Begin typing your search above and press return to search.

హెచ్‌1బీ వీసా... ఇండియ‌న్ల ద‌మ్మేంటో అమెరికాకు తెలిసిపోయింది

By:  Tupaki Desk   |   10 Feb 2022 5:24 AM GMT
హెచ్‌1బీ వీసా... ఇండియ‌న్ల ద‌మ్మేంటో అమెరికాకు తెలిసిపోయింది
X
అవకాశాల స్వ‌ర్గంగా పేరొందిన అగ్ర‌రాజ్యం అమెరికాలో అన‌వ‌స‌ర భ‌యాలు, ఎదుటివారిని ఇరుకున‌పడేసే ఉద్దేశాల‌తో త‌మ‌ను తాము ఎలా స‌మ‌స్య‌ల పాలు చేసుకుంటార‌నేందుకు తాజాగా వెలువ‌డిన హెచ్‌1బీ వీసా గ‌ణాంకాలే నిద‌ర్శ‌న‌మ‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.

అమెరికాలోని అవ‌కాశాల‌ను కైవ‌సం చేసుకొని అక్క‌డ ఉద్యోగం చేసుకునేందుకు ఉద్దేశించిన హెచ్‌1బీ వీసాల వ‌ల్ల అమెరికా పౌరుల‌కు న‌ష్టం జ‌రుగుతోంద‌ని, అందువ‌ల్ల స్థానికుల‌కు మాత్ర‌మే ఉద్యోగాలు ఇవ్వాల‌ని గ‌తంలో ప‌లువురు ఆందోళ‌న చెంద‌డం, ప‌లు చ‌ట్ట స‌వ‌ర‌ణలు జ‌ర‌గ‌డం తెలిసిన సంగ‌తే. అయితే, దీనివ‌ల్ల స్థానికుల‌కు ఉద్యోగాల సంగ‌తి ప‌క్క‌న‌పెడితే, కంపెనీల‌కు స‌రైన మాన‌వ వ‌న‌రులు దొర‌క‌డం లేద‌ని ఆ దేశ కంపెనీలు వాపోతున్నాయి.

అమెరికాకు చెందిన నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ(ఎన్ఎఫ్ఏపీ) తాజా నివేదికలో హెచ్‌1బీకి సంబంధించిన సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. 2019 నుంచి 2021 వ‌ర‌కూ హెచ్‌1బీ నిబంధ‌న‌ల వ‌ల్ల స‌రైన మాన‌వ వ‌న‌రులు దొర‌క‌లేద‌ని పైగా కంపెనీల్లో ఖాళీలు ఉన్నాయ‌ని తెలిపింది. హెచ్-1బీ వీసాలు 2019లో 1,90,000 ఇవ్వ‌గా 2020లో 1.25 లక్షలకు ఆ సంఖ్య ప‌డిపోయింద‌ని వెల్ల‌డించింది.

2021 క‌రోనా వ‌ల్ల కేవ‌లం65 వేల హెచ్‌1బీ వీసాలే ఇచ్చార‌ని వెల్ల‌డించింది. చిత్రంగా హెచ్-1బీ వీసాలు జారీ చేసేందుకు 2021లో అమెరికా ప్రభుత్వం రెండు మార్లు లాటరీ నిర్వహించాల్సి వచ్చింద‌ట‌.

విదేశీయుల‌కు ఇచ్చే ఈ వీసాలు త‌గ్గిపోవ‌డం మ‌రోవైపు అమెరికాలోని ఉద్యోగాలు అమెరికన్లు చేయ‌క‌పోవ‌డం కార‌ణంగా అమెరికా కంపెనీల్లో ఖాళీల సంఖ్య పెరిగిపోయింద‌ట‌. ఎన్ఎఫ్ఏపీలోని పరిశోధకురాలు మేడలిన్ జావడ్నీ తాజా నివేదిక‌పై స్పందిస్తూ, హెచ్-1బీ వీసాదారుల స్థానాన్ని భర్తీ చేయగల నిపుణులైన అమెరికన్లు తగిన సంఖ్యలో లేనందునే కంపెనీలు విదేశీయుల‌ను ఆహ్వానిస్తున్నాయని స్ప‌ష్టం చేశారు.

ఈ వీసా వ‌ల్ల స్థానికులు ఉద్యోగాలు న‌ష్ట‌పోతార‌న్నది నిజం కాదని, ఈ వీసాల క‌ఠిన నిబంధ‌న‌ల‌తో వారికే ఉద్యోగాలు వ‌స్తాయ‌న్న‌ది కూడా నిజం కాదు అని వివ‌రించారు. మొత్తంగా అమెరిక‌న్ కంపెనీలు చేసిన వాదనే ఇప్పుడు నిజ‌మ‌ని తేలింది. ఇదిలాఉండ‌గా, హెచ్1బీ వీసా పొందుతున్న వారిలో మెజార్టీ ఇండియ‌న్లే అన్న సంగ‌తి తెలిసిందే.