Begin typing your search above and press return to search.

తల్లిదండ్రులను చూడనప్పుడు వారు కట్టించిన ఇంటి నుంచి వెళ్లిపోండి!

By:  Tupaki Desk   |   27 May 2022 6:30 AM GMT
తల్లిదండ్రులను చూడనప్పుడు వారు కట్టించిన ఇంటి నుంచి వెళ్లిపోండి!
X
వృద్ధులైన తల్లిదండ్రులను పోషించకుండా వేధిస్తున్న పిల్లలకు హరిద్వార్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్‌డీఎం) కోర్టు ఇచ్చిన తాజా తీర్పు చెంపపెట్టులాంటిది. తల్లిదండ్రులు కట్టించిన ఇంట్లో ఉంటూ వారి బాగోగోలు చూడకుండా వేధిస్తున్న పిల్లలు తక్షణం ఇంటి నుంచి వెళ్లిపోవాలని హరిద్వార్ కోర్టు సంచలనాత్మక తీర్పు వెలువరించింది.

తల్లిదండ్రులను చూడని ఆ పిల్లలను తల్లిదండ్రులు కట్టించిన ఇంటి నుంచి వెళ్లగొట్టాలని.. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. దీంతో దేశవ్యాప్తంగా తమ పిల్లల చేతిలో చీత్కారాలకు, అవమానాలకు, వేధింపులకు, దాడులకు గురవుతున్న తల్లిదండ్రులకు ఈ తీర్పుతో ఊరట లభించినట్టే.

కాగా ఈ కేసు వివరాల్లోకి వెళ్తే.. తాము కట్టించిన ఇళ్లలో ఉంటూ తమ పిల్లలు తమను పోషించడం లేదని.. ప్రతి సందర్భంలోనూ చీత్కారాలకు, వేధింపులకు, దాడులకు పాల్పడుతున్నారంటూ కొంతమంది తల్లిదండ్రులు హరిద్వార్ ఎస్‌డీఎం కోర్టు మెట్లెక్కారు. వాళ్ల వాదనలు విన్న హరిద్వార్ కోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. తల్లిదండ్రులను పోషించనప్పుడు.. వారి స్వార్జితమైన ఇంటి నుంచి వెళ్లిపోమని వారి పిల్లలను ఆదేశించింది. కోర్టు ఆదేశాలను పాటించకుంటే పోలీసు యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవాలని విస్పష్ట ఆదేశాలు జారీ చేసింది.

ఈ మేరకు తమను తమ పిల్లలు వేధిస్తున్నారని ఆరుగురు సీనియర్‌ సిటిజన్లు హరిద్వార్ ఎస్‌డీఎం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు సీనియర్ సిటిజన్లకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. మే 26న న్యాయమూర్తి పురాన్ సింగ్ రాణా ఈ కేసులను విచారించారు. జ్వాలాపూర్, కంఖాల్, రావాలి మెహదూద్ ప్రాంతాలకు చెందిన సీనియర్ సిటిజన్లు తమ పిల్లలపై పిటిషన్ వేశారు.

తాము పిల్లలతో కలిసే ఉంటున్నామని... కానీ తమకు ఆహారం పెట్టకుండా వేధిస్తున్నారని న్యాయమూర్తి ముందు కన్నీటిపర్యంతమయ్యారు. అన్నం పెట్టాలని అడిగితే కొట్టి దారుణంగా హింసించారని వాపోయారు. ఇలాంటి దుస్థితిలో తమ వృద్ధాప్య జీవితం నరకప్రాయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

తమ పిల్లల నుంచి ఉపశమనం కలిగించాలని ఈ మూడు వృద్ద జంటలు కోర్టును ఆశ్రయించాయి. పెద్దల పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి పురాన్ సింగ్ రాణా పిల్లలకు దిమ్మ తిరిగే తీర్పు ఇచ్చారు. ఈ మొత్తం కేసుల్లో తల్లిదండ్రుల ఆస్తిపాస్తులను పిల్లలకు చెందకుండా చేయాలని తీర్పు చెప్పారు. 30 రోజుల్లోగా వాళ్లు ఉంటున్న ఇళ్లను తల్లిదండ్రులకు అప్పగించి ఇళ్లు ఖాళీ చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇళ్ల ఖాళీ చేయకపోతే పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.