Begin typing your search above and press return to search.

ఆరాచకం దిశగా హార్దిక్ పటేల్ మాటలు

By:  Tupaki Desk   |   4 Oct 2015 4:36 AM GMT
ఆరాచకం దిశగా హార్దిక్ పటేల్ మాటలు
X
తన మాటలతో గుజరాత్ మొత్తాన్ని వేడెక్కించటమే కాదు.. దేశం మొత్తాన్ని తనవైపు చూసేలా చేసిన హార్దిక్ పటేల్ మాటలు హద్దులు దాటుతున్నాయి. తమ హక్కుల సాధనలో భాగంగా ఉద్యమాలు.. నిరసనలు..ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించటం తప్పేం కాదు. కానీ.. హింసాయుత మార్గాన్ని అనుసరించేలా ప్రోత్సహించటం ఏ మాత్రం సబబు కాదు.

తమ డిమాండ్ల సాధన కోసం తోటివారిని చంపేయాలన్న క్రూరమైన ఆలోచనను ప్రకటించిన హార్దిక్ పటేల్ మాటలు ఇప్పుడు వివాదాస్పదమయ్యారు. గుజరాత్ లోని పటేళ్ల రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న ఆయన.. తాజాగా చేసిన ప్రకటన వేడెక్కిస్తోంది. రిజర్వేషన్ల సాధనలో భాగంగా ఆత్మహత్యలు చేసుకుంటున్న వారికి తనదైన శైలిలో ప్రకటనలు చేస్తున్నాడు.

మీరు కానీ ధైర్యవంతులైతే వెళ్లి ఓ ఇద్దరు.. ముగ్గురు పోలీసులను చంపేయండి. పటేళ్లు ఎన్నడూ ఆత్మహత్యలు చేసుకోరంటూ విషం చిమ్మాడు. పటేళ్లకు రిజర్వేషన్ల నిరసనకు మద్ధుతు తెలుపుతూ.. తానుఆత్మహత్య చేసుకుంటానని విపుల్ దేశాయ్ అనే యువకుడు వ్యాఖ్యానించటంతో స్పందించిన హార్దిక్ నోటి వెంట ఈ క్రూరమైన మాట వచ్చింది.

తాను చేసిన ప్రకటనపై సర్వత్రా నిరసన వ్యక్తం కావటంతో హార్దిక్ పటేల్ తాజాగా మరో ప్రకటన చేశాడు. ఆత్మహత్యలకు బదులుగా ఇద్దరు.. ముగ్గురు పోలీసుల్ని చంపేయాలని తాను అస్సలు అనలేదని..కావాలంటే.. తాను అన్నట్లుగా సాక్ష్యాలు చూపించి తనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అతగాడు చెబుతున్నాడు. ఉద్యమంలో ఉన్న వారికి భావోద్వేగాలు సహజం. అయితే.. అవసరానికి మించిన ఉత్సాహం అనర్థాలు తీసుకొస్తుందన్న విషయాన్ని హార్దిక్ గుర్తిస్తే బాగుంటుంది.