Begin typing your search above and press return to search.

ఆ సర్కారులో తాగుబోతులే ఎక్కువంట

By:  Tupaki Desk   |   27 April 2016 5:23 AM GMT
ఆ సర్కారులో తాగుబోతులే ఎక్కువంట
X
టైమ్ చూసుకొని టైమ్లీగా కొట్టటమే రాజకీయాల్లో ఉండాల్సిన అసలుసిసలు లక్షణం. ఈ విషయంలో బీహారీ బీజేపీ ముఖ్యనేత తన నైపుణ్యాన్ని ప్రదర్శించిన తీరు గురించి చెప్పుకోవాల్సిందే. అసెంబ్లీ ఎన్నికల్లో తమదే విజయమని పగటికలలు కన్న మోడీతో పాటు.. బీహార్ బీజేపీ నేతలు చాలామందే ఉన్నారు. ఇలాంటి వారందరికి టోకుగా షాకిచ్చిన బీహారీల దెబ్బకు కమలనాథులు కంగుతిన్నారని చెప్పాలి.

ఎన్నికల్లో వచ్చిన ప్రజాతీర్పు నేపథ్యంలో చప్పుడు చేయకుండా ఉంటున్న బీహార్ బీజేపీ నేతలకు అధికారపక్ష సభ్యులు తాజాగా అవకాశం ఇవ్వటం.. దాన్ని అందిపుచ్చుకున్న బీహార్ బీజేపీ ప్రముఖ నేత సుశీల్ కుమార్ చెలరేగిపోయారు. ఈ మధ్యన నితీశ్ సంకీర్ణ ప్రభుత్వానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు మందుకొడుతూ కెమేరా కంటికి అడ్డంగా దొరికిపోవటమే కాదు.. మిగిలిన నేతల్ని మందు కొట్టాలంటూ కోరటం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. తన దగ్గరున్న ఫారిన్ బ్రాండ్ల గురించి గడగడా చెప్పేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మందు మీదున్న పట్టు చూసి కాంగ్రెస్ పార్టీ సైతం షాక్ తిన్న పరిస్థితి.

సంపూర్ణ మద్యపాన నిషేధం స్ట్రిక్ట్ గా అమలవుతుందని చెప్పుకుంటున్న రాష్ట్రంలో అధికారపక్షానికి చెందిన నేతల ఇలా అడ్డంగా దొరికిపోవటంతో నితీశ్ సర్కారు కిందామీదా పడుతోంది. ఈ అవకాశాన్ని ఎంతమాత్రం చేజార్చుకోవటానికి ఇష్టపడని సుశీల్ కుమార్.. నితీశ్ సర్కారులోని మంత్రులు.. సంకీర్ణ ప్రభుత్వంలోని ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది మందుకొట్టే వారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వారి పాలనలో ఉన్న రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటుందా? అంటూ ప్రశ్నించారు.

ఇదిలా ఉంటే మందు కొడుతూ కెమేరా కంటికి అడ్డంగా బుక్ అయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే వినయ్ వర్మ మాత్రం తాజా పరిణామాలపై కాస్త చిత్రంగా స్పందించారు. తాను వెజిటేరియన్ నని.. తనకు మందుకొట్టే అలవాటు లేదన్న ఆయన.. స్టింగ్ ఆపరేషన్లో తనను అడ్డంగా బుక్ చేశారంటూ వాపోతున్నారు. మరి.. అంత కమిట్ మెంట్ ఉన్నోడే అయితే స్టింగ్ ఆపరేషన్లో అంత అడ్డంగా ఎలా బుక్ అవుతారో..?