Begin typing your search above and press return to search.

అమ‌రావ‌తి నిర్మాణానికి కేసీఆర్ అభిమాన ఆర్కిటెక్ట్‌!

By:  Tupaki Desk   |   11 Dec 2016 8:35 AM GMT
అమ‌రావ‌తి నిర్మాణానికి కేసీఆర్ అభిమాన ఆర్కిటెక్ట్‌!
X
న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు ఇష్ట‌మైన ఆర్కిటెక్ట్‌ పాలుపంచుకోనున్నారు! అది కూడా మాస్ట‌ర్ డిజైన‌ర్ హోదాలో ఆయ‌న భాగ‌స్వామ్యం ఉండ‌నుంది!! అమ‌రావ‌తి నిర్మాణ బాధ్య‌త‌లు చూస్తున్న సీఆర్‌డీఏ విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న ప్ర‌కారం ప్ర‌ధాన భ‌వ‌నాల నిర్మాణ ఎంపిక‌లో భాగంగా మాస్ట‌ర్ ఆర్కిటెక్ట్ ను ఖ‌రారుచేసేందుకు ఇటీవ‌ల టెండ‌ర్లు పిల‌వ‌గా బ్రిట‌న్‌కు చెందిన ప్ర‌ముఖ డిజైన‌ర్ నార్మ‌న్‌ ఫోస్ట‌ర్‌, ముంబైకి చెందిన హ‌ఫీజ్ కాంట్రాక్ట‌ర్ త‌మ ఆస‌క్తిని వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో వారిద్ద‌రినీ సంయుక్తంగా ఎంపిక‌చేసిన‌ట్లు సీఆర్‌డీఏ తెలిపింది. ఈ ఇద్ద‌రు క‌లిసి ప‌నిచేస్తార‌ని పేర్కొంటూ త‌మ ఫీజుగా వారు రూ.67 కోట్లు కోట్ చేశార‌ని వివ‌రించారు.

తెలుగు రాష్ట్రాల్లోని ప్ర‌భుత్వ భ‌వ‌నాల నిర్మాణాల వ్య‌వ‌హారాల్లో హ‌ఫీజ్ కాంట్రాక్ట‌ర్ ఎంట్రీ తెలంగాణ సీఎం కేసీఆర్ ద్వారానే జ‌రిగింద‌నేది తెలిసిందే. కొత్త రాష్ట్ర సీఎంగా అధికార ప‌గ్గాలు చేప‌ట్టిన త‌ర్వాత కొత్త స‌చివాల‌యం నిర్మాణం కోసం సిద్ధ‌మైన కేసీఆర్ ఈ క్ర‌మంలో అద్భుత‌మైన డిజైన్ల కోసం ముంబైకి చెందిన హ‌ఫీజ్‌తో అనేక స‌మీక్ష‌లు జ‌రిపారు. ఒక ద‌శ‌లో ఆయ‌న డిజైన్లు ఖ‌రారు చేయ‌గా వాస్తు కోణంలో కేసీఆర్ ప‌క్క‌న పెట్టేశార‌ని వార్త‌లు వెలువ‌డ్డాయి. కాగా నిధుల కొర‌త‌, కోర్టు కేసులు, ఇత‌రత్రా కార‌ణాల‌తో కొత్త సెక్ర‌టేరియ‌ట్ వెనక్కుపోయింది. తాజాగా కేసీఆర్ నిర్మించిన నూత‌న క్యాంప్ కార్యాల‌యం ప్ర‌గ‌తి భ‌వ‌న్ కు సైతం హ‌ఫీజ్ డిజైన్లు అంద‌జేశారు. అలా తెలంగాణ ప్ర‌భుత్వ ముఖ్య‌మైలో కీల‌క భాగ‌స్వామ్యం పంచుకున్న హ‌ఫీజ్ ఇపుడు న‌వ్యాంధ్ర‌ప్రదేశ్ విష‌యంలో అదే పాత్ర‌ను పోషిస్తుండ‌టం ఆస‌క్తిక‌రం.