Begin typing your search above and press return to search.

ఫ్లైట్ ఎక్కిన హ‌రిబాబు..టెన్ష‌న్ పుట్టిస్తున్న లిస్ట్‌!

By:  Tupaki Desk   |   3 Sep 2017 4:49 AM GMT
ఫ్లైట్ ఎక్కిన హ‌రిబాబు..టెన్ష‌న్ పుట్టిస్తున్న లిస్ట్‌!
X
కొత్త ర‌క్తం ఎక్కించేందుకు రంగం సిద్ధ‌మైంది. 2019 ఎన్నిక‌ల క్యాబినెట్ గా అభివ‌ర్ణిస్తున్న మంత్రివ‌ర్గ పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌కు అవ‌స‌ర‌మైన అన్నీ ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ రోజు (ఆదివారం) ఉద‌యం మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నుంది. మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ వ్య‌వ‌హారం గంట‌ల్లోకి వ‌చ్చినా.. ఎవ‌రికి మంత్రి ప‌ద‌వి ద‌క్క‌నుంద‌న్న దానిపై ఉత్కంట వ్య‌క్త‌మ‌వుతోంది.

మామూలుగా అయితే ఇలాంటి సంద‌ర్భాల్లో ముందు రోజే జాబితా విడుద‌ల‌య్యేది. ఈసారీ విడుద‌లైనా.. అందులోని పేర్ల‌కు.. బ‌య‌ట వినిపిస్తున్న పేర్ల‌కు మ‌ధ్య కొన్నింటికి లింకు లేక‌పోవ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. తెలుగు రాష్ట్రాల‌కు సంబంధించి విశాఖ బీజేపీ ఎంపీ హ‌రిబాబుకు మంత్రివ‌ర్గంలో చోటు ల‌భిస్తుంద‌న్న విస్తృత ప్ర‌చారం జ‌రిగింది.

ఇందుకు త‌గ్గ‌ట్లే ఆయ‌న అభిమానులు.. అనుచ‌రులు.. స‌న్నిహితులు.. ప‌లువురు నేత‌లు ఆయ‌న‌కు ముంద‌స్తు అభినంద‌న‌లు తెలిపారు ఇదంతా ఒక ఎత్తు అయితే.. శ‌నివారం రాత్రి ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటు చేసుకుంది. మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో అవ‌కాశం ల‌భించింద‌న్న ప్ర‌చారం స‌ర్వ‌త్రా జ‌రుగుతున్న వేళ‌.. ఢిల్లీ ప్ర‌యాణానికి సిద్ధ‌మ‌య్యారు హ‌రిబాబు. దీంతో.. ఆయ‌న వ‌ర్గంలో ఆనందోత్సాహాలు పెల్లుబికాయి. అంద‌రి అభినంద‌న‌ల నేప‌థ్యంలో ఆయ‌న ఢిల్లీకి ప్ర‌యాణ‌మ‌య్యారు. ట్విస్ట్ ఏమిటంటే.. మంత్రివ‌ర్గంలో చోటు ల‌భించింది వీరికేనంటూ ఒక అన‌ధికారిక జాబితా విడుద‌లైంది. అయితే.. ఇందులో హ‌రిబాబు పేరు లేక‌పోవ‌టంతో కొత్త క‌న్ఫ్యూజ‌న్ మొద‌లైంది. ఇంత‌కీ హ‌రిబాబుకు అవ‌కాశం ద‌క్కనుందా? లేదా అన్న‌ది ప్ర‌శ్న‌గా మారింది.

శ‌నివారం అర్థ‌రాత్రి 12 గంట‌ల స‌మ‌యానికి ఢిల్లీ చేరుకున్న ఎంపీ హ‌రిబాబు మాత్రం కాన్ఫిడెంట్ గా క‌నిపిస్తున్నారు. అన‌ధికారిక జాబితా కావ‌టంతో పేరు లేక‌పోయినా కంగారు లేద‌ని.. ఆయ‌న‌కు స్థానం ప‌క్కా అని చెబుతున్నారు. సానుకూల సందేశం రావ‌టంతోనే ఢిల్లీ ప‌య‌న‌మైన‌ట్లు చెబుతున్నారు. అన‌ధికారిక జాబితాలో పేరు లేనంత మాత్రాన కంగారు ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని.. మంత్రివ‌ర్గంలో చోటు ల‌భించ‌టం ఖాయ‌మ‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది. తాజా ప‌రిణామం హ‌రిబాబు వ‌ర్గీయుల్లో కొత్త టెన్ష‌న్ పుట్టిస్తోంది. మ‌రికొద్ది గంట‌ల్లో వారి ఉత్కంట తొలిపోతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.