Begin typing your search above and press return to search.

హ‌రీశ్ మాట అస్స‌లు బాగోలేదు

By:  Tupaki Desk   |   15 May 2016 9:41 AM GMT
హ‌రీశ్ మాట అస్స‌లు బాగోలేదు
X
సుదీర్ఘ ఉద్య‌మంలో భాగ‌స్వామి అయిన మంత్రి హ‌రీశ్ రావు నోటి నుంచి తాజాగా వ‌చ్చిన మాట విస్మ‌యాన్ని రేకెత్తించేలా ఉంది. బాధితుల త‌ర‌ఫున త‌ర‌చూ గ‌ళం విప్పి.. సాయం కోసం ఆందోళ‌న‌లు చేసిన బ్యాక్ గ్రౌండ్ ఉన్న హ‌రీశ్‌.. తాను మంత్రి హోదాలో ఉంటూ.. త‌మ ప్ర‌భుత్వం అధికారంలో ఉండి కూడా బాధితుల‌కు సాయం అందించే విష‌యంలో ప్ర‌ద‌ర్శించిన పీనాసిత‌నం ప‌లువురు విమ‌ర్శించేలా ఉంద‌న‌టంలో సందేహం లేదు. అదిలాబాద్ జిల్లా భైంసా మండ‌లం దేగాం వ‌ద్ద టిప్ప‌ర్ ఢీ కొట్టిన ఘ‌ట‌న‌లో ఆటోలో ప్ర‌యాణిస్తున్న 18 మందిలో 16 మృతి చెందారు. ఈ మధ్య కాలంలో ఒక రోడ్డు ప్ర‌మాదంలో ఇంత భారీగా ప్ర‌యాణికులు మ‌ర‌ణించ‌టం ఇదే కావొచ్చు. టిప్ప‌ర్ లారీ ఆటో మీద నుంచి వెళ్లిపోవ‌టంతో ఆటోలో ప్ర‌యాణిస్తున్న 16 మంది అక్క‌డిక‌క్క‌డే మ‌ర‌ణించారు.

ఇంత భారీ దుర్ఘ‌ట‌న జ‌రిగిన‌ప్పుడు ప్ర‌భుత్వాలు పెద్దఎత్తున స్పందించ‌టం మామూలే. అందుకు భిన్నంగా మంత్రి హ‌రీశ్ తాజా మాట‌లు ఉండ‌టం గ‌మ‌నార్హం. ఈ దుర్ఘ‌ట‌న‌లో మ‌ర‌ణించిన ఒక్కొక్క‌రికి పార్టీ త‌ర‌ఫున రూ.25వేల చొప్పున ప‌రిహారం అందిస్తామంటూ చెప్ప‌టాన్ని ప‌లువురు విమ‌ర్శిస్తున్నారు. అన్నింటికి మించిన మృతి చెందిన వారంతా మ‌హారాష్ట్ర‌కు చెందిన వార‌ని.. బాధిత కుటుంబాల‌ను ఆదుకోవాల‌ని మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వాన్ని కోర‌తామ‌ని హ‌రీశ్ చెప్ప‌టం విడ్డూర‌మనే చెప్పాలి. ఎందుకంటే.. మ‌ర‌ణించిన వారంతా మ‌హారాష్ట్రకు చెందిన వారే అయిన‌ప్ప‌టికీ వారంతా కొన్నేళ్లుగా నిజామాబాద్ జిల్లా న‌వీపేట‌కు వ‌ల‌స వ‌చ్చి ఉంటున్నారు. కూలీ ప‌నుల కోసం కొన్ని సంవ‌త్స‌రాల క్రితం వ‌ల‌స వ‌చ్చిన వారంతా తెలంగాణ ప్రాంతంలోనే ఉంటున్నారు. అలాంట‌ప్పుడు వారు మ‌హారాష్ట్ర వాళ్లు అని వేరుగా చూడ‌టం స‌రికాద‌న్న భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

కొన్నేళ్లుగా తెలంగాణలో ఉంటున్న వారిని వేరే రాష్ట్రం వారిగా చూస్తూ రూ.25వేల చొప్పున పార్టీ త‌ర‌ఫున‌ న‌ష్ట‌ప‌రిహారంతో స‌రిపుచ్చ‌టం స‌రికాద‌న్న భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ప్ర‌భుత్వం త‌ర‌ఫున భారీ సాయాన్ని అందించాల్సిన అవ‌స‌రం ఉంది. నిజానికి ఇలాంటి ప్ర‌స్తావ‌న తీసుకురాకూడ‌దు కానీ.. తేలిగ్గా అర్థ‌మ‌వుతుంద‌న్న ఉద్దేశంతో ఒక ఉదాహ‌ర‌ణ‌ను చెప్పాల్సి వ‌స్తోంది.

రేపొద్దున తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు ఎవ‌రైనా ప్ర‌మాద‌వ‌శాత్తు వేరే రాష్ట్రంలో మ‌ర‌ణిస్తే.. అక్క‌డి ప్ర‌భుత్వం తెలంగాణ స‌ర్కారుతో మాట్లాడి న‌ష్ట‌ప‌రిహారం అందేలా చేస్తామ‌ని చెబితే ఎలా ఉంటుందో.. హ‌రీశ్ మాట కూడా అదే తీరులో ఉంద‌ని చెప్పొచ్చు. ప్రాంతం ఏదైనా.. ప్రాణం విలువైన‌ద‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు. మ‌ర‌ణించిన వారి ప్రాంతం ఆధారంగా ప‌రిహారం అందిస్తామ‌ని చెప్ప‌టంలో అర్థం లేద‌నే చెప్పాలి. పుట్టింది ఎక్క‌డైనా ప్రాణం పోయింది మ‌న ద‌గ్గ‌రే అన్న విష‌యం హ‌రీశ్ అండ్ కో గుర్తిస్తే బాగుంటుంద‌న్న భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఏ ఆలోచ‌న‌లో హ‌రీశ్ ఈ త‌ర‌హా మాట‌లు అన్నారో కానీ.. త‌న మాట‌ను వెన‌క్కి తీసుకొని.. మృతుల కుటుంబాల‌కు న్యాయ‌బ‌ద్ధంగా ప‌రిహారం అందించాల్సిన బాధ్య‌త తెలంగాణ ప్ర‌భుత్వం మీద ఉంద‌న‌టంలో ఎలాంటి సందేహం లేదు.