Begin typing your search above and press return to search.

వెంకయ్య బాటలో నడుస్తున్న కేసీఆర్ బ్యాచ్

By:  Tupaki Desk   |   3 April 2017 4:46 AM GMT
వెంకయ్య బాటలో నడుస్తున్న కేసీఆర్ బ్యాచ్
X
ప్రధాని మోడీని ఎంతమంది పొగిడినా.. అవేమీ కేంద్రమంత్రి వెంకయ్యనాయుడి పొగడ్తల ముందు తేలిపోవాల్సిందే. మోడీని భగవత్ స్వరూపంగా అభివర్ణించటమే కాదు..తన అంత్యప్రాసల మాటలతో మనసు దోచుకునేలా మాట్లాడటంలో నేర్పరి. మనిషిని దేవుడితో పోల్చటంలో ఘనాపాఠి లాంటి వెంకయ్య తరహాలోనే రియాక్ట్ అవుతున్నారు తెలంగాణ రాష్ట్ర మంత్రులు. తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను దైవసమానంగా కొలవటమే కాదు.. ఆయన ఏ దేవుడికి ప్రతిరూపమో తెలుసా? అంటూ తెలంగాణ మంత్రులే స్వయంగా పొగిడేస్తున్న వైనం ఇప్పుడు సంచలనంగా మారింది.

ఎవరు వినతిపత్రాలు ఇవ్వకుండానే.. ప్రజల బాధల గురించి ఆలోచించి.. సంక్షేమ కార్యక్రమాల్నిచేపడుతున్న కేసీఆర్ శ్రీశైల మల్లన్నఅని ఒక మంత్రి అభివర్ణిస్తే.. తాను సైతం తక్కువ తినలేదన్నట్లుగా మరొకరు శ్రీకృష్ణుడిగా అభివర్ణించిన వైనం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కులవృత్తుల వారికి వరాల మీద వరాలు ప్రకటించటం ద్వారా.. ఆయా వర్గాలకు కొత్తదేవుడిగా ఆవిర్భవించిన కేసీఆర్ ను..తెలంగాణ రాష్ట్రమంత్రులు హరీశ్ రావు.. తలసాని శ్రీనివాస్ యాదవ్ లు ఓ రేంజ్లో పొగిడేస్తున్నారు.

గొర్రెల కాపరులు ప్రమాదవశాత్తు మరణిస్తే బీమా సొమ్మును రూ.3లక్షలకు పెంచాలని తాను అడిగితే.. ఆ మొత్తం ఏం సరిపోతుందంటే రూ.6లక్షలకు పెంచిన దయామయుడు కేసీఆర్ అంటూ అభివర్ణించారు మంత్రి తలసాని. మెదక్ జిల్లా నర్సాపూర్ లో నిర్వహించిన అభినందన సభలో కేసీఆర్ ను పోటీపడి మరీ.. ఆకాశానికి ఎత్తేశారు హరీశ్..తలసాని ఇద్దరూ.

గత ప్రభుత్వాలు ఎన్నికల వేళలో కుల సంఘాల మీటింగ్ లు పెట్టి.. అది చేస్తాం.. ఇది చేస్తామని చెప్పేవారని.. తర్వాత పత్తా ఉండేవారు కాదని..కానీ.. సీఎం కేసీఆర్ మాత్రం ఆకలి తెలిసిన మనిషి అని.. ఎవరూ ఊహించని రీతిలో బడ్జెట్ లో గొల్లకుర్మ.. యాదవులకు రూ.4వేల కోట్లు కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. 75శాతం సబ్సిడీతో గొర్రెలనే కాదు.. వాటిని అడవుల్లో మేపేందుకు అనుమతి ఇవ్వాలంటూ అటవీ అధికారుల్ని కేసీఆర్ ఆదేశించిన విషయాన్ని గుర్తు చేయటంతో పాటు.. విజయాడైయిరీలో పాలు పోసే రైతులకు వెంటనే డబ్బు చెల్లించే విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు.

కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో మిగిలిన పార్టీలేవీ మిగలబోవన్న హరీశ్.. గొల్లకుర్మలు.. యాదవుల సంక్షేమం కోసం కేసీఆర్ బడ్జెట్ లో రూ.4వేల కోట్లు కేటాయించిన వెంటనే కాంగ్రెస్ నేతలకు మైండ్ బ్లాక్ అయ్యిందన్నారు. సీఎంగా కేసీఆర్ మరో పదేళ్లు ఉండాలని కోరుకుంటూ కులదైవాలైన మల్లన్న.. బీరప్ప..మహంకాళమ్మలను ప్రార్థించాలని గొల్ల కుర్మ.. యాదవ ప్రజలను మంత్రి హరీశ్ కోరారు. ఓపక్క దైవ స్వరూపంగా కేసీఆర్ ను పేర్కొంటున్న హరీశ్.. తలసానిలు.. ఆయన కోసం దేవుళ్లను ప్రత్యేకంగా ప్రార్థించమని చెప్పటం ఏమిటో..? దైవస్వరూపానికి దేవుళ్ల దీవెనెలు అవసరమంటారా?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/