Begin typing your search above and press return to search.

ఆ బిల్లు ఆమోదం పొందితే మ‌న ఐటీకి దెబ్బే!

By:  Tupaki Desk   |   12 Sep 2016 5:52 AM GMT
ఆ బిల్లు ఆమోదం పొందితే మ‌న ఐటీకి దెబ్బే!
X
అమెరికాలో మ‌రోసారి వీసాల ర‌గ‌డ మొద‌లైంది. హెచ్ 1బి - ఎల్-1 వీసాల‌పై మ‌రోసారి చ‌ర్చ ప్రారంభ‌మైంది. ఈ వీసాల ద్వారా అత్య‌ధిక స్థాయిలో విదేశీయులు అమెరికా వ‌చ్చి - స్థానికుల ఉద్యోగావ‌కాశాల‌కు గండి కొడుతున్నార‌న్న వాద‌న ప్ర‌తినిధుల స‌భ‌లో మ‌ళ్లీ మొద‌లైంది. అమెరిక‌న్ల కడుపు కొట్టేలా ఉన్న ఈ రెండు వీసాల‌ను ర‌ద్దు చేయాలంటే రిప‌బ్లిక‌న్ పార్టీ - డెమొక్ర‌టిక్ పార్టీకి చెందిన ఇద్ద‌రు స‌భ్యులు ఓ బిల్లును దిగువ స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టారు. చిత్రం ఏంటంటే... ఈ ఇద్దరు ప్ర‌తినిధులూ భార‌తీయులు అత్య‌ధికంగా నివాసం ఉంటున్న న్యూజెర్సీ - కాలిఫోర్నియా ప్రాంతాల నుంచే ప్ర‌తినిధులు స‌భ‌కు ఎన్నిక‌య్యారు.

హెచ్ 1బి - ఎల్‌-1 వీసాల సంస్క‌ర‌ణ చ‌ట్టం - 2016 పేరుతో ఈ బిల్లును చ‌ర్చ‌కు తీసుకొచ్చారు. 50 మంది కంటే ఎక్కువ ఉద్యోగులు ఉన్న కంపెనీలు ఈ వీసాల విష‌యంలో కొన్ని ప‌రిమితుల‌కు లోబ‌డి ఉండాల‌ని ప్ర‌తిపాదించారు. ఒక సంస్థ‌లో స‌గానికిపైగా ఉద్యోగులు ఈ వీసాల మీదే ప‌నిచేస్తుంటే... ఇక‌పై ఈ వీసాల ద్వారా విదేశీ ఉద్యోగుల‌ను తీసుకోవ‌డం నిషేధించాల‌ని వారు పేర్కొన్నారు. నిజానికి, ఇదే బిల్లు 2010లో కూడా స‌భ‌లో చ‌ర్చ‌కు వ‌చ్చింది. అప్పుడు కూడా ఈ ఇద్ద‌రు ప్రతినిధులే బిల్లు ప్రవేశ‌పెట్టారు. అయితే, దీనికి మ‌ద్ద‌తు ల‌భించ‌క‌పోవ‌డంతో నాడు ఈ బిల్లు బుట్ట‌దాఖ‌లైంది. ప్ర‌స్తుతం అమెరికాలో అధ్య‌క్ష ఎన్నిక‌ల సీజ‌న్ కాబ‌ట్టి, మ‌రోసారి ఈ బిల్లును స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టారు.

అమెరికాలో హైటెక్ నిపుణులు ఉన్నార‌నీ - ప్ర‌తీయేటా ఎంతోమంది నిపుణుల‌ను అమెరిక‌న్ విద్యా సంస్థ‌లు త‌యారు చేస్తున్నా కూడా స్థానికంగా వారికి ఉద్యోగాలు రావ‌డం లేద‌ని మండిప‌డ్డారు డెమొక్ర‌టిక్ పార్టీ స‌భ్యుడు బిల్ పాస్క‌ర‌ల్‌. ఈ వీసాల వ‌ల్ల‌నే స్థానికుల‌కు అన్యాయం జ‌రుగుతోంద‌నీ, విదేశీ ఉద్యోగుల సంఖ్య పెరుగుతోంద‌ని ఆయ‌న మండిప‌డ్డారు. కాబ‌ట్టి స్థానికుల ఉపాధికి అడ్డంకిగా మారుతున్న ఈ రెండు వీసాల‌పై నిషేధం విధించాల‌ని బ‌లంగా త‌మ వాద‌న‌ను వినిపించారు. అయితే, ఈ బిల్లు అమ‌ల్లోకి రావాలంటే చాలా ప్రాసెస్ ఉంది. ప్ర‌తినిధుల స‌భ‌తోపాటు ఎగువ స‌భ కూడా దీన్ని ఆమోదించాల్సి ఉంటుంది. ఆ త‌రువాత‌, అమెరికాలోని కార్మిక సంఘాలు కూడా బిల్లుకు మ‌ద్ద‌తు తెల‌పాల్సి ఉంటుంది. అమెరికా అధ్య‌క్షుడు ఆమోదం కూడా తోడైతే అప్పుడు ఇది అమ‌ల్లోకి వ‌స్తుంది.

ఈ బిల్లు మ‌రోసారి స‌భ‌లో చ‌ర్చకు రావ‌డంతో భార‌తీయ ఐటీ కంపెనీలకు కాస్త టెన్ష‌న్ మొద‌లైంద‌ని చెప్పాలి. ఎందుకంటే, ఈ రెండు వీసాలనూ భార‌త ఐటీ కంపెనీలే ఎక్కువ‌గా వినియోగించుకుంటున్నాయి క‌దా! ప్ర‌స్తుతం స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టిన బిల్లు చ‌ట్ట‌మైతే, ఆ ప్ర‌భావం భార‌త కంపెనీల‌పైనే ఎక్కువ‌గా ప‌డే అవ‌కాశం ఉంది. ఈ బిల్లు య‌థాత‌థంగా ఆమోదం పొందితే మ‌న ఐటీ కంపెనీల ఆదాయం దెబ్బ‌తినే అవ‌కాశం ఉంది. నిజానికి, ఇప్ప‌టికే కొన్ని కండిష‌న్లు మార్చి భార‌తీయ కంపెనీల ఆదాయానికి గండి ప‌డేలా చేశారు. ఈ రెండు వీసాల ఫీజుల‌నూ అనూహ్యంగా గ‌త ఏడాదే పెంచేశారు. ప్ర‌స్తుతం ఒక హెచ్‌1-బి వీసాకి సుమారుగా రూ. 2.69 ల‌క్ష‌లు - ఎల్‌-1 వీసాకి రూ. 3.02 ల‌క్ష‌లు ఖ‌ర్చు చేయాల్సింది వ‌స్తోంది. వీసాల ఫీజులు భారీగా పెంచ‌డం భారంగా మారుతోంద‌న్న విష‌యాన్ని అమెరికా అధ్య‌క్షుడు ఒబామా దృష్టికి గ‌తంలోనే తీసుకెళ్లారు ప్ర‌ధాన‌మంత్రి మోడీ. ఒబామాను క‌లుసుకున్న ప‌లు సంద‌ర్భాల్లో కూడా ఇదే విష‌యం ప్ర‌స్థావించారు. అయినా, ఇంత‌వ‌ర‌కూ దాని గురించి అమెరికా స్పంద‌నే లేకుండా పోయింది.