Begin typing your search above and press return to search.

రాత్రికి రాత్రే వెలసిన హరికృష్ణ విగ్రహం

By:  Tupaki Desk   |   2 Dec 2018 9:54 AM GMT
రాత్రికి రాత్రే వెలసిన హరికృష్ణ విగ్రహం
X
శుక్ర‌వారం సాయంత్రం. విశాఖ బీచ్ రోడ్డు. జ‌న సంచారం - వాహ‌నాల రాక‌పోక‌ల ర‌ద్దీ. అదంతా అక్క‌డ మామూలే. ఒక రోజు గ‌డిచింది. శ‌నివారం రాత్రి అదే రోడ్డులో నానా హంగామా. మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావు విచ్చేశారు. చాలామంది టీడీపీ కార్య‌క‌ర్త‌లు - నంద‌మూరి అభిమానుల కోలాహలం అక్క‌డ క‌నిపించింది. కార‌ణం దివంగ‌త‌ నంద‌మూరి హ‌రికృష్ణ విగ్ర‌హావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం అక్క‌డ జ‌రుగుతోంది. శుక్ర‌వారం ఏ కార్య‌క్ర‌మ‌మూ లేదు.. శ‌నివారం విగ్ర‌హావిష్క‌ర‌ణ ఉంది. అందుకే అంత‌మంది వ‌చ్చారు. అంతే క‌దా.. అందులో వింతేముంది అని ఆలోచిస్తున్నారా?

ఇక్క‌డే అస‌లు మ‌త‌ల‌బు ఉంది. శనివారం బీచ్ రోడ్డులో నంద‌మూరి హ‌రికృష్ణ విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించారు. కానీ, శుక్ర‌వారం రాత్రి అక్క‌డ విగ్ర‌హ ఏర్పాటు ఆన‌వాళ్లు కూడా లేవు. క‌నీసం దిమ్మె కూడా నిర్మించ‌లేదు. ఇంకా విచిత్ర‌మేంటంటే.. విగ్ర‌హ ఏర్పాటు కోసం అధికారుల అనుమ‌తి తీసుకోక‌పోవ‌డం. అనుమ‌తుల సంగ‌తి ప‌క్క‌న పెట్టండి. క‌నీసం వారికి స‌మాచారం కూడా అందించ‌క‌పోవ‌డం ఇప్పుడు క‌ల‌క‌లం సృష్టిస్తోంది. ఈ వ్య‌వ‌హారం జోన్‌-2 అధికారుల మెడ‌కు బిగుసుకుంటోంది. త‌మ‌కు చెప్ప‌కుండానే విగ్ర‌హ ఏర్పాటు జ‌ర‌గ‌డంతో ఆగ్ర‌హించిన జీవీఎంసీ క‌మిష‌న‌ర్‌.. తాను మ‌ళ్లీ చెప్పేంత‌వ‌ర‌కు విధుల‌కు హాజ‌రు కావొద్దంటూ జోన్‌-2 అధికారుల‌కు హుకుం జారీ చేశారు.

హ‌రికృష్ణ‌తోపాటు దివంగ‌త సినీ న‌టుడు అక్కినేని నాగేశ్వ‌ర‌రావు - ద‌ర్శ‌క ర‌త్న దాస‌రి నారాయ‌ణ రావుల విగ్ర‌హాల‌ను బీచ్ రోడ్డులో మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావు శ‌నివారం ఆవిష్క‌రించారు. వాస్తవానికి ఎక్కడైనా విగ్రహాలు ఏర్పాటు చేయాలంటే.. ముందుగా విగ్రహాల కమిటీ చైర్మన్‌ అయిన జిల్లా కలెక్టర్‌ నుంచి అనుమతి పొందాలి.. కానీ జిల్లా కలెక్టర్ - జీవీఎంసీ ప్రత్యేకాధికారి కూడా అయిన కలెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌ నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోలేదు. కనీసం జీవీఎంసీ కమిషనర్‌ హరినారాయణన్‌ కు నోటిమాటగా నైనా సమాచారం ఇవ్వలేదు. శుక్ర‌వారం రాత్రి వ‌ర‌కు బీచ్ రోడ్డులో విగ్ర‌హ ఏర్పాటు స‌న్నాహాలు కూడా క‌నిపించ‌లేదు. రాత్రికి రాత్రే దిమ్మలు నిర్మించి విగ్రహాలను కొలువుదీర్చారు. మంత్రి ఆధ్వ‌ర్యంలో రిబ్బ‌న్ క‌టింగ్ తంతు కూడా పూర్తి చేశారు. మ‌రి అనుమ‌తి లేకుండా ఆవిష్క‌రించిన ఈ విగ్ర‌హాల‌ను తొల‌గించే ధ‌మ్ము అధికారుల‌కు ఉందా? లేక ప్ర‌భుత్వ పెద్ద‌ల ప‌నే క‌దా అని చూసీ చూడ‌న‌ట్లు ఊర‌కుంటారా? అని జ‌నం చ‌ర్చించుకుంటున్నారు.