Begin typing your search above and press return to search.

మోడీకి హార్దిక్ ఆ రకంగా దెబ్బేస్తాడా?

By:  Tupaki Desk   |   27 Sep 2015 8:12 AM GMT
మోడీకి హార్దిక్ ఆ రకంగా దెబ్బేస్తాడా?
X
పటేళ్లకు రిజర్వేషన్లు ఇవ్వాలంటూ గళం విప్పటమే కాదు.. మోడీకి ఎదురు లేదని చెప్పుకునే గుజరాత్ లో రచ్చ రచ్చ చేసిన హార్దిక్ పటేల్ గురించి తెలియని వారు ఉండరు. ఎవరి విషయంలో అంత త్వరగా స్పందించని మోడీ సైతం.. హార్దిక్ ఆందోళన విషయంలో స్పందించిన వైనం చూస్తే.. అంత పెద్ద ప్రధాని కూడా గుజరాత్ లో చోటు చేసుకున్న పరిణామాల పట్ల ఆందోళన చెందినట్లుగా కనిపించిన పరిస్థితి.

ఇదిలా ఉంటే.. ఎంత ఉవ్వెత్తున పటేళ్ల ఉద్యమం సాగిందో.. అంతే స్థాయిలో పడిపోవటం ఇప్పుడు కనిపిస్తోంది. ఒకపపుడు హార్దిక్ పటేల్ పిలుపునిస్తే లక్షలాది మంది పటేళ్లు ముందుకు ఉరికే పరిస్థితి. ఆ స్థాయి నుంచి ఇప్పుడు ఆయన పరపతి భారీగా పడిపోయిందన్న వాదన వ్యక్తమవుతోంది. దీంతో.. తన పరపతి ఏ మాత్రం తగ్గిపోలేదని నిరూపించుకోవటంతో పాటు.. తన ప్రభావాన్ని నిరూపించుకోవాలనే పట్టుదలతో హార్దిక్ ఉన్నట్లు తెలుస్తోంది.

ఇందులో భాగంగా బీహార్ ఎన్నికల్లో హార్దిక్ ఎంట్రీ ఇచ్చారని చెబుతున్నారు. పటేళ్ల ఉద్యమాన్ని గుజరాత్ వరకే పరిమితం కాకుండా వివిధ రాష్ట్రాలకు వ్యాపింప చేయాలని భావిస్తున్న హార్దిక్.. తాజాగా జరుగుతున్న బీహార్ ఎన్నికల్లోనూ కీలకభూమిక పోషించాలని భావిస్తున్నరు. ఇందులో భాగంగా జనతాదళ్ పార్టీ నేత .. బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కు తన మద్ధతును ప్రకటించారు.

బీహార్ కు నితీశ్ ఎంతో చేశారన్న పేరుతో పాటు.. ఈ రాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ కాస్త వెనుకబడిందన్న అంచనాలు వ్యక్తమవుతున్న వేళ.. నితీశ్ కు తన మద్ధతు ప్రకటించటం ద్వారా.. పటేల్ వర్గాన్నినితీశ్ ఓటు బ్యాంకుగా మార్చాలని హార్దిక్ పటేల్ భావిస్తున్నారు. మరి.. ఆయన వ్యూహం వర్క్ వుట్ అవుతుందా? లేదా? అన్నది బీహార్ ఎన్నికల ఫలితాలు మాత్రం సమాధానం చెప్పనున్నాయి. ఒకవేళ హార్దిక్ అనుకున్నట్లుగా నితీశ్ కానీ బీహార్ ఎన్నికల్లో విజయం సాధిస్తే.. మోడీకి హార్దిక్ దెబ్బేసిన ఇమేజ్ సొంతం కావటం ఖాయమని చెబుతున్నారు. మరి.. హార్దిక్ కు అలాంటి అవకాశం దక్కుతుందో లేదో చూడాలి.