Begin typing your search above and press return to search.

మరి ఇదే మాట అప్పట్లో చెప్పలేదే హరీశ్?

By:  Tupaki Desk   |   15 Feb 2017 5:23 AM GMT
మరి ఇదే మాట అప్పట్లో చెప్పలేదే హరీశ్?
X
తెలంగాణ రాష్ట్రం వస్తే చాలు.. మొత్తంగా మారిపోతుంది. అందరికి ఉద్యోగాలు వచ్చేస్తాయి. బతుకులు బాగుపడిపోతాయి. ఆంధ్రా పాలకులు పోయిన వెంటనే.. తెలంగాణలో ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుంది. ప్రజల కష్టాలు తీరిపోవటమే కాదు.. పేదలు అన్న వారే ఉండరన్నట్లుగా నాటి ఉద్యమ అధినేత.. నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పటం మర్చిపోకూడదు.

కేసీఆర్ మాటల్ని అదేపనిగా వల్లె వేసే హరీశ్ రావు నోటి వెంట కూడా ఉద్యోగాల ముచ్చట ఎన్నిసార్లు వచ్చిందో లెక్కే లేదు. నిజానికి తెలంగాణ ఉద్యమం గ్రామీణస్థాయిలోకి వెళ్లటమే కాదు..తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కొంగొత్త ఆశల్ని రేకెత్తించిందే.. ఉద్యోగాల విషయంలో ఊరించే ప్రకటన చేయటమే తెలంగాణ ఉద్యమ సెంటిమెంట్ మరింత బలోపేతం కావటమే కాదు.. తెలంగాణ రాష్ట్ర సాధనతోతమ దరిద్రాలన్నీతీరిపోతాయనిసగటు తెలంగాణ జీవి అనుకోవటాన్ని మర్చిపోలేం.

తెలంగాణ రాష్ట్రాన్ని సాధించటమే కాదు.. మరో రెండుమూడు నెలల్లో తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మూడేళ్లు దగ్గరకు వస్తున్న వేళ.. మంత్రి హరీశ్ రావు నోటి నుంచి వస్తున్న మాటలు వింటే అవాక్కు కావాల్సిందే. ఏరు దాటిన తర్వాత అన్న సామెత చందంగా.. ప్రభుత్వ ఉద్యోగం ప్రతిఒక్కరికి ఇచ్చే రాష్ట్రం ఈ భూమి మీద ఏదైనా ఉందా? అని ప్రశ్నించటమే కాదు.. సర్కారీ కొలువులతో పోలిస్తే.. ఎక్కువరెట్లు ప్రైవేటు కొలువులకు అవకాశం ఉంటుందన్న విషయాన్ని చెప్పుకొచ్చారు.

నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు కేసీఆర్ సర్కారు శాయశక్తులా కృషి చేస్తున్నట్లు చెప్పిన హరీశ్.. తాము చెప్పినట్లుగా లక్ష ఉద్యోగాల్ని ఇచ్చి తీరుతామని చెప్పారు. పరిశ్రమల ఏర్పాటుతో యువతకు ఉద్యోగాలు వస్తాయని చెప్పిన హరీశ్.. రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చే పని ఒక్కరోజులో పూర్తి కాదని.. అందుకు నిరంతరం కృషి చేయాలని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్ పని తీరును పొగిడేయటం గమనార్హం.

అయినా.. హరీశ్ ఏంది ఉద్యోగాల గురించి మాట్లాడటం ఏమిటన్నడౌట్ రావాలి. మామూలుగా అయితే.. సాగునీటి గురించో.. సిద్ధిపేట గురించో మాట్లాడే హరీశ్ ఇప్పుడు ఉద్యోగాల గురించి గళం విప్పటం వెనుక అసలు లెక్క వేరే ఉంది. ఉద్యోగాల మీద కోదండం మాష్టారు ఉద్యమం చేసేందుకు ఈ నెలలో ప్రోగ్రామ్ పెట్టిన నేపథ్యంలో.. హరీశ్ నోటి నుంచి తాజా మాటలు వచ్చాయని చెప్పాలి. తనదైన వాదనతో కోదండం మాష్టారి మాటలకు కౌంటర్ గా ఇప్పటి నుంచే తన వాదనను హరీశ్ వినిపిస్తున్నారని చెప్పక తప్పదు.

అందుకే కాబోలు.. అన్నీ వెంటవెంటనే పూర్తి కావని హరీశ్ చెబుతూ.. ఇలాంటి మాటల్నే ఉద్యమ సమయంలోనూ చెబితే బాగుండేదన్న మాట వినిపిస్తోంది. ఉద్యమ రోజుల్లో తెలంగాణ వస్తే చాలు.. అన్నీ మారిపోతాయని చెప్పినోళ్లే.. అధికారం చేతిలో ఉన్న వేళ.. అసలు సాధ్యమేనా? అంటూ వేస్తున్న ప్రశ్నలకు ప్రజలు తమదైన సమాధానం ఇస్తే కానీ.. నేతల నోటి నుంచి హామీల వరద పారకుండా ఉంటుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/