌కు పెద్ద ఎత్తున స్పంద‌న ల‌భించింద‌ని..ప‌రిమిత కాలంలోనే భారీ ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయని యూఎస్‌ సీఐఎస్ వివ‌రించింది.

అమెరికా కంపెనీలు ప్రత్యేక వృత్తుల్లో నిపుణులైన విదేశీ సిబ్బంది నియామకానికి హెచ్1బీ వీసా వీలు కల్పిస్తుంది. ఏటా 65వేల వీసాలను మాత్రమే మంజూరు చేస్తుంటారు. ఈ వీసాలకు ప్రపంచ దేశాల్లో విపరీత డిమాండ్ ఉంది. ముఖ్యంగా భారత్ - చైనాల నిపుణులు ఈ వీసాలతో అధికంగా లాభపడుతున్నారు. దీంతో ఏటా వేలాది మంది అమెరికాకు వలస వెళ్తున్నారు. గ‌త సోమవారం నుంచి యూఎస్‌ సీఐఎస్ హెచ్1బీ దరఖాస్తులను స్వీకరిస్తోంది. అయితే హెచ్-1బీ వీసా జారీకి కఠిన నిబంధనలు అమలు చేస్తుండటంతో భారతీయ కంపెనీలు - కన్సల్టెన్సీలు వీసా దరఖాస్తులను తగ్గించినట్టు పలు అమెరికా పత్రికలు ప్రస్తావించాయి. అయితే తాజాగా యూఎస్‌ సీఐఎస్ దాన్ని తోసిపుచ్చింది.

యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీస్ ప్ర‌తినిధి తాజాగా ఈ మేర‌కు వివ‌రాలు అందిస్తూ విదేశీ వృత్తి నిపుణుల‌కు అందించే 65,000 హెచ్‌1బీ వీసాల‌కు మించి ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయన్నారు. పూర్తి సంఖ్య‌ను తాము ఇంకా క్రోడీక‌రించ‌లేద‌ని వివ‌రిస్తూ...వ‌చ్చిన ద‌ర‌ఖాస్తుల్లో నుంచి అర్హుల‌ను ఎంపిక చేసేందుకు గ‌తంలో అవ‌లంభించిన లాట‌రీ విధానాన్నే పాటిస్తామ‌ని తెలిపారు. తిర‌స్క‌ర‌ణ‌కు గురైన వారి ద‌ర‌ఖాస్తుల ఫీజును తిరిగి చెల్లిస్తామ‌ని ఆయ‌న వివ‌రించారు. ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌ను సైతం నిలిపివేయ‌బోమ‌ని అన్నారు.