Begin typing your search above and press return to search.

కేసీఆర్ కలల పుణ్యక్షేత్రంలో అలాంటిది జరగలేదు

By:  Tupaki Desk   |   1 Jun 2016 7:43 AM GMT
కేసీఆర్ కలల పుణ్యక్షేత్రంలో అలాంటిది జరగలేదు
X
తెలంగాణలో మరో తిరుమలను నిర్మిస్తానంటూ యాదగిరి గుట్టను యాదాద్రిగా మార్చేసిన సంగతి తెలిసిందే. ఈ పుణ్యక్షేత్రం మీద తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా చేస్తున్న ఫోకస్ తెలిసిందే. వందలాది కోట్ల రూపాయిలు ఖర్చు చేసి యాదాద్రిని మహా పుణ్యక్షేత్రంగా మార్చాలన్నది కేసీఆర్ కలల్లో ఒకటిగా చెప్పాలి. సీఎం కేసీఆర్ కలల పుణ్యక్షేత్రంలో ఒక దారుణం చోటు చేసుకుంది.

హనుమజ్జయంతి సందర్భంగా నిర్వహించిన శోభాయాత్రలో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నట్లుగా కొన్ని మీడియాల్లో వార్తలు వచ్చాయి. యాత్ర సందర్భంగా రెండు వర్గాల మధ్య వాగ్వివాదం జరిగిందని.. ఇది తీవ్ర రూపం దాల్చి ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే వరకూ వెళ్లిందంటూ హడావుడి జరిగింది. ఈ సందర్భంగా కత్తులతో దాడులు చేసుకోవటంతో ఒకరు మృతి చెందినట్లుగా వార్తలు వచ్చాయి. కానీ.. అలాంటిదేమీ జరగలేదని.. జరిగిన ఘటన అందుకు భిన్నమైనదని చెబున్నారు.

శోభాయాత్రలో పాల్గొన్న భాస్కర్ అనే వ్యక్తి.. యాత్ర ముగిసిన తర్వాత ఇంటికి చేరుకున్నాడు. ఆ తర్వాత వ్యక్తిగత తగాదాతో అతను హత్యకు గురయ్యాడు. అయితే.. దీన్ని ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణగా చిత్రీకరిస్తూ కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు రావటం ఆందోళన కలిగించే అంశం. ఇలాంటి తప్పులతో లేనిపోని భావోద్వేగాలకు గురి అయ్యే ప్రమాదం ఉంది. ఇలాంటి వాటి విషయంలో ఆచితూచి స్పందిస్తే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పోటీ పేరుతో మీడియా సంస్థలు పరుగులు తీసే కన్నా.. కాస్త జాగ్రత్తగా ఉంటే అందరికి మంచిది.