Begin typing your search above and press return to search.

శభాష్ హారిక.. యూట్యూబ్ క్లాసులు విని.. మెడికల్ సీటు కొట్టింది..!

By:  Tupaki Desk   |   9 Nov 2022 7:30 AM GMT
శభాష్ హారిక.. యూట్యూబ్ క్లాసులు విని.. మెడికల్ సీటు కొట్టింది..!
X
సోషల్ మీడియాను చాలా మంది సినిమాలు చూడటానికో.. పాటలు వినడానికో లేదంటే కాలక్షేపానికో వినియోగిస్తుంటారు. కానీ కొంతమంది మాత్రం సోషల్ మీడియాను సద్వినియోగం చేసుకొని కెరీర్ పరంగా ముందుకెళుతుంటారు. ఇలాంటి వారిని చూసినప్పుడు మనమెందుకు వీరిలాగా చేయలేకపోక పోతున్నామనే భావన ప్రతి ఒక్కరిలో కలుగక మానదు.

తాజాగా ఓ యువతి యూట్యూబ్లో క్లాసులు విని ఏకంగా మెడికల్ సీటు సాధించింది. ఈ విషయం ఆ నోటా.. ఈ నోటా తెలియడంతో సోషల్ మీడియాలో ప్రస్తుతం ఆ యువతి గురించే చర్చ నడుస్తోంది. ఇదే సమయంలో సదరు యువతి ఆర్థిక పరిస్థితి బాగోలేదని తెలియడంతో పలువురు దాతలు ఆమెకు సాయం చేసేందుకు ముందుకొస్తూ తమ ఔదర్యాన్ని చాటుకుంటున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ జిల్లాలోని 36వ డివిజన్ నాందేవ్వాడలో సతీష్ కుమార్.. అనురాధ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి హారిక అనే కూతురు.. ఈశ్వర్ అనే కుమారుడు ఉన్నారు. కాగా వీరి తండ్రి చిన్నప్పుడే మృతిచెందాడంతో తల్లి బీడీ కార్మికురాలిగా పనిచేస్తూ పిల్లలను చదివిస్తోంది.

అనురాధ కూతురు హరిక చిన్నతనం నుంచి చదువులో చాలా చురుగ్గా ఉండేది. పదో తరగతిలో 9.5 జీపీఎ.. ఇంటర్లో 942 మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. ఇంటర్ తర్వాత నీట్ ర్యాంక్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ఇంట్లోనే యూట్యూబ్ క్లాసులు వినడం ప్రారంభించింది. చక్కటి నోట్స్ ను తయారు చేసుకొని నీట్ పరీక్షలకు హాజరైంది.

ఈ క్రమంలోనే హరికకు జాతీయ స్థాయిలో 40 వేల ర్యాంకు.. రాష్ట్ర స్థాయిలో 700వ ర్యాంకు వచ్చింది. హైదరాబాద్లోని ఓ కళాశాలలో ఆమె మెడికల్ సీట్ వచ్చింది. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో హరిక ఇంట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న పలువురు దాతలు ముందుకొచ్చి ఆమెకు ఆర్థిక సాయం అందజేస్తున్నారు.

హారిక పరిస్థితి గురించి మీడియాలో తెలుసుకున్న నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన బాధ్యతను తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఎంబీబీఎస్ చదువుకు అయ్యే ఖర్చును భరిస్తానని తెలిపారు. తాజాగా నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సైతం హరికను ప్రభుత్వం నుంచి ఆర్థిక చేయూత అందిస్తామని భరోసా కల్పించారు.

ఎలాంటి కోచింగ్ సెంటర్లకు వెళ్లకుండా ఇంట్లోనే ఉంటూ యూట్యూబ్ క్లాసులు విని రాష్ట్ర స్థాయిలో ర్యాంకు సాధించిన హరికపై పలువురు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. శభాష్ హారిక అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.