Begin typing your search above and press return to search.

నన్ను చంచల్ గూడ జైల్లో పెడితే బాగుండేది

By:  Tupaki Desk   |   20 Sep 2018 8:35 AM GMT
నన్ను చంచల్ గూడ జైల్లో పెడితే బాగుండేది
X
ప్రచార కమిటీ పదవి తనకు ఇవ్వకపోవడంపై కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు భగ్గుమన్నారు. ఏకంగా కాంగ్రెస్ అధిష్టానంపైనే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడీ మాటలు సంచలనం సృష్టిస్తున్నాయి. కమిటీ నుంచి తనను పక్కన పెట్టడం కంటే తనను చంచల్ గూడ జైలులో పెడితే బాగుండేదని వీహెచ్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను ప్రచారం కోసం వాహనం కూడా సిద్ధం చేసుకున్నట్లు తెలిపాడు. 1989లో కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ గా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత తనదన్నారు.

ఇక వీహెచ్ తనకు పదవి దక్కకపోవడం కాంగ్రెస్ పార్టీలోని కోవర్టుల పనేనని మండిపడ్డారు. వాళ్లు ఎట్టిపరిస్థితుల్లో వీహెచ్ ను పార్టీలోకి రానీయవద్దనే తనకు పదవి దక్కకుండా చేశారని వీహెచ్ సంచలన కామెంట్స్ చేశారు. ఆ కోవర్టులకు కేసీఆర్ తో సంబంధాలున్నాయని.. కొందరు కేసీఆర్ తో రహస్య ఒప్పందం చేసుకున్నారని.. వారి పేర్లను తాను త్వరలోనే బయటపెడతానని బాంబు పేల్చాడు. తనకు పదవి ఇస్తే కేసీఆర్ ను ఓడిస్తానని వాళ్ల భయమని వీహెచ్ మండిపడ్డారు. వీహెచ్ పార్టీకి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కాంగ్రెస్ లో చర్చనీయాంశమయ్యాయి.

తాను కాంగ్రెస్ తరఫున పోటీచేయనని.. కాంగ్రెస్ తరఫున ప్రతీ నియోజకవర్గం తిరుగుతానని వీహెచ్ ప్రకటించారు. కేసీఆర్ కు సాయం చేసేందుకు కాంగ్రెస్ కోవర్టులు ప్లాన్లు చేశారని రాహుల్ తో చెబుతానని వీహెచ్ స్పష్టం చేశారు.

*వీహెచ్ అసంతృప్తికి కారణమిదే..

తెలంగాణ ముందస్తు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం పలు ఎన్నికల కమిటీలు వేసింది. ఇందులో ప్రచార కమిటీ చైర్మన్ పదవి దక్కలేదని వీహెచ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయనకు పార్టీ స్ట్రాటజీ - ప్లానింగ్ కమిటీ చైర్మన్ గా నియమించింది. ఈ విషయంపై కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ముందే వీహెచ్ .. పీసీసీ చీఫ్ ఉత్తమ్ ను నిలదీసినట్టు సమాచారం. ఆ సమావేశం నుంచి అలిగి బయటకు వచ్చిన వీహెచ్ ఇప్పుడు కాంగ్రెస్ తీరుపై సంచలన కామెంట్స్ చేశారు.