Begin typing your search above and press return to search.

హార్దిక్ ప‌టేల్ ఉద్య‌మం వెనుక చీక‌టి నిజాలు

By:  Tupaki Desk   |   23 Aug 2016 7:22 AM GMT
హార్దిక్ ప‌టేల్ ఉద్య‌మం వెనుక చీక‌టి నిజాలు
X
ఏ ఉద్య‌మానికైనా నాయ‌కుడు ఉంటాడు. అలాగే గుజ‌రాత్‌ లో ఆనందీబెన్ ప్ర‌భుత్వానికి చెమ‌ట‌లు ప‌ట్టించిన ప‌టేల్ రిజ‌ర్వేష‌న్ పోరాటానికి నిండా 30 ఏళ్లు కూడా లేని హార్దిక్ అనే యువ‌కుడు నాయ‌క‌త్వం వ‌హించిన విష‌యం తెలిసిందే. మొద‌ట చిన్న తుంప‌ర‌గా మొద‌లైన హార్దిక్ ప‌టేల్ ఉద్య‌మం.. త‌ర్వాత తుఫానుగా మారి.. గుజ‌రాత్ సీఎం ఆనందీబెన్‌ కు కంటిపై కునుకులేకుండా చేసింది. దీంతో ఓ ఆరేడు నెల‌ల కింద‌టి వ‌ర‌కు హార్దిక్ డైలీ వార్త‌ల్లో క‌నిపించేవాడు. ఆయన ఉద్య‌మానికి కూడా భారీ క్రేజ్ వ‌చ్చింది. అయితే, ఉద్య‌మం సంద‌ర్భంగా జ‌రిగిన హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల నేప‌థ్యంలో హార్దిక్ స‌హా ఆయ‌న అనుచ‌రుల‌పై పోలీసులు దేశ ద్రోహం కేసు న‌మోదు చేశారు. దీంతో కొన్నాళ్లు జైలు జీవితం గ‌డిచిన హార్దిక్‌ కు గుజ‌రాత్ హైకోర్టు బెయిల్ ఇచ్చింది.అయితే, గుజ‌రాత్‌ లో ఉండేందుకు మాత్రం ఒప్పుకోలేదు.

దీంతో హార్దిక్ రాజ‌స్థాన్‌ కు వ‌చ్చాడు. ఇక‌, ఉద్య‌మాల విష‌యంపై ఏదైనా మాట్టాడాల్సి వ‌స్తే.. అంద‌రూ హార్దిక్‌ నే చెప్పుకొనేవారు. ఉద్య‌మాన్ని హార్దిక్ ఎలా న‌డిపించాడో చెప్పుకుని మురిసిపోయేవారు. ఇది నాణేనికి ఒక వైపు మాత్ర‌మే అంటున్నారు హార్దిక్ అనుచ‌రులు చిరాగ్ పటేల్ - కేతన్ పటేల్. వీరిద్ద‌రూ ప‌టేల్ ఉద్య‌మ స‌మ‌యంలో హార్దిక్‌ కు రైట్‌ - లెఫ్ట్ హ్యాండ్స్‌ గా ఉన్నారు. మ‌రి హార్దిక్‌ లోని మ‌రో కోణం ఏంటంటే.. ప‌టేల్ ఉద్య‌మం పేరుతో హార్దిక్ చేసిందంతా.. దందాలేన‌ట‌! డ‌బ్బు బాగా పోగేసుకున్నాడ‌ట‌. అధికారం కోసం ఉవ్విళ్లూరిపోయాడ‌ట‌! ఇవ‌న్నీ న‌మ్మ‌శ‌క్యం కాకున్నా.. ప‌చ్చి నిజాల‌ని అంటున్నారు కేత‌న్‌ - చిరాగ్‌ లు. హార్దిక్‌ తో క‌లిసి తాము కూడా 8 నెల‌లు జైలు జీవితం గ‌డిపితే.. తాను ఒక్క‌డినే ప‌టేళ్ల కోసం జైలుకు వెళ్లి ఉన్నాన‌ని జాతీయ మీడియా ముందు హార్దిక్ క‌ల‌రింగ్ ఇచ్చాడ‌ని వారు ఆరోపిస్తున్నారు.

అంతేకాకుండా.. ఏడాది కాలంలోనే నాయకుడిగా ఎదగాలని, దాంతోపాటు కోటీశ్వరుడిని కావాలనే ఉద్దేశంతోనే హార్దిక్ ఉద్య‌మాన్ని చేప‌ట్టాడ‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టారు. ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయినవాళ్ల కుటుంబాలను ఆదుకోవాల్సింది పోయి హార్దిక్ - ఆయన స్నేహితులు విలాసవంతమైన జీవితం గడిపారని, అమరులకు సాయం చేయడానికి సేకరించిన విరాళాలతో హార్దిక్ - ఆయన మామ విపుల్‌ భాయ్ ఖరీదైన కార్లు కొన్నారని ఆరోపించారు. ఈ సంద‌ర్భంగా వాళ్లు హార్దిక్‌కు బ‌హిరంగ లేఖ‌ రాశారు. దానిలో... ''మీరు నాయకుడిగా ఎదగాలని - భారీ మొత్తంలో డబ్బు కూడగట్టుకోవాలని స్వార్థంతో వ్యవహరించారు. దానివల్ల పటేల్ వర్గంతో పాటు మన సంస్థకు కూడా భారీ నష్టం జరిగింది'' అని పేర్కొన్నారు. మ‌రి ఈ చిరాగ్‌ - కేత‌న్ ప‌టేళ్లు చెప్పింది నిజ‌మే అయితే.. భ‌విష్య‌త్తులో హార్దిక్ మ‌రిన్ని ఇబ్బందుల్లో కూరుకుపోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఇదిలావుంటే - ఈ విష‌యాల‌న్నీ తెలిశాక‌.. హార్దిక్ ఇంత ముదురా అనుకుంటున్నార‌ట గుజ‌రాత్ జ‌నాలు!!