Begin typing your search above and press return to search.

బీజేపీలోకి హార్దిక్.. మరికొందరు నేతలు కూడానట..?

By:  Tupaki Desk   |   2 Jun 2022 10:31 AM GMT
బీజేపీలోకి హార్దిక్.. మరికొందరు నేతలు కూడానట..?
X
గుజరాత్ యువ నాయకుడు, పటీదార్ అనామత్ ఆందోళన ఉద్యమ సారథి హార్దిక్ పటేల్ గురువారం బీజేపీలో చేరారు. ప్రధాని మోదీ సారథ్యంలోని సైన్యంలో చిన్న సైనికుడిగా పనిచేస్తానని చెప్పారు. గుజరాత్‌లోని గాంధీ నగర్‌లో పార్టీ కార్యాలయంలో కాషాయం కండువా కప్పుకున్నారు.

ఆ రాష్ట్రం కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లనున్న నేపథ్యంలో హార్దిక్‌ కాంగ్రెస్‌ వీడడం ఆ పార్టీకి పెద్ద దెబ్బగానే పరిశీలకులు భావిస్తున్నారు. కాగా, తన చేరికపై అంతకుముందు హార్దిక్ ట్వీట్ చేశారు. ‘‘దేశ, రాష్ట్ర, ప్రజా ప్రయోజనాల నిమిత్తం కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతున్నాను. ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం కోసం సైనికుడిగా పనిచేస్తా’అని అందులో పేర్కొన్నారు.

గుజరాత్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్

హార్దిక్.. గుజరాత్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్. పీసీసీ చీఫ్ తర్వాత ఇదే అత్యున్నత పోస్టు. కానీ, 28 ఏళ్ల హార్దిక్ కొంతకాలంగా కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆయన కాంగ్రెస్ లో చేరారు. కానీ, ఇటీవల బహిరంగంగానే విమర్శలు చేయడం ప్రారంభించారు. బీజేపీపై ప్రశంసలు కురిపించసాగారు. అయోధ్యలో రామాలయ నిర్మాణంపై తీర్పు, ఆర్టికల్‌ 370 రద్దు సమయంలో ఆ పార్టీకి అనుకూలంగా మాట్లాడారు.

పెద్ద నాయకులు లేకున్నా..

హార్దిక్ బీజేపీలో చేరికకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, సీఎం భూపేంద్ర సహా పెద్ద నాయకులు ఎవరూ లేరు. బీజేపీ గుజరాత్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్, బీజేపీ గుజరాత్ చీఫ్ సీఆర్ పాటిల్ మాత్రమే పాల్గొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నుంచి మరికొందరు బీజేపీలోకి వచ్చే అవకాశాలున్నాయని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

సమస్యలు చెబుతుంటే ఫోన్ చూస్తూ ఉన్నారు

హార్దిక్ ప్రజాదరణను చూసిన కాంగ్రెస్ పార్టీ.. 2020 జూలైలో ఆయనను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించింది. రెండేళ్లు పూర్తికాకుండానే హార్దిక్ బీజేపీకి జైకొట్టారు. కాగా, కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీకి పంపిన రాజీనామా లేఖలో ఆ పార్టీ అగ్రనాయకత్వంపై హార్దిక్ తీవ్ర విమర్శలు చేశారు. తాను గుజరాత్ సమస్యలు చెబుతుంటే.. వారు ఫోన్ చూస్తూ కూర్చున్నారని ధ్వజమెత్తారు. క్లిష్ట పరిస్థితుల్లో దేశంలో ఉండకుండా విదేశాలకు వెళ్లారంటూ రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు.

ఆయన సేవలను ఎలా వాడుతారో..?

హార్దిక్ స్థాయి నాయకుడిని, అందులోనూ సుదీర్ఘ భవిష్యత్ ఉన్న నాయకుడిని బీజేపీ ఎలా ఉపయోగించుకుంటుందో చూడాల్సి ఉంది. హార్దిక్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయం. ఒకవేళ బీజేపీ గెలిస్తే పెద్ద తలకాయలను కాదని సీఎంను చేస్తారా? అనేది చూడాల్సి ఉంది. లేదంటే ఉప ముఖ్యమంత్రి వంటి పదవితో సరిపెడతారా? అనేది చర్చనీయాంశం. ఏది ఏమైనా హార్దిక్ వంటి ప్రజాదరణ ఉన్న నాయకుడిని కాంగ్రెస్ చేజార్చుకుంది. ఆయనను అట్టిపెట్టుకుని.. సీఎం అభ్యర్థిగా ప్రకటించాల్సింది. కానీ, కాంగ్రెస్ ఆ పని చేయలేకపోయింది. ఇక బీజేపీ.. హార్దిక్ ను ప్రచార తారగా ఉపయోగించుకున చాన్సుంది. రాష్ట్రమంతటా పర్యటింపజేసి ఓట్లు దండుకోవాలని ప్లాన్ వేస్తున్నట్లు కనిపిస్తోంది.