Begin typing your search above and press return to search.

ఫైర్ బ్రాండ్ ఉద్య‌మ నేత‌కు జైలు!

By:  Tupaki Desk   |   25 July 2018 9:00 AM GMT
ఫైర్ బ్రాండ్ ఉద్య‌మ నేత‌కు జైలు!
X
అన్ని ఉద్య‌మాలు ఒక్క‌లా ఉండ‌వు. అందునా గుజ‌రాత్ లో హార్దిక్ ప‌టేల్ చేప‌ట్టిన ప‌టేల్ రిజ‌ర్వేష‌న్ల ఉద్య‌మం యావ‌త్ దేశానికి సంచ‌ల‌నంగా మారింది. మోడీ స‌ర్కారుతో పాటు.. గుజ‌రాత్ స‌ర్కారు సైతం ఈ ఉద్య‌మానికి చిగురుటాకులా వ‌ణికింది. ఇదిలా ఉంటే.. ఈ ఉద్య‌మానికి నేతృత్వం వ‌హించిన హార్దిక్ ప‌టేల్ రాత్రికి రాత్రి పెద్ద నేత‌గా అవ‌త‌రించ‌ట‌మే కాదు.. మోడీని విప‌రీతంగా వ్య‌తిరేకించే వారికి ఆయ‌నో పెద్ద హీరోగా మారారు.

ఎంత‌కు కొర‌క‌రాని కొయ్య‌లా మారిన హార్దిక్ ను ఒక దారికి తెచ్చి.. గుజ‌రాత్ లో జ‌రిగిన ప‌టేల్ ఉద్య‌మాన్ని చ‌ల్లార్చ‌టానికి కేంద్రం.. గుజ‌రాత్ ప్ర‌భుత్వం చాలా క‌ష్ట‌ప‌డాల్సి వ‌చ్చింది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఉద్య‌మం సంద‌ర్భంగా చెల‌రేగిన అల్ల‌ర్ల‌కు సంబందించి ప‌లు కేసులు న‌మోద‌య్యాయి.

ఈ కేసుల‌కు సంబంధించి తాజాగా హార్దిక్ ప‌టేల్ కు భారీ ఎదురుదెబ్బ త‌గిలింది. 2015లో ప‌టేల్ రిజ‌ర్వేష‌న్ల ఉద్య‌మం సంద‌ర్భంగా చెల‌రేగిన అల్ల‌ర్ల‌కు బాధ్యుడిగా హార్దిక ప‌టేల్ తోపాటు మ‌రికొంద‌రిని దోషులుగా నిర్దారించింది గుజ‌రాత్ స్థానిక కోర్టు.

ఈ కేసులో హార్దిక్ కు రూ.50వేల జ‌రిమానాతో పాటు.. రెండేళ్ల జైలుశిక్ష‌ను విధిస్తూ కోర్టు తీర్పును ఇచ్చింది. కోర్టు తీర్పు వ‌చ్చిన వెంట‌నే.. హార్దిక్ త‌ర‌ఫు న్యాయ‌వాది ఆయ‌న బెయిల్ కోసం పిటిష‌న్ దాఖ‌లు చేశారు. 2015లో జ‌రిగిన ప‌టేల్ రిజ‌ర్వేష‌న్ల ఉద్య‌మం సంద‌ర్భంగా భారీ ఎత్తున హింస చెల‌రేగింది. వీటికి బాధ్యులుగా హార్దిక్ తో పాటు మ‌రికొంద‌రిపై కేసులు న‌మోదు చేశారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌భుత్వ ఆస్తులు భారీగా న‌ష్టం వాటిల్లాయి.