Begin typing your search above and press return to search.

చంద్రబాబుపై సెటైర్ వేసిన హరికృష్ణ?

By:  Tupaki Desk   |   28 May 2017 6:08 AM GMT
చంద్రబాబుపై సెటైర్ వేసిన హరికృష్ణ?
X
ఏపీ సీఎం చంద్రబాబు, టీడీపీ శ్రేణులు మహానాడు నిర్వహిస్తూ సంబరాలు జరుపుకొంటున్న వేళ దివంగత నేత ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణ చేసిన వ్యాఖ్యలు వారికి షాక్ ఇచ్చాయి. ప్రస్తుతం నడుస్తున్న ప్రజాకర్షక సంక్షేమ పథకాలన్నీ దివంగత మహానేత ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించినవేనని హరికృష్ణ అన్నారు. ఈ రోజు ఉదయం ఎన్టీఆర్ ఘాట్ కు వచ్చి, తన తండ్రికి నివాళులు అర్పించిన ఆయన.. ఆ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వాలు పాత పథకాలకు కొత్త కలరింగ్ ఇచ్చి, వాటిని తమ పథకాలుగా చెప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నాయంటూ చంద్రబాబు ప్రభుత్వంపై సెటైర్లు వేశారు.

ఎన్టీఆర్ ను తెలుగు ప్రజలు ఎన్నటికీ మరువలేరని అన్నారు. ఆయన దూరమై ఇన్ని సంవత్సరాలు అయినా, ప్రజల మనసులో సుస్థిరంగా ఉన్నారని హరికృష్ణ చెప్పారు. మరోవైపు హరికృష్ణ కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా నెక్లెస్ రోడ్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వచ్చి నివాళులు అర్పించారు. జూనియర్ ఎన్టీఆర్ తో పాటు పలువురు ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ కార్యకర్తలు ఆయన స్మారక చిహ్నం వద్దకు వచ్చి నివాళులు అర్పిస్తున్నారు. పలువురు సినీ సెలబ్రిటీలు, ప్రముఖులు వస్తుండటంతో ఘాట్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

కాగా హరికృష్ణ, చంద్రబాబుల మధ్య సంబంధాలు దాదాపుగా తెగిపోయాయని చెప్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ మరో తనయుడు బాలకృష్ణ చంద్రబాబుకు అత్యంత ఆప్తుడిగా ఉన్నారు. ఇద్దరూ బావాబావమరుదులు కావడమే కాకుండా వియ్యంకులు కూడా అవుతారు. మరోవైపు హరికృష్ణ గతంలో తన రాజ్య సభ సభ్యత్వం పొడిగింపు కోరినా చంద్రబాబు అందుకు అంగీకరించకపోవడంతో ఇద్దరి మధ్య విభేదాలు తీవ్రమైనట్లుగా చెప్తున్నారు. దాంతోపాటు హరి తనయుడు జూ.ఎన్టీఆర్ ను చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ లు సరిగా ట్రీట్ చేయకపోవడం కూడా విభేదాలకు ఒక కారణమే. వీటన్నిటి నేపథ్యంలో హరికృష్ణ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/