Begin typing your search above and press return to search.

బాబుపై హ‌రికృష్ణ‌ ప‌వ‌ర్ పంచ్‌ లేశారుగా!

By:  Tupaki Desk   |   28 Jan 2017 5:43 AM GMT
బాబుపై హ‌రికృష్ణ‌ ప‌వ‌ర్ పంచ్‌ లేశారుగా!
X
తెలుగు ప్ర‌జ‌ల ఆరాధ్య దైవం దివంగ‌త నంద‌మూరి తార‌క‌రామారావు స్థాపించిన టీడీపీ ప్ర‌స్తుతం... ఆయ‌న అల్లుడు నారా చంద్ర‌బాబునాయుడు చేతి కింద‌కు వెళ్లిపోయింది. మామ అధికారంలో ఉండ‌గానే... బ‌లప్ర‌యోగం చేసి మ‌రీ దించేసిన చంద్ర‌బాబు... అధికారాన్ని లాగేసుకున్న వైనం ఏ ఒక్క తెలుగోడు కూడా మ‌రిచిపోలేని ఘ‌ట‌న‌. ఎన్టీఆర్ రాజ‌కీయ వార‌సుడిగా తెర ముందుకు వ‌చ్చిన నంద‌మూరి హ‌రికృష్ణ‌... బాబు వైఖ‌రిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ వేరు కుంప‌టి పెట్టేసుకున్నారు. అయితే త‌ద‌నంత‌ర కాలంలో ఆయ‌నను కూడా త‌న ద‌రికి చేర్చుకోవ‌డంలో చంద్ర‌బాబు మంత్రాంగం స‌ఫ‌లీకృత‌మైంద‌నే చెప్పాలి. ఓ సారి రాష్ట్ర కేబినెట్లో కీల‌క మంత్రి ప‌ద‌వి - మ‌రో ప‌ర్యాయం రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం ఇచ్చిన చంద్ర‌బాబు... హ‌రికృష్ణ అసంతృప్తిని ఎప్ప‌టిక‌ప్పుడు చ‌ల్లార్చుతూ వ‌చ్చారు. అయితే ప్ర‌తి విష‌యంలోనూ ఆయ‌న‌కు త‌గినంత ప్రాధాన్యం ఇవ్వ‌లేద‌న్న విష‌యంలో మాత్రం ఎలాంటి సందేహం లేద‌నే చెప్పాలి.

ఈ క్ర‌మంలో బ‌హిరంగ స‌మావేశాల్లోనే హ‌రికృష్ణ పార్టీ అధిష్ఠానంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డం, స‌భా వేదిక‌ల‌పైనే త‌న అసంతృప్తిని వెళ్ల‌గ‌క్కడం మ‌నంద‌రికీ తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న‌కు పార్టీలో ఏమాత్రం ప్రాధాన్యం పెర‌గ‌క‌పోగా... నానాటికీ త‌రుగుతూ వ‌చ్చింది. ప్ర‌స్తుతం పార్టీ పొలిట్ బ్యూరో స‌భ్యుడిగా కొన‌సాగుతున్న హ‌రికృష్ణ అస‌లు పార్టీ స‌మావేశాల‌కే రావ‌డం లేదు. ఈ ప‌రిస్థితి ఎందుకొచ్చింద‌న్న విష‌యం దాదాపుగా అంద‌రికీ తెలిసినా... ఆ మాటేదో హ‌రికృష్ణ నోట రాలేదు. అయితే నిన్న త‌మ సొంత జిల్లా అయిన కృష్ణా జిల్లాలో ప‌ర్య‌టించిన సంద‌ర్భంగా హ‌రికృష్ణ కాస్తంత న‌ర్మ‌గ‌ర్భంగానే మాట్లాడార‌ని చెప్పాలి. అస‌లు పార్టీలో తానెందుకు వెనుక బెంచీకే ప‌రిమితం కావాల్సి వ‌చ్చింద‌న్న విష‌యంపై హ‌రికృష్ణ చేసిన వ్యాఖ్య‌లు చంద్ర‌బాబుకు మింగుడు ప‌డ‌నివేన‌ని చెప్పాలి.

ఇక అస‌లు విష‌యంలోకి వ‌స్తే... హ‌రికృష్ణ రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఉన్న స‌మ‌యంలో కృష్ణా జిల్లా కోడూరు మండ‌లం న‌ర‌సింహాపురంలో ఓ సీసీ రోడ్డుకు త‌న ఎంపీల్యాడ్స్ నుంచి నిధులు మంజూరు చేశార‌ట‌. స‌ద‌రు రోడ్డు నిర్మాణం తాజాగా పూర్తి కావ‌డంతో ఆ రోడ్డును ప్రారంభించాల‌ని గ్రామ‌స్థులు హ‌రికృష్ణ‌ను కోరారు. వారి విజ్ఞ‌ప్తిని మ‌న్నించిన హ‌రికృష్ణ నిన్న న‌ర‌సింహాపురం వెళ్లి స‌ద‌రు రోడ్డును ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ... నిజం మాట్లాడతాను కాబట్టే తనను వెనక్కు పెట్టారని, నిజాలు మాట్లాడబట్టే ఇప్పటి వరకు ఎన్నో దెబ్బలు తగిలాయని వ్యాఖ్యానించారు. ఏ మేర న‌ష్టం జ‌రిగినా... నిజాలు మాట్లాడే విష‌యంలో మాత్రం వెన‌క‌డుగు వేసే ప్ర‌సక్తే లేద‌ని కూడా ఆయ‌న తేల్చిచెప్పారు. తెలుగు వాడికి ఒక గొప్ప గౌరవం తీసుకువచ్చిన నేతగా త‌న తండ్రి ఎన్టీఆర్ ను అని ఆయన కొనియాడారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/