Begin typing your search above and press return to search.

ఆయన్ను చూసి 'పద్మశ్రీ' అవార్డే గర్విస్తుంది

By:  Tupaki Desk   |   27 Jan 2016 10:30 PM GMT
ఆయన్ను చూసి పద్మశ్రీ అవార్డే గర్విస్తుంది
X
దేశంలో పద్మ పురస్కారాలపై ఎన్నో వివాదాలు... ఇంకెన్నో విచిత్రాలు. గొప్పగొప్పవారికి కూడా రాని పురస్కారాలు పెద్దపెద్దోళ్లకు వస్తుంటాయి. లాబీయింగ్ - డబ్బు - ప్రచార ఆర్బాటం వంటి నేపథ్యంలో ప్రభుత్వాలు తమకు నచ్చినవారిని ఈ అవార్డులకు నామినేట్ చేస్తాయి. ''ఈయనకు ఇంత పెద్ద అవార్డా''? అని కొందరి విషయంలో అనుకుంటాం. ఇంకొందరికి పద్మశ్రీ అవార్డు వచ్చినప్పుడు '' ఇప్పటి వరకు ఆయనకు రాలేదా?'' అంటాం. అలా ఉంటాయి నామినేషన్లు. రచయిత - చిత్రకారుడు దివంగత బాపు కొన్నేళ్ల కిందట పద్మశ్రీకి ఎంపికయ్యారు. అయనకు పద్మశ్రీ కూడా లేదని అప్పటివరకు చాలామందికి తెలియదు. వారంతా ఆశ్చర్యపోయారు. పైగా అప్పుడు కూడా ఏపీ గవర్నమెంటు కాకుండా తమిళనాడు ఆయన్ను నామినేట్ చేసిందని తెలిసి మరింత ఆశ్చర్యపోయారు.

పద్మశ్రీ - పద్మభూషణ్ - పద్మవిభూషణ్ పురస్కారాలు పొందినవారిని చూస్తే అంతా పెద్దపెద్దోళ్లే ఉంటారు. ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యాపారవేత్తలు - పైస్తాయికి వెళ్లి స్థిరపడిన కళాకారులు - వైద్యులే ఎక్కువగా కనిపిస్తున్నారు. దాదాపుగా అన్ని రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి. హై ప్రొఫైల్ వ్యక్తులకే ఈ అవార్డులు అందుతున్నాయి.

అయితే... ఈసారి పద్మశ్రీ అందుకున్నవారిలో ''హలధర్ నాగ్'' అనే వ్యక్తిని చూస్తే ఆ పురస్కారానికే ఆయన గౌరవం తెచ్చారనిపించక మానదు. అత్యంత సామాన్య జీవితం గడుపుతున్న గొప్ప కవి ఆయన. ఒడిశా ప్రభుత్వం ఆ మాణిక్యానికి అవార్డుకు నామినేట్ చేసి తన గొప్పదనాన్ని నిలుపుకొంది. కట్ బనియన్ - కటింగ్ చేసుకోని జుత్తు - మెడలో తుండుగుడ్డతో అత్యంత సామాన్యంగా ఉండే హలధర్ నోరు విప్పితే కవిత్వం అసువుగా ప్రవహిస్తుంది. ఒడిశాలోని కోసల ప్రాంతమైన బరగఢ్ జిల్లాకు చెందిన హలధర్ గొప్ప కవి. ఒడిశాలో ఆయన్ను లోక్ కవిరత్న అని పిలుస్తారు. కోశల భాషలో ఆయన లెక్కలేనన్ని రచనలు చేశారు. కవితలు - జానపద కథలను కోశల భాషలో రాశారు. ఒడిశాలోనే కాకుండా ఛత్తీస్ గఢ్ - జార్ఖండ్ రాష్ట్రాల్లోనూ ఆయనకు లక్షలాదిమంది అభిమానులు ఉండడం విశేషం. పొలాల్లో - ఆవుల మందల మధ్య - కొండల్లో - గుట్లల్లో - అడవుల్లో కనిపించే ఆయన అసామన్య కవి అనడంలో సందేహమే లేదు. సామాజిక అసమానతలు - అణగారిన వర్గాల కోసం పోరాడుతున్న ఆయన్ను గుర్తించిన ఒడిశాలోని నవీన్ పట్నాయక్ ప్రభుత్వం ఆయన్ను పద్మశ్రీ పురస్కారానికి ప్రతిపాదించడం.. కేంద్రం ఆమోదించడం నిజంగా గర్వకారణమే.