Begin typing your search above and press return to search.

ఎన్నిక‌ల్లో పోటీకి పాక్ ఉగ్ర‌వాది రెడీ

By:  Tupaki Desk   |   21 Sep 2017 4:24 AM GMT
ఎన్నిక‌ల్లో పోటీకి పాక్ ఉగ్ర‌వాది రెడీ
X
ఉగ్ర‌వాదుల‌కు కేరాఫ్ అడ్ర‌స్ అయిన పాకిస్థాన్‌ లో పాల‌న‌లో కూడా తీవ్ర‌వాదులు జోక్యం చేసుకుంటార‌నేది అంద‌రికీ తెలిసిన విష‌యమే. అయితే అది ప‌రోక్షంగానే. కానీ ఇప్పుడు ఏకంగా ప్ర‌త్య‌క్షంగా వారి ఎంట్రీ ఉండ‌బోతోంది. మ‌న దేశ ఆర్థిక రాజ‌ధాని అయిన‌ ముంబయిపై ఉగ్రదాడికి సూత్రధారి - జమాత్ ఉద్ దవా హఫీజ్ సరుూద్ పాకిస్తాన్ ఎన్నికల్లో పోటీకి ఉవ్విళ్లూరుతున్నాడు. హఫీజ్ నాయకత్వంలోని జమాత్ పార్టీ 2018 ఎన్నికల్లో పోటీ చేస్తుందని ఓ సీనియర్ సభ్యుడు వెల్లడించాడు. ఇటీవల ఉప ఎన్నికల్లో అభ్యర్థిని పోటీకి పెట్టిన హఫీజ్ సార్వత్రిక ఎన్నికల్లో సత్తాచాటుతామని ప్రకటించాడు. అంతేకాదు త‌మ ల‌క్ష్యం భార‌త్ అని స్ప‌ష్టం చేసేశాడు.

2008లో ముంబయి ఉగ్రవాద దాడికి సూత్రధారి హఫీజ్ మిల్లి ముస్లిం లీగ్ పేరుతో ఓ పార్టీని ప్రకటించాడు. లాహోర్‌ లో గృహ నిర్బంధానికి ముందు ఇది జరిగింది. కాగా ఉపఎన్నికల్లో ఉద్ దవా అభ్యర్థి షేక్ యాకూబ్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ భార్య కుల్‌ సూం నవాజ్ చేతిలో ఓడిపోయాడు. పనామా పేపర్ల కుంభకోణం కేసులో నవాజ్ షరీఫ్‌ ను పాక్ సుప్రీం కోర్టు అనర్హుడిగా ప్రకటించడంతో ఉప ఎన్నిక జరిగింది. యాకూబ్ కూడా మిల్లి ముస్లింలీగ్ పార్టీ తరఫునే పోటీకి దిగాడు. మిల్లి ముస్లింలీగ్ ఎన్నికల కమిషన్ వద్ద రాజకీయ పార్టీగా నమోదు కాలేదు. ఉప ఎన్నికల ముందే పార్టీగా అవిర్భవించడం, పోటీకి దిగడం జరిగిపోయింది. అయినా ఓటర్లను ఆకట్టుకోవడంలో సఫలీకృతమైనందున వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ పోటీ చేయాలని జమాత్ ఉద్ దవా నిర్ణయించినట్టు సీనియర్ నేత వెల్లడించారు. ‘ఉప ఎన్నికల్లో ప్రజల ఆదరణ మరువలేం. ఇండిపెండెంట్‌ గా పోటీచేసినా మంచి ఓట్లే వచ్చాయి. ప్రజా కోర్టులో దిగడం మొదటిసారి. అయినా జనం మద్దతు లభించింది’ అని ఉప ఎన్నిక‌ల్లో ఓడిపోయిన‌ యాకూబ్ సంతృప్తి వ్యక్తం చేశాడు. శతృ దేశాలైన భారత్ - అమెరికా - ఇజ్రాయెల్ పట్ల కఠినంగా ఉండేలా పాక్ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని అతడు వెల్లడించారు. పలు సమస్యలపై పోరాడుతూ ప్రజలకు మరింత చేరువ అవుతామని యాకూబ్ చెప్పాడు.