Begin typing your search above and press return to search.

హరిబాబుకు ఇచ్చిన టైం కంటే టీడీపీకి ఇచ్చిన టైం తక్కువ

By:  Tupaki Desk   |   20 July 2018 7:58 AM GMT
హరిబాబుకు ఇచ్చిన టైం కంటే టీడీపీకి ఇచ్చిన టైం తక్కువ
X
కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన - చర్చకు ఆమోదం పొందిన తెలుగుదేశం పార్టీ తన గళం వినిపించగలిగే పరిస్థితులు మాత్రం కనిపించడం లేదు. ఇందుకు కారణం... సభలో సంఖ్యాబలం ఆధారంగా ఆయా పార్టీలకు సమయం కేటాయించడమే. ఉదయం 11 నుంచి సాయంత్రం 6 వరకు జరిగే చర్చలో అతి పెద్ద పార్టీ అయిన బీజేపీకి 3.33 గంటల సమయం మాట్లాడే అవకాశం దొరికింది. అవిశ్వాసం పెట్టిన తెలుగుదేశం పార్టీకి కేవలం 13 నిమిషాల సమయమే దొరికింది. మరోవైపు... ఏపీ విభజన హామీల విషయంలో రెండు పార్టీల మధ్య సయోధ్య చెడడం... అవిశ్వాసానానికీ అదే కారణం కావడంతో ఇప్పుడు కేంద్రం ఏపీకి ఏం చేసిందో చెప్పడానికి ఏపీకే చెందిన తమ పార్టీ ఎంపీ కంభంపాటి హరిబాబుకు బీజేపీ ఎక్కువ సమయం ఇచ్చింది. తమకున్న 3.33 గంటల్లో హరిబాబుకు ప్రత్యేకంగా 15 నిమిషాలు కేటాయించింది. అంటే.... బీజేపీ ఎంపీ మాట్లాడే సమయం కంటే మొత్తం టీడీపీ ఎంపీలు మాట్లాడాల్సిన సమయం ఇంకా రెండు నిమిషాలు తక్కువే అన్నమాట.

సమయం చాలా తక్కువగా ఉండడం వల్ల టీడీపీ ఎలాంటి వ్యూహం రచించాలో అర్థం కాక మార్పులు చేస్తోంది. తొలుత... అవిశ్వాసం పెట్టిన కేశినేని నానితోనే తొలుత దీని చర్చ ప్రారంభింపజేయాలని అనుకున్నారు. కానీ.... గల్లా జయదేవ్‌ కు ఆ అవకాశం ఇస్తూ స్పీకర్‌ కు నాని తెలియజేశారు. ఇంగ్లిష్‌ లో జయదేవ్ బాగా మాట్లాడగలగడమే అందుకు కారణం. పైగా చర్చ ప్రారంభించిప్పుడు ఆ పార్టీకి కేటాయించిన 13 నిమిషాల సమయం లెక్క ఉండదు. అంటే... జయదేవ్ ఎక్కువ సేపు మాట్లాడే అవకాశం ఉంటుంది. గత సమావేశాల్లో సభలో జయదేవ్ గట్టిగా మాట్లాడిన నేపథ్యంలో ఇప్పుడు ఆయన్ను మళ్లీ ఉఫయోగించుకోవాలని చంద్రబాబు అనుకుంటున్నారు.

ఇక పార్టీకి కేటాయించిన 13 నిమిషాల్లో కేశినేని నాని - మరో ఎంపీ రామ్మోహన్ నాయుడు మాట్లాడుతారు. రామ్మోహన్ ఇంగ్లిష్ - హిందీల్లో మాట్లాడి ఏపీ సమస్యలను దేశంలోని ఇతర పార్టీలన్నిటికీ అర్థమయ్యేలా చేస్తారనేది ఇక్కడ వ్యూహం. అవిశ్వాసంపై చర్చ నేపథ్యంలో ఏపీ నుంచి అధికారులు - కొందరు మంత్రులు కూడా దిల్లీలో మోహరించారు. అవిశ్వాస తీర్మానంలో మాట్లాడేవారికి అవసరమైన వారికి సాయం చేయడానికి ఏపీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు - ప్రణాళికమండలి ఉపాధ్యక్షుడు కుటుంబరావు వచ్చారు.