Begin typing your search above and press return to search.

సింహాస‌నానికి విధేయుడైన క‌ట్ట‌ప్ప‌లానా?

By:  Tupaki Desk   |   3 April 2017 6:01 AM GMT
సింహాస‌నానికి విధేయుడైన క‌ట్ట‌ప్ప‌లానా?
X
ఇదో సూటిప్ర‌శ్న‌. ఈ ప్ర‌శ్న‌ను ఇంకెవ‌రిని అడిగినా స‌మాధానం ఇట్టే చెప్పేస్తారు. కానీ.. వినేందుకే ఆస‌క్తి పెద్ద‌గా ఉండ‌దు. కానీ.. ఈ ప్ర‌శ్న‌ను తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ మేన‌ల్లుడు.. మంత్రి హ‌రీశ్‌ ను అడిగితే? ఆయ‌న చెప్పే స‌మాధానం కోసం వ్య‌క్త‌మ‌య్యే ఆస‌క్తి అంతాఇంతా కాదు. ఇంత‌కూ.. ఈ ప్ర‌శ్న‌కు హ‌రీశ్ రావు ఎలా స్పందించారు? ఏం స‌మాధానం చెప్పారు? అన్న విష‌యంలోకి వెళితే..

తాజాగా ఒక ప్ర‌ముఖ మీడియా సంస్థ హ‌రీశ్ రావుతో ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ చేసింది. ఈ సంద‌ర్భంగా ఆయ‌న వ్య‌క్తిగ‌త‌.. రాజ‌కీయ అంశాల‌తో పాటు.. ప‌లు అంశాల్ని ప్ర‌స్తావించారు. వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందే కేటీఆర్‌ ను కేసీఆర్ సీఎంను చేద్దామ‌ని అనుకుంటున్నట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయ‌ని.. దీనిపై మీరేం అంటారంటూ హ‌రీశ్‌ ను ప్ర‌శ్నించారు. దీనికి స్పందించిన ఆయ‌న చెప్పిన స‌మాధానం చూస్తే.. కేసీఆర్ నిర్ణ‌య‌మే త‌నకు శిరోధార్య‌మ‌ని.. కేసీఆర్ ఏది చెబితే తాను అది చేస్తాన‌ని చెప్పారు. కేసీఆర్ లేనిదే తాను లేన‌ని.. ఆయ‌న ఏం నిర్ణ‌యం తీసుకున్నా.. ఆ నిర్ణ‌యాన్ని తూచా త‌ప్ప‌కుండా అమ‌లు చేసే కార్య‌క‌ర్త‌గా త‌న‌ను చెప్పుకున్నారు హ‌రీశ్‌. కేసీఆర్ లేక‌పోతే హ‌రీశ్ లేడ‌ని.. ఆయ‌న నాయ‌క‌త్వంలోనే తానీ స్థాయికి ఎదిగాన‌ని.. ఆయ‌న ఏది చెబితే అది చేయ‌టానికి సిద్ధంగా ఉంటాన‌ని.. ఒక‌వేళ కేటీఆర్‌ కు కానీ బాధ్య‌త అప్ప‌జెబితే.. ఆయ‌న మాట‌కు క‌ట్టుబ‌డి ఉంటాన‌ని.. కేసీఆర్ గీసిన గీత‌ను దాట‌లేన‌ని.. దాట‌న‌ని తేల్చి చెప్పారు.

సింహాస‌నానికి విధేయుడైన క‌ట్ట‌ప్ప‌లానా? అన్న ప్ర‌శ్న‌కు బ‌దులిస్తూ.. వంద‌శాత‌మ‌న్న హ‌రీశ్‌.. కేసీఆర్ ఏం చెబితే హ‌రీశ్ అది చేస్తాడ‌ని.. కేసీఆర్ మాటే త‌న మాట అని.. పార్టీ మాటే త‌న మాట‌గా చెప్పారు. ఎన్నో సంద‌ర్భాల్లో త‌న‌కు కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించార‌ని.. ఆయ‌న ఆలోచ‌న‌ల‌న్నీ స‌మ‌ర్థ‌వంతంగా అమ‌లు చేశాన‌ని.. రేపు కూడా ఆయ‌న ఏం చెబితే అది అమ‌లు చేస్తాన‌ని చెప్పారు. కేటీఆర్ తో త‌న‌కు ఎలాంటి విభేదాలు లేవ‌ని.. ప‌నిలోనే త‌మ మ‌ధ్య పోటీ ఉంటుంద‌న్నారు.

కేటీఆర్ మంచి నాయ‌కుడిగా ప‌ని చేస్తున్నార‌ని.. విదేశాల‌కు వెళ్లి వ‌చ్చి.. ఐటీ మంత్రిగా బాగా రాణిస్తున్న‌ట్లుగా చెప్పారు. ముఖ్య‌మంత్రి ఏదైనా బాధ్య‌త అప్ప‌జెప్పిన‌ప్పుడు క‌లిసిక‌ట్టుగా అమ‌లు చేస్తామ‌ని చెప్పిన హ‌రీశ్‌.. కేటీఆర్ ముఖ్య‌మంత్రి అయితే.. ఆ నిర్ణ‌యం తీసుకున్నా తాను ప‌ని చేస్తాన‌ని చెప్పారు. పార్టీలో అంత‌ర్గ‌త విభేదాలు ఉన్న‌ట్లుగా చెప్పేవ‌న్నీ వాళ్లు.. వీళ్లు సృష్టించేవేన‌ని.. ఎలాంటి భేదాభిప్రాయాలు.. అంత‌ర్గ‌త విబేధాలు లేవ‌ని హ‌రీశ్ స్ప‌ష్టం చేశారు. హ‌రీశ్ ప్రాధాన్య‌త త‌గ్గిస్తున్నార‌న్న‌ది ఉత్త రూమ‌రే త‌ప్పించి ఇంకేం కాద‌న్నారు.

తెలంగాణ వ‌చ్చినా ఆంధ్రా కాంట్రాక్ట‌ర్ల‌దే రాజ్య‌మ‌న్న విమ‌ర్శ వినిపిస్తోంది క‌దా అన్న ప్ర‌శ్నకు హ‌రీశ్ బ‌దులిస్తూ.. ఆన్ లైన్లో నిర్వ‌హించిన వేలంలో ఎవ‌రు త‌క్కువ బిడ్డింగ్ వేస్తే వారికి కాంట్రాక్ట్ ద‌క్కుతుంద‌ని.. అందులో ప్ర‌భుత్వం కానీ మ‌రొక‌రు కానీ చేసేదేమీ లేద‌ని.. నిబంధ‌న‌ల‌కు త‌గ్గ‌ట్లే టెండ‌ర్లు పిలిచిన‌ట్లు స్ప‌ష్టం చేశారు. బిడ్డింగ్‌లో త‌క్కువ కోట్ చేసిన వారికి కాంట్రాక్టులు ద‌క్కాయ‌న్న హ‌రీశ్‌.. ఆంధ్రావాళ్ల‌కు వ్యాపారంలో విశేష అనుబంధం ఉంద‌ని.. ఇత‌ర రాష్ట్రాల్లో పాటు.. విదేశాల్లోనూ కాంట్రాక్ట‌ర్లుగా ప‌ని చేస్తున్నార‌ని.. అనుభ‌వం.. సామ‌ర్థ్యం ఉండి త‌క్కువ‌కు కోట్ చేసే వారికే టెండ‌ర్ ద‌క్కుతుంద‌ని.. ఆన్‌లైన్లో జ‌రిగే ప్ర‌క్రియ‌కు ఎవ‌రేం చేయ‌ర‌ని చెప్పారు.

ఓటుకు నోటు కేసుకు స్కెచ్ వేసింది హ‌రీశ్ అంటార‌న్న ప్ర‌శ్న‌కు స‌మాధాన‌మిస్తూ.. ప్ర‌భుత్వం.. చ‌ట్టం త‌న ప‌ని తాను చేసుకుంటూ పోతుందే త‌ప్పించి.. త‌న‌కు ఎవ‌రితోనూ సంబంధం లేద‌న్న హ‌రీశ్‌.. మొద‌ట్నించి పార్టీలో చురుగ్గా ఉండ‌టంతో ప్ర‌తి అంశంతోనూ సంబంధం ఉంద‌ని అనుకుంటార‌న్నారు. మూడేళ్ల అధికారంలో ఉండ‌టం బాగుందా? 12ఏళ్ల ఉద్య‌మ జీవితం బాగుందా? అంటే.. ఉద్య‌మ కాల‌మే బాగుంద‌న్న వ్యాఖ్య‌ను చేశారు హ‌రీశ్‌. ఎంత ఒత్తిడి ఎదుర్కొన్నా.. అరెస్ట్ లై జైలుకు వెళ్లినా ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చే స్పంద‌న‌.. దీవెన నాయ‌కుడికి చాలా గొప్ప‌గా ఉంటుంద‌ని.. అందువ‌ల్లే ఇంటికి వెళ్లిన వెంట‌నే నిద్ర ప‌ట్టేస్తుంద‌న్నారు హ‌రీశ్‌. అధికారంలో ఉన్న‌ప్పుడు ప్ర‌జ‌ల్లో అంచ‌నాలు ఎక్కువ‌గా ఉంటాయ‌ని.. వాటిని ఆందుకోవ‌టానికి మ‌రింత‌గా ప‌రిగెత్తాల్సి ఉంటుంద‌ని.. కానీ.. నిర్ణ‌యాల అమ‌లుకు కోర్టుల ప‌రిమితుల చ‌ట్రంలో ప‌ని చేయాల్సి ఉంటుంద‌న్న మాట‌ల‌తో.. ప‌వ‌ర్ కంటే.. ఉద్య‌మ‌మే బెట‌ర్ అన్న అభిప్రాయాన్ని హ‌రీశ్ వ్య‌క్తం చేయ‌టం గ‌మ‌నార్హం. ప్ర‌భుత్వంలో ఉన్న‌ప్పుడు స్వేచ్ఛ త‌క్కువ ఉంటుంద‌ని.. ఓ చ‌ట్రంలో ప‌ని చేయాల్సి ఉంటుంద‌ని.. ఉద్య‌మ స‌మ‌యంలో ఒక్కోసారి చిన్న త‌ప్ప‌ట‌డుగు వేసినా.. ఉద్య‌మం కోస‌మే క‌దా అని ప్ర‌జ‌లు క్ష‌మించే ప‌రిస్థితి ఉంటుంద‌ని హ‌రీశ్ చెప్ప‌టం గ‌మ‌నార్హం.

చాలామంది రాజ‌కీయ నేత‌ల‌కు సంబంధించిన వ్య‌క్తిగ‌త వివ‌రాలు త‌ర‌చూ బ‌య‌ట‌కు వ‌స్తుంటాయి. కానీ.. హ‌రీశ్ విష‌యంలో మాత్రం కాస్త భిన్నం. పాలిటిక్స్ మీదే త‌ర‌చూ మాట్లాడే ఆయ‌న.. ప‌ర్స‌న‌ల్స్ ను పెద్ద‌గా మాట్లాడ‌రు. అలాంటి హ‌రీశ్‌.. తాజా ఇంట‌ర్వ్యూలో వ్య‌క్తిగ‌త విష‌యాల్ని చెప్పుకొచ్చారు. ఇంట్లో పిల్ల‌ల బాధ్య‌త మొత్తం త‌న భార్యే చూసుకుంటుంద‌ని.. ఇంటి విష‌యాలు.. పిల్ల‌ల విష‌యాల‌న్నీ ఆమె చూసుకోవ‌టం వ‌ల్ల తాను ప్ర‌జాసేవ‌కు స‌మ‌యం కేటాయించ‌గ‌లుగుతున్నాన‌ని చెప్పారు. అయితే.. ఆమె కూడా విసుక్కునే సంద‌ర్భాలు చాలానే ఉంటాయ‌ని.. చివ‌ర‌కు అర్థం చేసుకొని.. ఇంత‌కు మించి చేయ‌గ‌లిగిందేమీ లేద‌ని స‌హ‌క‌రించే ద‌శ వ‌చ్చేసింద‌న్నారు. రాత్రి 11 గంట‌ల‌కు వెళ్లినా త‌లుపు తీయాల్సిన ప‌రిస్థిత‌ని.. ఉద‌యం ఆరు గంట‌ల‌కే లేచి పిల్ల‌ల్ని రెఢీ చేయాల‌ని.. వారికి కూడా అన్ని అల‌వాటు అయిపోయాయంటూ చెప్పారు. రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు చేసిన‌ప్పుడు.. ఇంటి ద‌గ్గ‌ర‌ కొంచెం మూడాఫ్ తో ఉంటామ‌ని.. అలాంట‌ప్పుడు త‌న స‌తీమ‌ణి అడిగితే కొన్ని షేర్ చేసుకుంటాన‌ని.. ఇలాంటి వాటికే బాధ ప‌డితే ఎలా అంటూ ధైర్యం చెబుతుంద‌ని త‌న స‌తీమ‌ణి గురించిన ముచ్చ‌ట్ల‌ను వెల్ల‌డించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/