Begin typing your search above and press return to search.

హుజురాబాద్‌ లో హరీష్‌ రావు బ్లాక్ మెయిల్ రాజకీయం?

By:  Tupaki Desk   |   26 Oct 2021 10:30 AM GMT
హుజురాబాద్‌ లో హరీష్‌ రావు బ్లాక్ మెయిల్ రాజకీయం?
X
హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రచారం చివరి ఘట్టానికి చేరుకుంది. ఈ ఎన్నికలో గెలవడం కష్టమేనే భావనలో టీఆర్‌ఎస్ వర్గాలున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే గెలుపే లక్ష్యంగా ప్రలోభాలకు దిగుతున్నారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నియోజకవర్గంలో ప్రభుత్వం ప్రకటిస్తున్న ఆచరణ సాధ్యం కానీ హామీలు చూస్తుంటే... టీఆర్‌ఎస్ నేతలు ఒత్తిడికి గురయి... ముందు వెనుక చూసుకోకుండా తాయిలాలు ప్రకటిస్తున్నారా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. టీఆర్‌ఎస్‌ గెలిస్తేనే హామీలు అమలు చేస్తామని అధికార పార్టీ నేతలు బెదిరింపులకు దిగుతున్నారు. హుజురాబాద్ ఎన్నిక బాధ్యతలను మంత్రి హారీష్‌ రావు తన భుజాల పై వేసుకున్నారు. ఆయన ఓటర్లను ఆకట్టుకునేందుకు చిత్ర విచిత్రమైన హామీలు ఇస్తున్నారు. దళిత బంధు మొదలు కొని అన్ని వర్గాలను ఆకట్టుకునేందుకు అమలు సాధ్యం కాని హామీలు ఇస్తూ అభాసుపాలవుతున్నారు.

హుజురాబాద్ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని పార్టీలో హమీల వర్షం కురిపిస్తాయి. బీజేపీ, కాంగ్రెస్ కంటే అధికార పార్టీ మితిమీరిన హామీలు ఇస్తోంది. అధికార పార్టీ ప్రలోభాలు అన్ని ఇన్ని కావు. హుజురాబాద్‌లో వెనుకా ముందు చూసుకోకుండా ఎలాంటి హమీ ఇవ్వడానికైనా సిద్ధపడుతున్నారు. హుజరాబాద్ ఎన్నికల బాధ్యతలను మంత్రి హరీష్‌ రావు భుజాన వేసుకున్నారు. రోజుకొక హామీతో ఓటర్లను ఆకట్టుకునేందు ప్రయత్నిస్తున్నారు. అయితే హరీష్‌రావు ఇష్టం వచ్చినట్లు హామీ ఇవ్వడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీఆర్‌ఎస్ అభ్యర్థిని గెలవడం కష్టమనే అనుమానాలు గులాబీ శ్రేణులు వ్యక్తమవుతున్నాయంట. గెల్లు శ్రీనివాస్‌ను గెలిపించుకోవడం కోసం టీఆర్‌ఎస్ నేతలు ఎంతకైనా తెగిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గంలో ప్రకటించిన తాయిలాలు చూస్తుంటే అందరిలోనూ అనుమానాలు పెరిగిపోతున్నాయి.

హుజురాబాద్‌ లో 25 వేల మంది దళితుల ఓటర్లు ఉన్నారు. వీరి ఓట్లను దక్కించుకోవడం కోసం దళిత బంధు ప్రకటించారు. దళిత బంధు ప్రకటించిన వెంటనే ఇతర సామాజిక వర్గాల నుంచి అనేక ఒత్తిడిలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆయా సామాజికవర్గాలను సంతృప్తి పర్చడం కోసం కులాల వారిగా సమీకరణలు చేస్తున్నారు. కుల సంఘాలతో ప్రత్యేకం భేటీ అవుతున్నారు. వారి ఓట్లను గంపగుత్తగా దక్కించుకునేందుకు తాయిలాలు ప్రకటిస్తున్నారు. ప్రచారం చివరి అంకానికి రావడంతో హరీష్‌ రావు చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.

గెలుపు కోసం ఇప్పటికే ఇచ్చిన హామీలు సరిపోవని హరీష్‌ రావు అనుకున్నారో ఏమో.. కొత్తగా రైతుల రుణం వడ్డీతో సహా మాఫీ చేస్తామని ప్రకటించారు. 57 ఏళ్లకు పెన్షన్, 5వేల ఇళ్లు పూర్తి చేస్తామని తెలిపారు. సొంత జాగా ఉన్న వారికి రూ.5 లక్షలు ఇస్తామని ప్రకటించారు. ఈ హామీలన్ని ఆయన ఊరికే ఇవ్వడం లేదు. హుజురాబాద్‌ లో టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే అమలు చేస్తామని పరోక్షం బెదిరిస్తున్నారు. ఇలాంటి బ్లాక్ మెయిల్ రాజకీయాలకు హుజురాబాద్ ఉప ఎన్నిక కేంద్రంగా మారింది. ఆచరణ సాధ్యం కాని హామీలు హరీష్ ఎలా ఇస్తున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. టీఆర్‌ఎస్‌కు హుజురాబాద్ ఉప ఎన్నిక చావో రేవో అనే విధంగా మారిందని, అందువల్లే హరీష్‌రావు, ఒత్తిడిలో ముందు వెనుకు చూసుకోకుండా హామీ గుప్పిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. టీఆర్‌ఎస్‌లో ఓటమి భయం ఆవరించి ఉందనే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. హుజురాబాద్‌లో గెలవడం కష్టమని భావించిన గులాబీ నేతలు ఇలా ప్రలోభాలకు దిగుతున్నారనే విమర్శలు ఊపందుకున్నాయి. ఇన్ని హామీలు ఇచ్చిన తర్వాత టీఆర్‌ఎస్ ఓడిపోయే ఈ హామీల సంగతి ఏమిటనే ప్రశ్నలు కూడా బలంగా వినిపిస్తున్నాయి.