Begin typing your search above and press return to search.

సెటైర్ : హరిలో రంగ హరీ.. సరిసరి!!

By:  Tupaki Desk   |   2 March 2018 5:09 PM GMT
సెటైర్ : హరిలో రంగ హరీ.. సరిసరి!!
X
‘‘శ్రీ మద్రారామయణ గోవిందో.. హ్హారీ!

ఇవాళ శ్రీమద్భాగవతం అంతర్భాగం అయినటువంటి.. దైవసుతుడు నరేంద్రమోడీ గారి విశాల హృదయమును గురించియూ... ఏతత్ పర్యవసానముగా.. ఆంధ్రప్రదేశం అనబడు ఈ అర్భక రాష్ట్రము యెడల మోడీ గారి డెందమునందు ఉప్పొంగి గంగాభాగీరథీ నదీ సమానమై ప్రవహించు నిధుల ప్రవాహము.. కడు సమున్నతము అని మీకందరకూ నివేదనము సేయుచున్న వాడ!

ఈ భూ ప్రపంచము అవతరించిన నాటినుంచియు.. శ్రీమద్ నారాయణ మూర్తి కూడాయూ.. సకల ప్రాణికోటిని వేర్వేరు సందర్భములలో సముద్ధరించిన తన దశావతరాలలో కూడను.. ఈ స్థాయిలో వేరొక్కరకు అయినానూ సాయ మొనర్చిన ముచ్చట లేనే లేదని నేను మనవి చేసుకొనుచుంటిని.

నారాయణమూర్తి దశావతారములను మించి.. కలియుగ శ్రీమన్నారాయణ స్వరూపుడా అని భ్రమ కలుగునటుల.. నరేంద్రమోడీ గారు.. ఆంధ్రప్రదేశము యెడల ప్రకటించుచున్న అవ్యాజ ప్రేమానురాగములు.. తుపాను వలె ఈ రాష్ట్రాన్ని ముంచి మునకలు వేయించుచున్నవని.. నివేదించ వలసి వస్తున్నది..

భజన పరులు స్వాతంత్ర్యము వచ్చిన పిమ్మట భారత దేశ చరిత్రలో కేంద్రప్రభుత్వము అనునది మరే యితర రాష్ట్రమునకు ఇవ్వనంత నిధులను.. మోడీ ప్రభుత్వం.. ఏపీ సర్కారుకు ప్రదానము చేసినదని.. ప్రల్లదనములు పలుకుదురు.

సత్యము నేను చెప్పెదను వినుడు. స్వాతంత్ర్యము లెక్క ఏల... సృష్టి జరిగినది మొదలు.. మానవ దేవత భూత పశుపక్ష్యాది ప్రాణికోటి సమస్తములోనూ... ఏ ఒక్కరూ మరే ఒక్కరకూ చేసి ఉండనంత సాయము మోడీ ఆంధ్రకు చేసెను.

కాకున్నచో అది దేవతా సాయము.. దేవతా రహస్యము. ఇతరులకు చెప్పెడిది కాదు.. ఇతరులకు కనిపించెడిది కాదు. మూర్ఖులైన తెలుగు ప్రజలకు - మేధావులకు అస్సలు కనిపించదు.. అని కూడా నివేదించుచున్నాను...’’

... దిగ్గున లేచి కూర్చున్నాడు కంభంపాటి హరిబాబు. ఇంకా చీకటిగా ఉంది. టైము ఉదయం నాలుగున్నర. తెల్లవారు జామున వచ్చిన కలలు నిజమౌతాయ్ అనుకున్నాడు. ఈ కలను వీడియో రికార్డింగ్ చేసి అమిత్ షాకు పంపితే గనుక.. తెలుగుదేశమోళ్లు రాజీనామా చేయగానే కేంద్ర కేబినెట్ లో తనకు పదవి గ్యారంటీ అనుకున్నాడు. మన సు నిమ్మళంగా అనిపించింది. మంచం పక్కనే ఉన్న రాగిచెంబులోంచి కాసిని నీళ్లు తాగి మళ్లీ పడుకున్నాడు.