Begin typing your search above and press return to search.

పాఠంగా ఎన్టీఆర్ జీవితం..చంద్రుళ్ల రియాక్ష‌న్ ఏమిటి?

By:  Tupaki Desk   |   28 May 2018 4:26 AM GMT
పాఠంగా ఎన్టీఆర్ జీవితం..చంద్రుళ్ల రియాక్ష‌న్ ఏమిటి?
X
ప్ర‌తి తెలుగోడు గొప్ప‌గా చెప్పుకునే తెలుగోళ్ల‌లో ఎన్టీఆర్ పేరు త‌ప్ప‌క ఉంటుంది. ప్రాంతాల ప‌రిమితుల్ని అధిగ‌మించేసిన ఎన్టీఆర్ తెలుగోళ్లంద‌రికి ఎంత అభిమాన‌మో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ఎన్టీఆర్ పేరు ప్ర‌స్తావించిన వెంట‌నే.. రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల్లో వ‌చ్చే స్పంద‌న మ‌రెవ‌రి విష‌యంలో ద‌క్క‌ద‌నే చెప్పాలి.

తెలుగువాడి ఆత్మ‌గౌర‌వం అంటే ఏమిటో ఢిల్లీకి చాటి చెప్ప‌ట‌మే కాదు.. దేశ ప‌టంలో తెలుగోళ్ల ఉనికిని చాటి చెప్పిన వారిలో ఎన్టీఆర్ పేరు ముందు ఉంటుంది.

ఈ రోజు ఎన్టీఆర్ 95వ జ‌యంతి. ఎన్టీఆర్ జ‌యంతిని పుర‌స్క‌రించుకొని ఏపీలో టీడీపీ మ‌హానాడు పేరుతో భారీ కార్య‌క్ర‌మాన్ని చేప‌డితే.. ఎన్టీఆర్ కుటుంబ స‌భ్యుల్లో కీల‌కం.. ఎన్టీఆర్ కుమారుడు హ‌రికృష్ణ ఆయ‌న ఫ్యామిలీ మెంబ‌ర్స్ ఈ రోజున ఎన్టీఆర్ ఘాట్ లో నివాళులు అర్పించారు.

ఎన్టీఆర్ పుట్టిన రోజు తెలుగు రాష్ట్రాల వారికి ఒక పండుగ లాంటిద‌న్న ఆయ‌న‌.. బ‌డుగు.. బ‌ల‌హీన వ‌ర్గాల వారి ఉన్న‌తిని కోరుకున్న గొప్ప నాయ‌కుడిగా అభివ‌ర్ణించారు. తెలుగు వారికి ఒక భాష ఉంద‌ని.. తెలుగు వారి ఉనికిని ప్ర‌పంచానికి చాటి చెప్పిన ఎన్టీఆర్ జీవితంలోని ముఖ్య‌మైన ఘ‌ట్టాల్ని తెలుగు రాష్ట్రాల్లో పాఠ్యాంశాలుగా మార్చాల‌న్నారు.

ఓప‌క్క తెలుగుదేశం పార్టీ మ‌హానాడును భారీగా నిర్వ‌హిస్తున్న వేళ‌.. హ‌రికృష్ణ ఆయ‌న కుమారులు క‌ల్యాణ్ రామ్‌.. జూనియ‌ర్ ఎన్టీఆర్ త‌దిత‌రులు మాత్రం ఎన్టీఆర్ ఘాట్ వ‌ద్ద‌కు నివాళులు అర్పించేందుకు వ‌చ్చారు. మ‌హానాడుకు వెళ్ల‌లేదంటూ అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్పేందుకు హ‌రికృష్ణ ఇష్ట‌ప‌డలేదు. ఆ ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్ప‌కుండా దాట‌వేయ‌టం గ‌మ‌నార్హం.