Begin typing your search above and press return to search.

రెండు పక్షాలకు చెందిన వారిద్దరూ ‘సీన్లో’ మిస్

By:  Tupaki Desk   |   19 Oct 2015 6:30 AM GMT
రెండు పక్షాలకు చెందిన వారిద్దరూ ‘సీన్లో’ మిస్
X
తెలంగాణ అధికారపక్షానికి సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ తర్వాత.. అంత ఆదరణ.. పార్టీలో పట్టు.. వ్యూహంలో సమర్థత ఉన్న నేత ఎవరంటే.. అందరి నోట నుంచి వినిపించే మాట హరీశ్ రావు మాత్రమే. ఇక.. తెలంగాణ తెలుగుదేశానికి సంబంధించి చంద్రబాబు తర్వాత.. తెలంగాణలో అంతటి ప్రజాదరణ ఉన్న తెలుగుదేశం నేత ఎవరంటే అందరి నోట నుంచి వచ్చే పేరు.. రేవంత్ రెడ్డి.

రెండు పార్టీలకు చెందిన ఈ కీలకనేతలు ఇద్దరూ ఆదివారం నాటి అధినేతల మహా భేటీలో కనిపించకుండా ఉండటం గమనార్హం. ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానించేందుకు వీలుగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసానికి వెళ్లిన సంగతి తెలిసిందే. రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరుకావాలంటూ చంద్రబాబు కోరారు. అందుకు కేసీఆర్ సైతం సానుకూలంగా స్పందించారు. ఇదిలా ఉంటే.. కేసీఆర్ నివాసానికి వెళ్లిన చంద్రబాబుకు అక్కడ తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహ్మద్ అలీ.. మంత్రులు కేటీఆర్.. జగదీశ్ రెడ్డిలు ఉన్నారు.

అదే సమయంలో చంద్రబాబు వెంట తెలంగాణ పార్టీ సారథి ఎల్. రమణ.. టీటీడీపీ శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్ రావులు ఉన్నారు. ఆసక్తికరంగా చంద్రబాబును విపరీతంగా ద్వేషించే హరీశ్ రావు ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసంలో కనిపించలేదు. ఇక.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు వింటేనే మండిపోయే రేవంత్ రెడ్డి చంద్రబాబు వెంట లేకపోవటం గమనార్హం. ఇలా ఇద్దరు ఫైర్ బ్రాండ్ ఇద్దరు అధినేత మధ్య జరిగిన మహా భేటీకి లేకపోవటం అన్నది అనుకోకుండా జరిగిందా? లేక.. ప్రణాళిక ప్రకారం జరిగిందా? అన్నది చర్చగా మారింది. ఏది ఏమైనా రెండు పార్టీలకు చెందిన ముఖ్యనేతలు ఇద్దరు చంద్రుళ్ల మహాభేటీకి గైర్హాజరు కావటం అనుకోకుండా జరిగే అవకాశం తక్కువన్న మాట బలంగా వినిపిస్తోంది. లోగుట్టు పెరుమాళ్లకెరుక.