Begin typing your search above and press return to search.

ఆంధ్రోళ్ల‌కు ఇవ్వాల్సిన జోన్ కి పంగ‌నామాలు?

By:  Tupaki Desk   |   13 May 2017 5:14 AM GMT
ఆంధ్రోళ్ల‌కు ఇవ్వాల్సిన జోన్ కి పంగ‌నామాలు?
X
ఆంధ్రోళ్ల‌కు మ‌రో అన్యాయం జ‌ర‌గ‌నుందా? రాష్ట్ర విభ‌జ‌న కార‌ణంగా కోలుకోలేని దెబ్బ త‌గిలిన ఆంధ్రోళ్ల‌కు.. హోదాతో భారీ దెబ్బేసిన కేంద్రంలోని మోడీ స‌ర్కారు.. విభ‌జ‌న నేప‌థ్యంలో ఇచ్చిన హామీల్లో కీల‌క‌మైన విశాఖ‌కు రైల్వే జోన్ హామీ మీద కూడా హ్యాండ్ ఇవ్వ‌నున్నారా? అన్న అనుమానం బ‌ల‌ప‌డే వ్యాఖ్య ఒక‌టి రైల్వేబోర్డు ఛైర్మ‌న్ నోటి నుంచి రావ‌టం గ‌మ‌నార్హం. విభ‌జ‌న జ‌రిగి మూడేళ్లు అవుతున్నా.. పార్ల‌మెంటు సాక్షిగా ఇచ్చిన హామీల్ని అమ‌లు చేసే విష‌యంలో తీవ్ర‌మైన జాప్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్న మోడీ స‌ర్కారు.. ఇప్ప‌టికే కీల‌కాంశాల విష‌యంలో ఎంత దారుణంగా వ్య‌వ‌హ‌రించిందో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.

ఏపీకి ప్రాణ‌వాయువు లాంటి ప్ర‌త్యేక హోదాకు త‌మ‌దైన శైలిలో మంగ‌ళం పాడేసి.. భారీ దెబ్బేసిన మోడీ స‌ర్కారు.. విశాఖ‌కు ఇస్తామ‌న్న రైల్వేజోన్ హామీని.. విభ‌జ‌న చ‌ట్టంలోని చిన్న వెసులుబాటుతో వ‌దిలేద్దామ‌ని భావిస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. కోట్లాది మంది ఆకాంక్ష విష‌యంలో కేంద్రం ఎంత సీరియ‌స్ గా ఉందో.. ఆంధ్రోళ్ల అభివృద్ధి విష‌యంలో రైల్వే బోర్డు ఛైర్మ‌న్ స్థాయి వ్య‌క్తికి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయ‌న్న విష‌యాన్ని త‌న నోటి మాట‌ల‌తో చెప్పేశారు.

తాజాగా విశాఖ‌కు వ‌చ్చిన ఆయ‌న్ను విశాఖ ఎంపీ హ‌రిబాబు.. అన‌కాప‌ల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాస‌రావులు క‌లిశారు. ఈ ఇద్ద‌రు ఎంపీలు.. విశాఖ‌కు రైల్వే జోన్ గురించి రైల్వే బోర్డు ఛైర్మ‌న్ ను అడ‌గ్గా.. తొలుత ఏపీకి రైల్వే జోన్ ఎందుకు? అని అడిగిన‌ట్లుగా తెలుస్తోంది. అనంత‌రం ఎంపీల రియాక్ష‌న్ ను గ‌మ‌నించిన ఆయ‌న‌.. త‌న మాట‌ల్ని స‌రి చేసుకుంటూ.. స‌ద‌రు అంశం రాజ‌కీయ అంశమ‌ని.. త‌మ చేతుల్లో ఏమీ లేద‌న్న మాట‌ను చూస్తే.. విశాఖ రైల్వేజోన్ ముచ్చ‌ట‌లో ఏపీకి మ‌రోసారి అన్యాయం జ‌రుగుతుంద‌న్న వాద‌న బ‌లంగా వినిపిస్తోంది.

విశాఖ‌కు రైల్వేజోన్ డిమాండ్ ఇప్ప‌టిదేం కాద‌ని.. ద‌శాబ్దాల నుంచి ఉన్న‌దేన‌ని.. రాష్ట్ర విభ‌జ‌న సంద‌ర్భంగా చ‌ట్టంలోనూ పేర్కొన్నార‌ని.. దాన్ని అమ‌లు చేయాల‌ని డిమాండ్ చేశారు. రైల్వేజోన్ ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌ల ఆకాంక్ష‌గా.. భావోద్వేగాల‌కు సంబంధించిన అంశంగా రైల్వే బోర్డు ఛైర్మ‌న్ దృష్టికి తీసుకెళ్లారు. మ‌న‌సులో ఏపీకి ఎలాంటి లాభం చేయాల‌న్న ఆలోచ‌న లేన‌ప్పుడు.. ఎవ‌రు ఎన్ని మాట‌లు చెప్పినా ప్ర‌యోజ‌నం ఏమైనా ఉంటుందా? అన్న‌దే అస‌లు ప్ర‌శ్న‌.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/