Begin typing your search above and press return to search.

ప్రకృతి పగబడితే ఇలా ఉంటుంది..

By:  Tupaki Desk   |   27 April 2019 5:45 AM GMT
ప్రకృతి పగబడితే ఇలా ఉంటుంది..
X
మనం చిన్నప్పుడు అంటే దాదాపు 20-30 ఏళ్ల కిందట ముచ్చట ఇదీ.. ఎండాకాలం వచ్చిందంటే చాలు ప్రభుత్వ స్కూళ్లకు సెలవులు వచ్చేవి.. పిల్లలందరూ చెట్టూ పుట్టా వెంబడి ఆడుకునేవారు.. చింతకాయలు, వివిధ పండ్లు, ఫలాల కోసం ఊరు బయటకు వెళ్లేవారు.. కొందరు ఈత కొట్టేవారు.. అప్పుడు అసలు ఎండలు ఇంత ఉండేవి కాదు.. దీంతో సమ్మర్ ను పిల్లలు ఎంజాయ్ చేసేవారు. ఆకాల వర్షాలు, ఇలా వడగండ్లు, అకాల నష్టాలు అనేవి ఉండేవే కావు.. ప్రకృతి కాలానుగుణంగానే పలకరించేది. వానలు కురిపించేది.. ఎండలు 35 డిగ్రీలు దాటేవి కాదు..

కానీ ఇప్పుడు ఏప్రిల్ , మే నెలల్లో బయట అడుగుపెడితే చాలు వడదెబ్బకు మరణమే.. పిల్లలు 10 దాటిన తర్వాత ఆడుకునే సాహసం చేయడం లేదు. పెద్దలు కూడా గంట సేపు ఎండలో ఉంటే ప్రాణాలపై ఆశలు వదులుకునే పరిస్థితి దాపురించింది. మండుతున్న సూరీడు జనాల ఒంట్లోని సత్తువనంతా లాగేస్తున్నాడు. ఇంట్లో ఉంటేనే భరించలేనంత వేడి ఉంటోంది. బయటకు పోయేంతగా పరిస్థితులున్నాయా.?

ప్రకృతిని మనమే నాశనం చేశాం. చెట్లు కొట్టేశాం. అడవులను నామరూపల్లేకుండా చేశాం. వర్షాలకు పడేందుకు అవసరమైన కొండలు, గుట్టలను గ్రానైట్ పేరుతో నాశనం చేశాం. అందుకే ఆ ప్రకృతి పగబట్టింది. తనను చెడగొట్టిన మనిషి మీదే కాలాలతో సంబంధం లేకుండా విరుచుకుపడుతోంది.

తాజాగా కరీంనగర్ లో పడ్డ వడగండ్లకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ మారాయి. ఒక్కోటి కోడిగుడ్డంత సైజులో వడగండ్లు పడ్డాయంటే అతిశయోక్తి కాదు. మంచుగడ్డలు ఇంటి ముందర ధాన్యం రాశుల్లా కుప్పలుగా ఉన్న దృశ్యాలు వైరల్ గా మారాయి. మామిడికాయలు, వరి, మొక్కజొన్న అన్ని పంటలు ఈ వడగండ్లకు నామరూపాల్లేకుండా పోయాయి. క్రికెట్ బంతి ఉన్నంత సైజులో వడగండ్లు నెత్తిన పడితే మనిషి ప్రాణాలు కూడా పోతాయి. ప్రకృతిని నాశనం చేస్తే అది ఎంత విలయతాండవం చేస్తుందో చూడడానికి ఈ వడగండ్ల వానలే నిదర్శనం. ఇప్పుడు ఈ వడగండ్ల ఫొటోలు చూశాక కానీ మనిషి చేసిన తప్పు కనిపించిక మానదు.