Begin typing your search above and press return to search.

భారత క్రికెట్ జట్టులో ముస్లింలే లేరా?

By:  Tupaki Desk   |   24 Oct 2017 10:13 AM GMT
భారత క్రికెట్ జట్టులో ముస్లింలే లేరా?
X
సంజీవ్ భట్ గుర్తున్నాడా? 2002 గుజరాత్ అల్లర్ల కేసుకు సంబంధించి అప్పటి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన ఐపీఎస్ అధికారి. ఆ తర్వాత కూడా పలు సందర్భాల్లో మోడీపై తన వ్యతిరేకతను చాటుకున్నాడాయన. తాజాగా ఆయన భారత క్రికెట్ జట్టుకు సంబంధించి చేసిన ట్వీట్ తీవ్ర వివాదాస్పదమైంది. భారత జట్టులో ముస్లిం క్రికెటర్లకు ఎందుకు చోటు దక్కట్లేదని ఆయన ప్రశ్నించారు. ‘‘ప్రస్తుతం ముస్లింలు క్రికెట్ ఆడటం మానేశారా? భారత జట్టులో ముస్లింలను ఎంపిక చేకపోవడంలో బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంచుకున్న విధానమేంటి. సెలక్టర్లు ఇంకెవరి బాటలో అయినా సాగుతున్నారా’’ అని ఆయన ట్విట్టర్లో అన్నారు.

సంజీవ్ భట్ ‘ఇంకెవరి బాటలో అయినా’ అన్నది మోడీని ఉద్దేశించే అని భావిస్తున్నారు. ఐతే ఈ ట్వీట్ మీద నెటిజన్లు మండి పడ్డారు. టీమ్ ఇండియా సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్‌కు కూడా ఈ ట్వీట్ విషయంలో కోపం వచ్చింది. భారత్‌కు ఆడే ప్రతి క్రికెటర్ ‘హిందుస్థానీ’ అని భజ్జీ వ్యాఖ్యానించాడు. దేశానికి ఆడే ఆటగాళ్ల విషయంలో కులం - మతం - రంగు తీసుకురావద్దని.. ఇక్కడ హిందువులు - ముస్లింలు - సిక్కులు - క్రిస్టియన్లు అందరూ సోదరులే అని అన్నాడు. నిజానికి ప్రస్తుతం భారత జట్టులో ముస్లింలకు చోటు లేకుండా ఏమీ లేదు. న్యూజిలాండ్‌ తో టీ20 సిరీస్‌ కు ఎంపికైన మహ్మద్ సిరాజ్ - మహ్మద్ షమిలిద్దరూ ముస్లింలే. భారత జట్టు తరఫున మన్సూర్ అలీ ఖాన్ - అజహరుద్దీన్ - జహీర్ ఖాన్ లాంటి పేరుమోసిన ఆటగాళ్లు ఆడారు. త్వరలోనే గుజరాత్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మోడీని - భాజపాను ఇరుకున పెట్టడానికే సంజీవ్ ఈ ట్వీట్ చేశారని భావిస్తున్నారు. కానీ తన ట్వీట్‌ తో సంజీవే ఇరుకున పడ్డారు.