Begin typing your search above and press return to search.

ట్రంప్ బ్యాక్ స్టెప్..అమెరికాలోని మన లేడీస్ కు బిగ్ రిలీఫ్

By:  Tupaki Desk   |   19 Sep 2019 4:38 AM GMT
ట్రంప్ బ్యాక్ స్టెప్..అమెరికాలోని మన లేడీస్ కు బిగ్ రిలీఫ్
X
అగ్రరాజ్యం అమెరికాలో విద్య - కొలువు - స్థిర నివాసం అంటే మనోళ్లకు బాగా ఇష్టం కదా. అయితే... అలా మనోళ్ల మాదిరే చాలా దేశాలకు చెందిన వృత్తి నిపుణులు కూడా అమెరికాకు పరుగులు పెడుతున్న వైనం మనకు తెలియనిదేమీ కాదు. ఈ తరహా వలసలతో అమెరికాలో వసలదారుల సంఖ్య పెరిగిపోతోందని అమెరికన్లు గోల పెడుతున్న సంగతీ తెలిసిందే. ఈ తరహా గోల గతంలో పెద్దగా వినిపించేది కాదు గానీ... వలసదారులంటేనే అంతెత్తున ఎగిరిపడే డొనాల్డ్ ట్రంప్ ఆ దేశానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక... వలసదారులకు ఇక్కట్లు మొదలయ్యాయని చెప్పక తప్పదు. ఇలాంటి ఇక్కట్లలో మన వృత్తి నిపుణులు తమ వెంట అక్కడికి తీసుకెళ్లిన వారి భార్యల మెడపై ఇప్పుడు కత్తి వేలాడే పరిస్థితి వచ్చింది. అయితే అలాంటి వారికి కూడా ఇప్పుడు ట్రంప్ సర్కారు బిగ్ రిలీఫ్ ఇచ్చిందనే చెప్పాలి. వచ్చే ఏడాది చివరి దాకా కొనసాగనున్న ఈ రిలీఫ్... ఆ తర్వాత కొనసాగుతుందో - లేదో తెలియదు గానీ... ప్రస్తుతానికి అయితే సేఫ్ జోన్ లోనే ఉన్నట్లు లెక్క.

ఈ కథాకమామీషు ఏమిటన్న వివరాల్లోకి వెళితే... అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు సాగించే కంపెనీలు (అక్కడివి అయినా - మన దేశానికి చెందినవి అయినా) ఇతర దేశాలకు చెందిన వృత్తి నిపుణులను అక్కడికి పిలిపించుకుంటున్న సంగతి తెలిసిందే. అలాంటి వారికి జారీ చేసే హెచ్-1బీ వీసాల్లో మెజారిటీ వాటా మనదే కదా. ఈ వీసాల మీద అమెరికాకు వెళ్లిన మన సాంకేతిక నిపుణులు తర్వాతి కాలంలో తమ సతీమణులను కూడా అక్కడికి తీసుకెళుతున్నారు. ఇలాంటి వారు హెచ్-4ఈఏడీ వీసాల ద్వారా అక్కడ కాలుపెట్టేవారు. వీరు అక్కడ ఖాళీగా ఉండకుండా తమ భర్తలతో పాటు తామూ పనిచేసేందుకు అవకాశాలను వెతుక్కుంటున్న సంగతి తెలిసిందే. ఇలాంటి వారికి ఇకపై ఉద్యోగాలు ఇచ్చేది లేదంటూ ఓ కొత్త చట్టాన్ని తీసుకువచ్చేందుకు ట్రంప్ సర్కారు యత్నించింది. దీంతో ఈ వీసాలపై అక్కడ ఉంటున్న 1.2 లక్షల మందిలో 90 శాతానికి పైగా ఉన్న భారతీయ మహిళలపై నిజంగానే కత్తి వేలాడే పరిస్థితి.

అయితే ఇప్పుడు ఈ వీసాలను ఎత్తివేసే కార్యక్రమానికి తాత్కాలికంగా స్వస్తి చెప్పినట్లు అమెరికా సర్కారు అక్కడి కోర్టుకు తెలిపింది. వచ్చే ఏడాది చివరి దాకా ఈ విషయంలో ఇప్పుడున్న పద్దతిని యధాతథంగా కొనసాగించనున్నట్లుగా అమెరికా హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ స్పష్టం చేసింది. ఈ మేరకు హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ... ఈ విషయంపై కొనసాగుతున్న విచారణ సందర్భంగా కొలంబియా డిస్ట్రిక్ట్ సర్క్యూట్ కోర్టుకు వెల్లడించింది. హెచ్-4ఈఏడీ వీసాల రద్దు విషయంపై ఇప్పటికిప్పుడు ఎలాంటి మార్పు లేదని, వచ్చే ఏడాది దాకా పాత పద్దతినే కొనసాగించనున్నట్లుగా అమెరికా ప్రభుత్వం కోర్టుకు తేల్చి చెప్పింది. ఈ వార్త అక్కడ బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్న మన మహిళలకు బిగ్ రిలీఫేనని చెప్పక తప్పదు.