Begin typing your search above and press return to search.

అమృత..పెళ్లి చేసుకో.. ప్రణయ్ భార్యకు వేధింపులు

By:  Tupaki Desk   |   24 Sept 2019 4:05 PM IST
అమృత..పెళ్లి చేసుకో.. ప్రణయ్ భార్యకు వేధింపులు
X
నల్గొండ జిల్లాలో ప్రణయ్ పరువు హత్య రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.. మిర్యాల గూడకు చెందిన అమృత.. తను ప్రేమించిన ప్రణయ్ ను పెళ్లి చేసుకొని తల్లిదండ్రులను వదిలేసి వెళ్లిపోయింది. దళితుడిని చేసుకుందని సొంత కూతురు భర్త ప్రణయ్ ని కిరాయి హంతకులతో కడతేర్చాడు అమృత తండ్రి మారుతీరావు.. కూతురు కంటే పరువే ముఖ్యమని 10 లక్షలు బీహార్ ముఠాకు సుపారీ చెల్లించి మరీ ప్రణయ్ ను హత్య చేయించాడు.

అయితే ప్రణయ్ చనిపోయి ఈనెల 11కు ఏడాది పూర్తవుతుంది. ఇప్పటికీ అమృతకు బెదిరింపులు తగ్గడం లేదని తెలిసింది. ఆమెకు ఫోన్ చేసి కొందరు.. బయట కనిపించిన వాళ్లు - మారుతీరావు అనుచరులు బెదిరింపులకు పాల్పడుతున్నట్టు ఇటీవలే పోలీసులకు ఫిర్యాదు చేసింది..

తాజాగా అమృత కుటుంబ సభ్యులు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఓ బైక్ వచ్చిన ఆగంతకుడు అమృత ఇంటికి ఓ లేఖ అంటించి వెళ్లాడు. అది చూసి అమృత కుటుంబ సభ్యులు షాక్ తిన్నారు.

‘నీ చనిపోయిన భర్త ప్రణయ్ ను వెంటనే మరిచిపోవాలని.. వెంటనే ఆ ఇల్లు ఖాళీ చేసి బయటకు రావాలని.. సతీష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని..’ సతీష్ ఫొటోను లేఖతోపాటు అంటించి ఆగంతకుడు వెళ్లిపోయాడు. దీంతో అమృత మంగళవారం ఈ లేఖపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా అమృతను బెదిరించిన వ్యక్తిని కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. బెయిల్ పై విడుదలైన తన తండ్రి మారుతీరావే ఇలా కొందరితో బెదిరింపులకు పాల్పడుతున్నాడని అమృత ఆరోపించింది.