Begin typing your search above and press return to search.

హాలోవీన్ వేడుకలు కొంపముంచింది.. 146 మందిని చంపింది..

By:  Tupaki Desk   |   30 Oct 2022 4:21 AM GMT
హాలోవీన్ వేడుకలు కొంపముంచింది.. 146 మందిని చంపింది..
X
గడిచిన రెండేళ్లుగా కరోనా కారణంగా ప్రజలు ఇంట్లోంచి బయటకు రాలేదు. ఇప్పుడిప్పుడే ప్రపంచం కోలుకొని పరిస్థితులు చక్కబడ్డాయి. ఈ టీ20 వరల్డ్ కప్ లో పూర్తి స్థాయిలో ప్రజలను స్టేడియాలకు అనుమతించారు. ఇక అన్ని దేశాల్లోనూ ఇలానే వేడుకలు, క్రీడలకు ప్రజలను అనుమతిస్తున్నారు. ఆంక్షలను సడలించారు. దీంతో రెండేళ్ల పాటు నిర్వహించుకోలేకపోయిన వేడుకలు, పండుగలను బహిరంగ ప్రదేశాల్లో భారీ ఎత్తున జరుపుకుంటున్నారు.

తాజాగా దక్షిణకొరియాలోని సియోల్ లో ఏటా జరిగే హాలోవీన్ వేడుకలకు ప్రజలు భారీగా హాజరై ఉత్సాహంగా జరుపుకుంటుండగా విషాదం చోటుచేసుకుంది. వేడుకల్లో జరిగిన తొక్కిసలాటలో కనీసం 150 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. మరో వందమందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరగవచ్చని అనుకుంటున్నారు. బాధితుల్లో ఎక్కువమంది గుండెపోటుకు గురికావడంతో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

తొక్కిసలాట జరగగానే అధికారులు, వైద్యసిబ్బంది స్పందించారు. 400 మంది అత్యవసర సిబ్బంది, 140 వాహనాల్లో మోహరించి సహాయక చర్యలు చేపట్టారు.ఊపిరాడని స్థితిలో రోడ్లపై పడి ఉన్న వారిని స్టెచర్లపైకి చేరుస్తూ .. సీపీఆర్ చేస్తూ మరికొందరి ప్రాణాలు నిలిపేందుకు ప్రయత్నించారు. రహదారి పక్కన ఫుట్ పాత్ పై సీపీఆర్ లు చేస్తుండగా కొందరినీ ఆస్పత్రులకు తరలించారు.

ఈ తొక్కిసలాటకు ప్రధాన కారణం.. హాలోవీన్ ఊరేగింపు సందర్భంగా ఐటియావాన వీధుల్లోని ఓ బార్ కు ప్రముఖ సినీ నటి వచ్చారనే సమాచారంతో అక్కడికి వెళ్లేందుకు ఒక్కసారిగా జనం ప్రయత్నించడమే తొక్కిసలాటకు కారణమని స్థానిక మీడియా తెలిపింది.

ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంపై దక్షిణ కొరియా అధ్యక్షుడు సుక్ యోల్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందజేయాలని అధికారులను ఆదేశించారు.

ప్రజలకు అవసరమైన వైద్య బృందాలు, ఔషధాలు, ఆస్పత్రుల్లో సౌకర్యాలను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. ఈ వేడుకలు జరిగే ప్రాంతాల్లో భద్రతను సమీక్షించాలని సూచించారు.