Begin typing your search above and press return to search.

వంశానికే ప్రమాదాల టెర్రర్

By:  Tupaki Desk   |   30 Aug 2018 2:45 PM GMT
వంశానికే ప్రమాదాల టెర్రర్
X
కొన్ని కుటుంబాలను పాములు వేధిస్తాయి. కొన్ని కుటుంబాలను నీళ్లు మట్టుపెడతాయి. మరికొన్ని కుటుంబాలను కలహాలు వెంటాడుతాయి. ఇంకొన్ని కుటుంబాలను రోడ్డు ప్రమాదాలు పొట్టన పెట్టుకుంటాయి. అవును... ఇది చాలాసార్లు రుజువైన సంగతి. తాజాగా నందమూరి హరిక్రిష్ణ మరణం తర్వాత ఆయన్నే కాదు... ఆయన వంశానికే రోడ్డు ప్రమాదాల బెడద వేధిస్తోంది. అవును.. నందమూరి హరిక్రిష్ణ తాతయ్య, దివంగత ము‌ఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తండ్రి లక్ష్మయ్య చౌదరి కూడా రోడ్డు ప్రమాదంలోనే మరణించారట. ఈ విషయాన్ని నందమూరి హరిక్రిష్ణే స్వయంగా ఓ ఇంటర్య్వూలో చెప్పడం గమనార్హం. ఈ ఇంటర్వ్యూలో హరిక్రిష్ణ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తనకు తాతయ్య అంటే ఎంతో ఇష్టమని, ఆయనే తనకు తల్లి, తండ్రి అయి పెంచారని వివరించారు. అంతే కాదు తనకు నగరాలంటే అసహ్యమని, పల్లెటూళ్లలోనే ఎక్కువ ఉండేవాడినని కూడా చెప్పారు. నందమూరి హరిక్రిష్ట మరణించిన తర్వాత ఆయకు సంబంధించిన పలు ఆసక్తికర సంఘటనలు, అంశాలు ఒక్కొక్కటే వెలుగులోకి రావడం గమనార్హం.

హరిక్రిష్ణ బాల్యం, యవ్వనం దాదాపు నిమ్మకూరులోనే గడిచింది. ఆయన తన తండ్రి దగ్గరకు చెన్నై వెళ్లేందుకు ఎప్పుడూ ఇష్టపడే వారు కాదట. ఒకవేళ బలవంతంగా ఆయన చెన్నై కాని, హైదరాబాద్ కాని వెళ్లినా అక్కడ ముళ్లమీద ఉన్నట్లుగానే గడిపేవాడినని ఆయనే స్వయంగా చెప్పారు. తన తండ్రి, మహానటుడు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు మద్రాస్ నుంచి హైదరాబాద్‌కు మకాం మార్చారు. ఆ సమయంలో హైదరాబాద్ లో రామక్రిష్ణ స్టూడియో కట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఆ సమయంలోనే హరిక్రిష్ణను హైదరాబాద్ రావాలని పిలిచారట నందమూరి తారక రామారావు. అయితే తండ్రి ఆహ్వానాన్ని హరిక్రిష్ణ తిరస్కరించారట. దీంతో తాతయ్య కూడా ఇక్కడికే వస్తారని, నువ్వు వచ్చి ఇక్కడి పనులు చూసుకోవాలని తండ్రి నందమూరి తారక రామారావు చెప్పడంతో తాతయ్యతో కలిసి హరిక్రిష్ఱ హైదరాబాద్ వచ్చానని చెప్పారు. ఆ సమయంలో తమకు శంషాబాద్ సమీపంలో రెండు వందల ఎకరాల పొలం ఉండేదని, ఓసారి ఆ పొలానికి వెళ్లిన తన తాతయ్య లక్ష్మయ్య చౌదరి అక్కడి నుంచి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో మరణించారని హరిక్రిష్ణ ఆ ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం. తన తండ్రిని చంపిన పొలం తనకు వద్దంటూ తండ్రి ఎన్.టి.రామారావు ఆ రెండు వందల ఎకరాలను అమ్మేసారని కూడా హరిక్రిష్ణ చెప్పడం కొసమెరుపు.