Begin typing your search above and press return to search.

ఆ తీర్మానంతో రోజాకు హ్యాపీ !

By:  Tupaki Desk   |   2 Feb 2022 9:30 AM GMT
ఆ తీర్మానంతో రోజాకు హ్యాపీ !
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో వైసీపీ ఎమ్మెల్యే రోజాకు ఫైర్‌ బ్రాండ్‌గా పేరుంది. వ‌రుస‌గా రెండు ఎన్నిక‌ల్లోనూ ఆమె న‌గ‌రి నుంచి విజ‌యం సాధించారు. గ‌తంలో త‌మ పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌పుడు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం, సీఎం చంద్ర‌బాబు నాయుడుపై ఆమె ఏ స్థాయిలో విరుచుకుపడ్డారో తెలిసింది. ఈ నేప‌థ్యంలో గత ఎన్నిక‌ల్లో వైసీపీ విజ‌యం సాధించ‌డంతో ఆమెకు క‌చ్చితంగా మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌ని అంతా అనుకున్నారు. కానీ తొలి విడ‌త‌లో నిరాశే మిగిలింది. రోజాను సంతోష‌పెట్టేందుకు జ‌గ‌న్ ఆమెను ఏపీఐఐసీ ఛైర్‌ప‌ర్స‌న్‌ను చేశారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో జ‌గ‌న్ కొత్త‌గా చేప‌ట్టే మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో ఆమెకు క‌చ్చితంగా ప‌ద‌వి ద‌క్కుతుంద‌నే మాటలు వినిపిస్తున్నాయి.

కానీ ఇప్పుడు కొత్త జిల్లాలు ఆమెకు స‌మ‌స్య‌గా మారింద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. త‌న న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గాన్ని చిత్తూరు జిల్లాలో క‌లిపారు. దీంతో ఇప్ప‌టికే అక్క‌డ పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి మంత్రిగా ఉన్నారు. ఈ నేప‌థ్యంలో ఆమె మంత్రి ప‌ద‌వి ఆశ‌లు గ‌ల్లంతేన‌నే ప్ర‌చారం సాగింది. కానీ ఇప్పుడో ఆస‌క్తిక‌ర ప‌రిణామం ఆమె ఆశ‌లకు ఊపిరులూదేదిగా ఉంద‌ని టాక్‌. అదే న‌గ‌రిని కొత్త‌గా ఏర్పాటు చేసే బాలాజీ జిల్లాలో క‌ల‌పాల‌నే డిమాండ్లు వినిపిస్తున్నాయి. తిరుప‌తి జిల్లా కేంద్రంగా ఏర్పాటు కానున్న ఈ బాలాజీ జిల్లాలో న‌గ‌రిని క‌ల‌పాల‌ని యువ‌జ‌న సంఘాలు ఆందోళ‌న చేప‌ట్టాయి. త‌న నియోజ‌క‌వ‌ర్గాన్ని బాలాజీ జిల్లాలో క‌ల‌పాల‌ని అంబేడ్క‌ర్ యువ‌జ‌న సంఘాల ఆధ్వ‌ర్యంలో న‌గ‌రిలో ఆందోళ‌న చేశారు.

కూత‌వేటు దూరంలో ఉన్న తిరుప‌తిని కాద‌ని చిత్తూరు జిల్లాలో న‌గరి నియోజ‌క‌వ‌ర్గాన్ని క‌ల‌ప‌డం ఏమిట‌ని ఆందోళ‌న‌కారులు ప్ర‌శ్నించారు. మ‌రోవైపు మున్సిప‌ల్ స‌మావేశంలోనూ ఈ విష‌యంపై ఏక‌గ్రీవంగా తీర్మానం చేశారు. నియోజ‌క‌వ‌ర్గం పూర్తిగా తుడ ప‌రిధిలో ఉన్నందున ప‌రిపాల‌న అభివృద్ధి కోసం న‌గ‌రిని బాలాజీ జిల్లాలో చేర్చాల‌ని డిమాండ్ చేశారు. ఒక‌వేళ ప్ర‌భుత్వం ఆ దిశ‌గా ఎలాంటి నిర్ణ‌యం తీసుకోక‌పోతే పెద్ద ఎత్తున ఆందోళ‌న చేస్తామ‌ని యువ‌జ‌న సంఘాల‌తో పాటు వివిధ వ‌ర్గాల ప్ర‌జ‌లు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ డిమాండ్ రోజాకు క‌లిసొచ్చేదే అని విశ్లేష‌కులు అంటున్నారు.

న‌గ‌రిని బాలాజీ జిల్లాలో క‌లిపేస్తే అప్పుడు ఆ జిల్లా నుంచి రోజా మంత్రి ప‌ద‌వి అందుకునే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. అక్క‌డ చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి ఉన్న‌ప్ప‌టికీ రోజాకే ఎక్కువ అవ‌కాశాలు ఉన్నాయ‌ని అంటున్నారు.