Begin typing your search above and press return to search.

సమ్మె వెనక హరీశ్ రావు?

By:  Tupaki Desk   |   9 May 2015 7:13 AM GMT
సమ్మె వెనక హరీశ్ రావు?
X
ఇరు రాష్ర్టాల్లో వేతన సవరణ కోసం ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె తెలుగు రాష్ర్టాల పాలకులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కంటే...తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఎక్కువ శ్రద్ధ కేంద్రీకృతమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే తెలంగాణలో సమ్మె వెనక ముఖ్యమంత్రి కేటీఆర్ కుటుంబ రాజకీయాలు కూడా ఒక కారణం అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

కేసీఆర్ కుటుంబ పాలన సాగిస్తున్నారనే ప్రతిపక్షాల ఆరోపణలు ఎలా ఉన్నా... కేసీఆర్ కుటుంబ సభ్యులైన ఆయన కుమారుడు కేటీఆర్, కూతురు కవిత, మంత్రి టి.హరీశ్ రావుల మధ్య గ్యాప్ ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇటీవల జరిగిన టిఆర్‌ఎస్‌ ప్లీనరీ నిర్వహణలో ఆయనకు ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదు. దీంతో తన ప్రాబల్యాన్ని క్రమేణా తగ్గిస్తున్నట్లుగా ఉన్న చర్యలను గమనించిన హరీశ్ రావు ఆ భేటీలో వెనుక వరుసలో కూర్చున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఆర్టీసీ సమ్మెపై పార్టీ ఎంపీ, కేసీఆర్ కూతురు కవిత చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారింది.

తెలంగాణ ఆర్టీసీలో కీలక యూనియన్ గా ఉన్న తెలంగాణ మజ్దూర్‌ యూనియన్ (టిఎమ్‌యు)కి కేసీఆర్ మేనల్లుడు భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు గౌరవాధ్యక్షుడు. ఈ సంఘం ఎంప్లాయీస్‌ యూనియన్‌(ఈయూ) తోకలిసి ఆర్టీసీలో గుర్తింపు సంఘంగా ఉంది. ఈ సంఘాన్ని పెంచి పోషించింది టీఆర్ఎస్ పార్టీయే. అయితే ప్రస్తుతం ఆ సంఘమే సమ్మెలో కీలకపాత్ర పోషిస్తున్న విషయం గమనార్హం. ఈ విషయాలన్నీ పరిగణనలోకి తీసుకున్న కవిత ఆర్టీసీ సమ్మెను పరిష్కరించాల్సిది గౌరవ అధ్యక్షుడైన హరీశ్ రావుతో పాటు మంత్రి నాయిని నర్సింహారెడ్డి మాత్రమేనని అన్నారు. తద్వారా బాల్ హరీశ్ కోర్టులోకి నెట్టారు. మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ఆర్టీసీ సమ్మె విషయమై ఏమాత్రం కసరత్తు చేయడం లేదు.

మొత్తంగా సమ్మె ద్వారా హరీశ్ ను దెబ్బకొట్టాలనే ఎత్తుగడ ఉన్నట్లు సమాచారం. తమ సంఘం గౌరవ అధ్యక్షుడు, కేసీఆర్ మేనల్లుడు అయినప్పటికీ హరీశ్ రావు ఏ మాత్రం తమ వేతనాల విషయంలో న్యాయం చేయడంలేదనే చర్చ ఆర్టీసీ ఉద్యోగుల్లో సాగుతుంది. తద్వారా ఆయనపై అసంతృప్తి వచ్చి కేటీఆర్ లేదా కవితలను గౌరవ అధ్యక్ష స్థానం కోసం డిమాండ్ చేయవచ్చు. అదే సమయంలో సంఘం గౌరవ అధ్యక్షుడిగా ఉన్నా... ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే సమయంలో హరీశ్ క్రియాశీలంగా వ్యవహరించలేదనే ప్రచారం చేసే అవకాశం ఉంటుంది. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా ఈ చర్యకు పరిష్కారం దొరుకుతుందని ఈ విధంగా టీఆర్ఎస్ పెద్దలు చూస్తున్నట్లుందని చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.