Begin typing your search above and press return to search.

విప్ చెవిలో హరీశ్ చెప్పిందేమిటి?

By:  Tupaki Desk   |   8 Oct 2015 6:10 AM GMT
విప్ చెవిలో హరీశ్ చెప్పిందేమిటి?
X
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు బుధవారం నిరవధికంగా వాయిదా పడటం తెలిసిందే. అనుకున్న దాని కంటే ముందే అసెంబ్లీని వాయిదా వేయటం తెలిసిందే. రైతుల ఆత్మహత్యలకు రుణమాఫీని దఫాలుగా చెల్లించటమేనని.. సింగిల్ పేమెంట్ తో తీసేస్తే.. రైతులు అప్పుల ఊబి నుంచి బయటపడతారంటూ తెలంగాణ విపక్షాలు నిరసన వ్యక్తం చేయటం.. దీనికి అగ్రహించిన అధికారపక్షం మజ్లిస్ మినహా మిగిలిన విపక్షాలపై సస్పెన్షన్ వేటు వేయటం తెలిసిందే.

ఈ నేపథ్యంలో విపక్షాలు కూర్చునే ప్రదేశమంతా ఖాళీగా కనిపిస్తుంది. మాట్లాడే వారి వైపే కెమేరా కన్ను ఉండటంతో తెలంగాణ అసెంబ్లీలో విపక్షాలు లేని లోటు టీవీల్లో పెద్దగా కనిపించింది లేదు. ఆసక్తికరంగా బుధవారం తెలంగాణ అసెంబ్లీలో విపక్షాల వైపు మాత్రమే కాదు.. అధికారపక్షంలో కూడా చాలా తక్కువ సంఖ్యలో హజరు కనిపించింది. అసెంబ్లీ అంతా ఖాళీగా ఉంది.

ఓపక్క సభలో అంశాల మీద చర్చ జరుగుతుంటే.. అధికారపక్షం నేతలు పల్చగా ఉండటం చేసి మంత్రి హరీశ్ తల పట్టుకునే పరిస్థితి. సభలో ఉండాల్సిన అధికారపక్ష ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారో తెలుసుకొని ఆయన కంగుతిన్నారు. బుద్ధిగా అసెంబ్లీకి వచ్చిన అధికారపక్షం నేతలు.. తర్వాత పత్తా లేకుండా పోవటం.. వారేం చేస్తున్నారన్న సందేహం వచ్చిన హరీశ్.. ప్రభుత్వ విప్ గంపా గోవర్ధన్ ను చూసి రమ్మాన్నారు.

అసెంబ్లీ లాబీల్లో అధికార సభ్యులంతా ఉండి ముచ్చట్లు చెప్పుకోవటం చూసిన విప్.. అదే విషయాన్ని హరీశ్ కు చెప్పారు. దీంతో.. ఆయన కస్సుమనటమే కాదు.. వెంటనే సభలోకి రావాలని చెప్పనట్లు విప్ చెవిలో చెప్పారు. దీంతో.. హరీశ్ అగ్రహం గురించి అధికారపక్ష సభ్యులకు వివరించటంతో ముచ్చట్లు బంద్ చేసిన గులాబీ దళం పరుగు పరుగున సభలోకి వచ్చిన బుద్ధిగా కూర్చుండిపోయారు.