Begin typing your search above and press return to search.

ఉరిశిక్ష అమలు ఎలా ఉంటుందంటే..?

By:  Tupaki Desk   |   30 July 2015 2:22 AM GMT
ఉరిశిక్ష అమలు ఎలా ఉంటుందంటే..?
X
అసాధారణ నేరాలు చేసిన వారికి ఉరిశిక్ష అమలు చేస్తుంటారు. చాలా తీవ్రమైన నేరాల్లో తప్పించి ఉరిశిక్ష పడటం లేదు. తాజాగా యాకూబ్ మెమన్ ఉదంతం తీసుకుంటే.. దాదాపు 23 ఏళ్ల కిందట అతడు చేసిన నేరానికి తాజాగా ఉరి తీస్తున్నారు. ఉరిశిక్ష అమలు సమయంలో ఎన్నోమలుపులు చోటు చేసుకున్న పరిస్థితి. అర్థరాత్రి మూడు గంటల సమయంలో సుప్రీంకోర్టు కొలువు తీరి.. ఉరి అపాలంటూ పెట్టుకున్న దరఖాస్తును విచారించి తిరస్కరించటం తలిసిందే.

ఇంతకీ ఉరిశిక్ష అమలు సమయంలో జైలు అధికారులు ఏమేం చేస్తారు? ఉరితీత అమలు ఎలా సాగుతుందంటే..

జైళ్ల మాన్యువల్ ప్రకారం.. తూచా తప్పకుండా నిబంధనలు పాటిస్తారు.

1. ఉరిశిక్ష అమలు చేసే ఖైదీని తెల్లవారుజామునే నిద్ర లేపుతారు. మేలుకున్న తర్వాత పది నిమిషాలు ఆగాక.. స్నానం చేయాల్సిందిగా కోరతారు.

2. ఆ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత.. ఎస్పీ.. డీఎస్పీ.. ఎగ్జిక్యూటివి మేజిస్ట్రేట్.. వైద్యాధికారి నలుగురూ కలిసి ఖైదీ సెల్ వద్దకు చేరతారు.

3. ఈ సందర్భంగా అతనికి ఉరిశిక్ష ఎందుకు అమలు చేస్తున్నారన్న వివరాల్ని తెలిపేందుకు చదివి వినిపిస్తారు.

4. స్నానం పూర్తయిన తర్వాత అతనికి అల్పాహారాన్ని అందిస్తారు. జైల్ క్యాంటీన్ లో కానీ.. లేదంటే అతను కోరుకున్న ఆహారాన్ని బయట నుంచైనా ప్రత్యేకంగా తెప్పిస్తారు.

5. టిఫిన్ చేసిన తర్వాత.. ప్రార్థన చేసుకోవటానికి.. మత పరమైన పుస్తకాన్ని చదువుకునే వీలు కల్పిస్తారు.

6. అనంతరం ఉరికంబం వద్దకు ఖైదీని తీసుకెళ్తారు.

7. ఉరి కంబం ఎక్కించి.. ముఖంపై కాటన్ తో తయారు చేసిన నల్లటి తొడుగును కప్పేస్తారు.

8. ఉరితాడు బిగిస్తారు.

9. మేజిస్ట్రేట్ సంకేతం ఇచ్చిన వెంటనే.. ఖైదీ కాళ్ల కింద ఉండే తలుపులు తెరిచేలా లీవర్ లాగి ఉంచుతారు.

10. తుది ఆదేశం ఇచ్చిన వెంటనే లీవర్ లాగేస్తారు.

11. ఉరి బిగిసిన తర్వాత అరగంట సేపేటి వరకూ ఉరికొయ్యకు అలానే ఉంచేస్తారు.

12. ఆ తర్వాత ఖైదీ మరణించినట్లు వైద్యాధికారి ధ్రువీకరించాక.. ఆ విషయాన్ని హోం శాఖకు సమాచారం ఇస్తారు.

13. ఆపై హోం శాఖ మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందిస్తారు.

14. జైల్లోనే శవపరీక్ష నిర్వహిస్తారు.

15. ఉరిశిక్ష అమలు పూర్తి అయిన తర్వాత ఖైదీ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు ఇవ్వాలా? జైల్లోనే ఖననం చేయాలా? అన్నది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం అమలు చేస్తారు.